బ్యాంకులతో అనుబంధం కలిగిన ప్రతి ఒక్క ఖాతాదారులూ.. వినియోగదారులాంటి వారే. అంటే.. వినియోగదారుల చట్టంలో.. వర్తించే చట్టాలూ బ్యాంకు ఖాతాదారునికీ వర్తిస్తాయి. ఆర్థిక రంగాలు అందించే సేవల్లో లోపాలు ఏమైనా ఉంటే.. ఖాతాదారుడు ప్రశ్నించి, వ్యవస్థాగతమైన లోపాలను ఎత్తిచూపే వెసులుబాటూ ఉంటుంది. ఖాతాదారుల హక్కులను రక్షించే ఉద్దేశంతో 'బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ)' పలు నిబంధనలను రూపొందిస్తూనే ఉంటుంది. బోర్డులో సభ్యత్వం ఉన్న బ్యాంకులన్నీ కచ్చితంగా ఆ నిబంధనలు, సూచనలు పాటించాలి. లేకుంటే.. ఖాతాదారుడు సంబంధిత విభాగంలో ఫిర్యాదు చేయొచ్చు. ఇలాంటి అంశాల గురించి ఈ వారం 'రూపాయి'లో తెలుసుకుందాం!
బ్యాంకులు తమ ఖాతాదారులకు అందించాల్సిన సేవల విషయంపై బీసీఎస్‌బీఐ కొన్ని కచ్చితమైన నిబంధనలను రూపొందించింది. అయితే, వీటి గురించి ఖాతాదారులకూ అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే వారు తమకు జరిగిన సేవాపరమైన లోపాలను సులభంగా గుర్తించి, ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది.
పారదర్శకత ముఖ్యం
బ్యాంకు అందించే సేవాపరమైన లోపాల్లో చిన్నవీ, పెద్దవీ అంటూ తేడా ఏమీ ఉండదు. సమస్య ఏదైనా దానికి కచ్చితమైన పరిష్కారం పొందే హక్కు ఖాతాదారులకు ఉంటుంది. ఏటీఎం నుంచి చిరిగిన నోటు రావడం దగ్గర్నుంచి, క్రెడిట్ కార్డు లావాదేవీలపై రుసుము విధించడం దాకా ఏదైనా సరే సమస్యే. ఇక్కడ ఆ ఇబ్బందిని బ్యాంకు దృష్టికి సరైన పద్ధతిలో తీసుకెళ్లారా లేదా అనేదే ముఖ్యం.
బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి ఏ విషయంపైనైనా ఖాతాదారుడు సులువుగా ఫిర్యాదు ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు బ్యాంకులో ఉండాలి. అందుకు వీలుగా బ్యాంకులో ఈ విషయాలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. బ్యాంకు పేరు, శాఖ, మేనేజర్, రీజనల్ మేనేజర్/ నోడల్ ఆఫీసర్ వివరాలు, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ వివరాలు, ఖాతా ప్రారంభించినప్పుడు నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని ఖాతాదారుడికి అందించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంటుంది. ఎవరైనా బ్యాంకు శాఖలో నిబంధనలకు సంబంధించిన వివరాలు అడిగితే.. వారికీ అవి అందించాలి.
ఫిర్యాదులు ఇలా ...
ఏ సంస్థలోనైనా సరే.. ఫిర్యాదుల పరిష్కారం వేగంగా జరగాలంటే.. క్షేత్ర స్థాయిలోనే దానికి సంబంధించిన ఏర్పాట్లు ఉండాలి. బ్యాంకుల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. సమస్య ఎక్కడ ఉందో.. ఫిర్యాదునూ అక్కడే చేయాలి. దాదాపు అన్ని బ్యాంకులూ.. ఫిర్యాదుల పరిష్కార విభాగాలను ఏర్పాటు చేశాయి. అందువల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖాతాదారులు ముందుగా సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించి, అక్కడి అధికారులకు సమస్యను వివరించవచ్చు. వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించి కూడా సమస్యను నమోదు చేసి, ఫిర్యాదు క్రమ సంఖ్యను పొందొచ్చు. దీని ఆధారంగా మీ సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో సులభంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. దీంతోపాటు.. బ్యాంకు వెబ్సైటు ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది.
అన్ని నిబంధనలనూ అనుసరిస్తూ ఫిర్యాదు చేసినప్పటికీ, బ్యాంకులో మీ సమస్య పరిష్కారం కాకపోతే.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ ప్రిన్సిపల్ నోడల్ అధికారిని నియమించాలని రిజర్వు బ్యాంకు సూచించింది. ఫిర్యాదు చేసిన తర్వాత ఆ సమస్యను 30 రోజుల్లోగా పరిష్కరించడం లేదా ఖాతాదారుడికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
అంబుడ్స్‌మన్.. మరో మార్గం
మీరిచ్చిన ఫిర్యాదును నెల రోజుల్లోగా బ్యాంకు పరిష్కరించకపోతే.. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. బ్యాంకు అందించే సేవల్లో ఏవైనా లోపాలు ఉంటే.. వాటిని పరిష్కరించేందుకు రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేసిన విభాగం ఇది. మీ బ్యాంకు ఏ అంబుడ్స్‌మన్ పరిధిలోకి వస్తుందో చూసుకొని, అక్కడ ఫిర్యాదు చేయాలి. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ వివరాలు రిజర్వుబ్యాంకు వెబ్సైటులో లభిస్తాయి. ఈ సేవలను వినియోగించుకునేందుకు ఎలాంటి రుసుములూ ఉండవు.
ముందుగా బ్యాంకును సంప్రదించాకే.. అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయాలి. లేకపోతే ఆ ఫిర్యాదును తిరస్కరించే అవకాశం ఉంది. వినియోగదారుల కోర్టు, ఇతర కోర్టుల్లో ఆ వివాదానికి సంబంధించి కేసులు నడుస్తుంటే అంబుడ్స్‌మన్ ఫిర్యాదును స్వీకరించరు. బ్యాంకు సూచించిన పరిష్కారం, అంబుడ్స్‌మన్ ఇచ్చిన తీర్పులు నచ్చకపోతే, 30 రోజుల్లోగా ఖాతాదారులు వినియోగదారుల ఫోరం, కోర్టులను ఆశ్రయించవచ్చు.
- వి. చైతన్య