తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహా రచయిత దాశరథి రంగాచార్య. ఈ సాహితీ దిగ్గజం మరణం తెలుగు సాహితీలోకానికి తీరని లోటు. తెలుగునాట జరిగిన కీలక సామాజిక పరిణామాలను తన రచనల్లో సజీవంగా చిత్రించి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన మహానుభావుడు. వాస్తవమూ, కల్పనా కళగా రూపాంతరం చెంది పాఠకుడికి ఒక గొప్ప అనుభవాన్ని సొంతం చేస్తాయి దాశరథి రచనలు. ఒక బలమైన ముద్ర, తిరుగులేని స్థానం దాశరథి రంగాచార్యది.
చారిత్రాత్మకమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకూ దాశరథి జీవించిన కాలం తెలుగు ప్రజలకు చాలా కీలకమైంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యమకారుడు దాశరథి. సామాజికంగా తీవ్ర సంఘర్షణ కాలంలో కలం పట్టకుండా ఉండలేని పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నారు. ఉద్విగ, ఉద్రిక్త కాలాన్ని గుప్పిట పట్టడానికి గాఢమైన సంకల్పంతో నవలా రచనలోకి దిగాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఘట్టాలు తప్ప మరో వస్తువు ఆ రోజుల్లో కనపడే అవకాశం లేదు. తన నవలా రచన నేపథ్యాన్ని గురించి- 'వట్టికోట ఆళ్వార్‌స్వామి వారు ఆత్మబంధువు. సాహిత్య బంధువు. వారు 'ప్రజల మనిషి' అనే నవలతో ప్రారంభించి యావత్తు పోరాటాన్ని కొన్ని నవలలుగా రచించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 'గంగు' నవల రాస్తూ అది అంసపూర్ణంగా వదిలి, 1961 ఫిబ్రవరి 5న కన్నుమూశారు. వారు ప్రారంభించిన నవలా రచన ఉద్యమాన్ని ఎవరైనా కొనసాగిస్తారనీ, మహోజ్వలం అయిన పోరాట గాథను భావితరాల వారికి అందిస్తారనీ ఆశించాను. ఎవరూ ముందుకు వచ్చినట్లు కనిపించలేదు. అలాంటి తరుణంలో నేను నవలా రచనను ఉద్యమంగా కొనసాగించడానికి సంకల్పించుకున్నాను.' అని రంగాచార్య తన 'చిల్లర దేవుళ్ళు' నవలకు ముందుమాటలో రాశారు. తన నవలా రచనకు నేపథ్యం ఎంత బలంగా ఉందో ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
పోరాటకాలం గడిచిన అనంతరం నిజాం పరిపాలనా కాలం నాటి ప్రజల జీవితాలను వాస్తవికంగా తన నవలల్లో అక్షర బద్ధం చేశారు. చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలలు ఆనాటి సమాజాన్ని మనకు చాలా దగ్గరగా చూపిస్తాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన పుచ్చలపల్లి సుందరయ్య గారు అనేక డాక్యుమెంట్ల ఆధారంగా సాధికారంగా 'వీర తెలంగాణా విప్లవపోరాటం - గుణపాఠాలు' రికార్డు చేశారు. ఇంగ్లీషులో రాసిన ఈ పుస్తకం తెలుగులో తొలిముద్రణగా 1973 ఏప్రిల్‌లో వెలువడింది. అప్పటికే దాశరథి 'చిల్లర దేవుళ్లు' రాయడం, వెలువడడం కూడా జరిగింది. సుందరయ్య రచన ఉద్యమం జరిగిన తీరుతెన్నులను, ఆనాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను డాక్యుమెంట్ రూపంలో అందిస్తుంది. దాశరథి 'చిల్లర దేవుళ్ళు', 'మోదుగుపూలు', 'జనపదం' నవలలు ఆనాటి ప్రజల జీవన పరిస్థితులను మనకళ్ళ ముందు సజీవంగా ప్రత్యక్షం చేపిస్తాయి. ఆనాటి మనుషులు స్వభావాలు, సంప్రదాయాలు, సంస్కారాలు, ఆధిపత్యాలు, అభిజాత్యాలు అత్యంత సహజంగా పాఠకుడికి అవగతమవుతాయి. ఒక చారిత్రక సందర్భంలో ఒక ఉద్యమానికి నేపథ్యంగా ఉన్న ప్రజల జీవనాన్ని అత్యంత ప్రతిభావంతంగా దాశరథి తన నవలల్లో చిత్రించారు. సుందరయ్య గారి 'వీర తెలంగాణా విప్లవ పోరాటం- గుణపాఠాలు' పుస్తకం, దాశరథి గారి నవలలూ ఆనాటి ఉద్యమాన్ని ఒక గొప్ప వాస్తవికతతో తెలుగు ప్రజల ముందుంచిన మహత్తర సాహిత్యం.
చిల్లర దేవుళ్ళు నవలలో ఒక దొర ఏలుబడిలో ఉన్న ఒక గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని మొత్తం తెలంగాణా సమాజంలో ప్రజల జీవన చిత్రాన్ని అద్దంలో చూపించినట్టు చూపిస్తారు. కథానాయకుడు సారంగపాణి సంగీతం పాఠాలు చెప్పుకోడానికి దొరను ఆశ్రయించడంతో నవల ప్రారంభమవుతుంది. సారంగపాణి పాత్ర నుండి దొర రామారెడ్డి, కరణం వెంకట్రావు, దొర కూతురు మంజరి, ఆడబాప వనజ వంటి ప్రధాన పాత్రలు పాఠకుడి మనసులోకి చొచ్చుకుపోతాయి. నవల ఆనాటి సమాజాన్ని పాఠకుడి ముందు సజీవంగా ఆవిష్కరింపజేస్తుంది.
ఈనాటి సమాజానికి నేపథ్యంగా ఉన్న ఆనాటి తెలంగాణ సమాజపు స్వరూపం పాఠకుల మదిలో ముద్రించుకుపోతుంది. దాశరథి నవలలు చదవకుండా తెలుగు సాహిత్య ప్రపంచాన్ని దాటడం దుస్సాధ్యం. రంగాచార్య గారి కళ్ళముందు నుండి 'తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం' కదిలి వెళ్ళింది. ఆ ప్రభావంతో ఒక గొప్ప నవలా రచయితగా దాశరథి ఆవిర్భవించారు. ఒక గొప్ప చారిత్రక ఉద్యమాన్ని చూసిన దాశరథికి ఆ తరువాతి పరిణామాలు అసంతృప్తిని కలిగించాయి. జనపదం నవలలో ఉద్యమానంతర పరిస్థితులను చిత్రించిన తీరులో అది కనపడుతుంది. ఉద్యమ తీవ్రతకు భయపడిన దొరలు గడీలను వదిలి పట్నాలకు పోయారు. పోలీస్ యాక్షన్ తరువాత కాంగ్రెస్ ఖద్దరుదారులై పోలీసుల రక్షణతో తిరిగి గడీలకు చేరుకున్నారు. నిజాం కాలం నాటి దుర్మార్గపు పరిస్థితులను చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు నవలల్లో చిత్రించిన దాశరథి, ఆ పోరాటం అనంతరం కాంగ్రెస్ మార్కు రాజకీయాల్తో తిరిగి దొరలు సరికొత్త రూపంలో ప్రజలను మోసం చేయడం జనపదం నవలలో చిత్రించారు. ఈ మూడు నవలలు ఒక నిర్ధిష్ట కాలాన్ని, దాని పరిణామంతో సహా నవలాబద్ధం చేయడం రంగాచార్య ప్రత్యేకత.
'బ్రిటీషిండియాలో జరిగిన పోరాటానికీ, తెలంగాణాలో జరిగిన పోరాటానికీ చాలా బేధాలు- తేడాలు కనిపిస్తాయి. 1857 నుంచి స్వాతంత్య్రం వచ్చేవరకూ జరిగిన పోరాటాలన్నీ భావావేశంతో జరిగినవే. ఇంగ్లీషువాడు మనదేశం విడిచి వెళ్ళిపోవాలి- అది నాటి ప్రధాన ఉద్దేశం. ఆ తరువాత సామాన్యునికి జరిగే ప్రయోజనాన్ని గురించి ఆలోచించడం గానీ, వివరించడం గానీ, చెప్పడం గానీ జరగలేదు. జరిగిన పోరాటాలన్నీ ఆవేదనా భరితాలు తప్ప నాటికి ఆర్థిక కారణాలు లేవు. ఈ దశాబ్దపు నాలుగో దశకంలో తెలంగాణాలో పెల్లుబికిన విప్లవ దావానలం ఆవేశాలకూ, ఉద్రేకాలకూ లోనయింది మాత్రం కాదు. నైజాం సర్కారోణ్ణి గద్దెదింపడం, గోలకొండ ఖిల్లా కింద గోరీ కట్టడం ఈ పోరాటంలోని ప్రధాన ఉద్దేశ్యాల్లో ఒకటి మాత్రమే. ... ఈ పోరాటం ప్రధానంగా భూస్వామ్య వ్యతిరేక పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటం. ...మన స్వాతంత్య్ర సమర చరిత్రలో ఇంత స్పష్టమైన అవగాహన ఉన్న పోరాటం మరొకటి లేదంటే అభిమానంతోగాని, అతిశయోక్తి కోసం గాని చెప్పిన మాట కాదు.. ' (చిల్లర దేవుళ్ళుకు ముందుమాట నుంచి)
దాశరథి గారి ఈ పై అవగాహన మనకెన్నో విషయాలను తెలియజేస్తుంది. సమాజం మౌలికంగా మారాల్సిన ఆవశ్యకతను ఆయన రచనలన్నింటా కనిపిస్తుంది. దాశరథి నవలలు కొన్ని సంఘటనల సమాహారంగా కాక మౌలిక అంశాలతో ఒక సమగ్రతను సంతరించుకుంటాయి. పాఠకుడికి అవగాహన స్థాయిని, చైతన్య స్థాయిని ఒక మెట్టు పెంచుతాయి.
చిల్లర దేవుళ్ళు నవలలో సారంగపాణి హైదరాబాద్‌లో కాచిగూడ స్టేషన్లో దిగి హౌటల్‌కి చేరుకుంటాడు. సుల్తాన్‌బజార్‌లోని మాడపాటి హనుమంతరావు గారింటికి వెళ్ళి ఆయన్ని దర్శించుకుంటాడు. ఆంధ్ర మహాసభ గురించి, తెలుగు భాష స్థితిగతుల గురించి వారిద్దరూ చర్చించుకుంటారు. ఈ నవలా రచన నాటికి మాడపాటి హనుమంతరావు సజీవంగానే ఉన్నారు. దాశరథి తన నవలలో మాడపాటి వారి పాత్రను ప్రవేశపెట్టి నవలకు మరింత సార్థకత చేకూర్చారు.
తెలంగాణ అస్థిత్వం పేరుతో ఇటీవల జరిగిన ఉద్యమాల నేపథ్యంలో తెలుగు భాష, మాండలికాల గురించి తీవ్ర చర్చలు జరిగాయి. భాష విషయంలో కొంత విపరీతాలకు కూడా దారితీసాయి. దాశరథి నవలల్లో భాషను గమనిస్తే తెలంగాణ మాండలికాన్ని ఆనాడే చాలా సహజంగా ఉపయోగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉర్దూ మిశ్రమంతో కూడా మాండలికాన్ని అవలీలగా తన నవలలో ఉపయోగించారు దాశరథి. ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో... ''నేను తెలంగాణలో మాట్లాడే భాషలో రచన చేయడం గొప్ప సాహసం. చాలామంది నన్ను ఆ భాషలో రాయవద్దని గొడవ పెట్టారు. మన భాషను చులకన చేయాలని రాస్తున్నావా అన్నారు. అది కేవలం న్యూనతాభావం ఫలితమే. అలా రాసేందుకు ఎంతమందిని నేను వ్యతిరేకించానో తెలియదు.' అని చెప్పారు. నవలా శిల్పం పట్ల, సంభాషణల నిర్వహణ పట్ల, మొత్తం నవల చిత్రీకరణలో దాశరథి ఎంతటి శ్రద్ధ వహించారో దీన్ని బట్టి తెలుస్తుంది. 'నేను ఏదో యాదృచ్ఛికంగా రచయితను కాలేదు. కావాలని అయ్యాను. నిజానికి నేను కవినై ఉండాల్సింది. వట్టికోట ఆళ్వారుస్వామి పోయాడు. ఇక తెలంగాణా గురించి ఇంకెవరు రాస్తారు? నవలల గురించి చాలా చదివాను. 'హౌ టు రీడ్ ఎ నావల్' అనే పుస్తకం చాలా శ్రద్దగా చదివాను. ఆ విధంగా కృషి చేసిన మాట నిజమే.' అన్నారు ఒక ఇంటర్వూ ్యలో.
ఆనాటి సమాజాన్ని అద్భుతంగా నవలీకరించిన దాశరథి ఆ తర్వాత తన కలాన్ని ఇతిహాసాల వైపు మళ్ళించారు. వేదాలను సరళమైన తెలుగు వచనంలో రాయడం వంటివి మంచి విషయాలే అయినా, ఆ కారణంగా నవలా రచనను విరమించడం తెలుగు సాహిత్యానికి నష్టం కలిగిందనడంలో సందేహం లేదు. ఒక మహత్తర ఆశయంతో జరిగిన ఉద్యమ స్వరూప స్వభావాల్ని అక్షరబద్ధం చేసి భావితరాలకు గొప్ప సాహిత్య సంపదను అందించగలిగారు. కాని ఆ ఉద్యమానంతరం నేటివరకూ జరిగిన అనేక పరిణామాలకు దాశరథి ప్రత్యక్ష సాక్షి. ఆనాటి ఆశలకు, ఆశయాలకూ నేటి పరిస్థితులకూ మధ్య జరిగిన పరిణామాలను కూడా అక్షరబద్ధం చేసి ఉంటే మరిన్ని గొప్ప నవలలు వచ్చేవి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఇటీవలి ఉద్యమాల సమయంలో దాశరథి స్తబ్ధంగానే ఉన్నారు. నిగూఢంగా ఉన్న తన ఆలోచనలను నవలీకరించి ఉంటే ఎంతో ప్రయోజనం కలిగి ఉండేది. బహిరంగంగా ప్రజలను రాచిరంపాన పెట్టిన నిజాం నవాబు వంటి పరిపాలకులను చూసిన దాశరథి ప్రజాస్వామ్యం పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న నేటి పాలకుల నిజస్వరూపాన్ని తన నవలల్లో చిత్రించి ఉండేవారు. నిజాం కాలం నాటి ఫ్యూడల్ వ్యవస్థను దాటి ప్రజాస్వామ్యం పేరుతో సాగే ఈనాటి రాజకీయ ప్రహసనాన్ని తన నవలల్లో చీల్చి చెండాడి ఉండేవారు. కారణాలేమైనా దాశరథి ఆ సంకల్పం తీసుకోలేదు. అయినా వారి కృషి అద్వితీయం. వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఆయన సృజించిన సాహిత్యం అందించే అవగాహన, చైతన్యం తక్కువేమీ కాదు. ఈనాటి తరం అనివార్యంగా దాశరథి రచనలు చదవాలి. పేరుకు ప్రజాస్వామ్యమైనా ఆర్థిక అసమానతలు నేటి సమాజాన్ని అపహాస్యం చేస్తున్నాయి. మానవ విలువలు అడుగంటి పోయి అభద్రత రాజ్యమేలుతుంది. వర్తమాన సామాజిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులు ప్రజలను అసంతృప్తికి గురిచేస్తున్నాయి. ప్రజలకు దిశానిర్దేశం చేసే సాహిత్యం సృష్టించాల్సిన సాహిత్యం నేడు ఎంతో అవసరం. రచయితలు ఆ దిశగా కృషిచేయాల్సిన అవసరం ఉంది. దాశరథి రచనలు ఆ దిశగా స్ఫూర్తిని అందిస్తాయి. ఆయనది ప్రజల కోణం. ఆయనకు ప్రజల గుర్తింపు ఉంది. ఆ గుర్తింపునకు జ్ఞానపీఠాలు సరితూగవు.
- వొరప్రసాద్
94900 99059
మహా రచయిత దాశరథి
