'ఒకపవిడు.. వస్తువులు అమ్మేషాపులు ఉండేవట..!' అని రేపటితరం అనుకునే రోజులు ఇంక ఎంత దూరంలోనో లేవేమో? దేశీయ వ్యాపార రంగంలోకి బహుళ జాతీయ కంపెనీలు చొరబడుతున్న క్రమంలో ఇ-కామర్స్ (ఆన్లైన్ బిజినెస్) కు సామాన్య జనాలూ అలవాటుపడక తప్పడం లేదు. అయితే.. ఇ-కామర్స్ ద్వారా షాపింగ్ చేయడం ఎంతో సులభం అనుకోవడం మాట ఎలా ఉన్నా.. వాటి పట్ల అవగాహన కొరవడితే జేబులకు చిల్లుపడే అవకాశాలు ఎక్కువే. అందుకే, సంప్రదాయ మార్కెట్‌కు భిన్నంగా ఆన్లైన్లోనే కోట్లాది రూపాయల వ్యాపారాలు సాగిస్తున్న ఇ-కామర్స్ అంటే ఏమిటి? ఆన్లైన్ షాపింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు ఈ వారం 'రూపాయి'లో తెలుసుకుందాం!
ఇ-కామర్స్.. ఆధునిక షాపింగ్‌కి పర్యాయపదం. ''ఆన్లైన్ షాపింగ్'' అనేది అందరికీ అర్థమయ్యే మాట. వస్తువు కొనడం, అమ్మడం అనే విషయంలో కొత్త పద్ధతులకు తెరలేపింది ఇ-కామర్సే. దీంతో ఇ-కామర్స్ సంస్థలు రోజుకి వేల కోట్ల రూపాయల టర్నోవర్ బిజినెస్ నిర్వహిస్తున్నాయి. ఇ-కామర్స్ బిజినెస్ ఎంతగా పెరిగిపోయిందంటే రోజువారీ కూలి చేసుకునే సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు దాకా ఆన్లైన్లోనే క్రయ, విక్రయాలు జరపడం ఇప్పుడు సర్వసాధారణమైంది.
ఈ-కామర్స్ అంటే?
వాణిజ్య ప్రపంచంలో ఇదొక లేటెస్ట్ ట్రెండ్. కొనడం దగ్గర నుంచి అమ్మడం దాకా ఇప్పుడంతా ఆన్లైన్లోనే. కూరలో వేసుకునే టాటా ఉప్పు దగ్గర నుంచి నిద్రకు ఉపయోగించే డన్లప్ పరుపులు దాకా.. ఏం కొనాలన్నా అంతా ఆన్లైన్లో. ఇక్కడ కొసరి కొసరి బేరాలుండవ్.. అంతా డిస్కౌంట్లే. మొదట్లో వంటికి ధరించే బట్టలు, కాళ్ళకు వేసుకునే చెప్పులు, బూట్లకే పరిమితమైన ఆన్లైన్ షాపింగ్ విధానం డిమాండ్ ఉన్నచోటే సప్లరు ఉంటుందన్నట్టుగా క్రమేణా పెద్ద గ్లోబల్ మార్కెట్ అయిపోయింది. ఈ మార్కెట్లో కొనడానికి స్వతంత్రం ఎంత ఉంటుందో?! మంత్రతంత్ర మోసాలూ.. గారడీలు అంతే ఉంటారు. డిస్కౌంట్ పేరుతో వినియోగదారుడికి మేలుకూర్చే లాభాలుంటారు.. నాసిరకం వస్తువుల వల్ల నష్టాలూ ఉంటారు. ఈ-కామర్స్ గురించి టెక్నికల్‌గా చెప్పాలంటే 'ఈ' అంటే ఎలక్ట్రానిక్. 'కామర్స్' అంటే వ్యాపారం. అంటే ఇంటర్నెట్ ఆధారంగా వస్తువుల్ని అమ్మడం, కొనడం అన్నమాట.
ఉత్పత్తి కంపెనీల నుంచి ఆయా వస్తువుల్ని వినియోగదారుడికి అమ్మడం, చేర్చడం చేసినందుకుగాను సదరు ఆన్లైన్ కంపెనీలు కమీషన్ తీసుకుంటాయి. ఆన్లైన్ మార్కెట్ విస్తరించిన నేపథ్యంలో ఈ షాపింగ్ వెబ్సైట్లు రోజువారీ లక్షలాది రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్నాయి. అయితే వినియోగదారుడికి జవాబుదారీగా ఉండాల్సింది ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లే. అందుకే గ్యారంటీని ఇవ్వగలిగే కంపెనీలేమిటో అవగాహనకు రావాలి.
ఉన్నచోటే.. షాపింగ్
షాప్దాకా వెళ్లి ఏదైనా వస్తువు కొనాలంటే జేబులో తగినంత డబ్బు కావాలి. జేబులో ఉన్న డబ్బును బట్టి నచ్చిన వస్తువుల్ని కొనాలా? వద్దా? అనే ఆలోచనలతో తర్జనభర్జనలు పడతాం. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే తీరుబడిగా వెలుగు జిలుగులతో మెరిసిపోయే ఆయా షాపింగ్‌మాల్స్‌లో అడుగుపెట్టడానికి తగిన సమయం, సందర్భం చూసుకుంటాం. కానీ ఆన్లైన్ షాపింగ్ విషయంలో అలాంటివేమీ అవసరంలేదు. ఇంటి బాల్కనీలో కూర్చుని టీనో, కాఫీనో తాగుతూ స్మార్ట్‌ఫోన్‌లో అలవోకగా ఆర్డర్ ఇచ్చేయొచ్చు. ఇక మనం ఎక్కడున్నా వెదికిపట్టుకుని మరీ, మనం ఆర్డర్ చేసిన వస్తువు మనకందిస్తాయి ఆన్లైన్ కంపెనీలు. ఈ రోజు డబ్బుల్లేవు, అయినా నాలుగైదు రోజులు ఆగైనా సరే ఆ వస్తువును తీసుకునే వెసులుబాటు కల్పిస్తాయి. ఇలాంటి సౌలభ్యాలు, సౌకర్యాలే కస్టమర్లను ఆకర్షించ డానికి ప్రధాన కారణం. అయితే తీసుకున్న వస్తువులకు గ్యారంటీ ఎంత అనేదే మన ముందున్న ప్రశ్న. ఈ విషయంలో కస్టమర్లకు జవాబుదారీగా ఉండే ఆన్లైన్ కంపెనీలు కొన్నైతే.. 'దిక్కున్నవాడితో చెప్పుకో.. పో!' అనే మోసపూరిత వ్యవహారంతో నడిచే కంపెనీలు చాలానే ఉన్నాయి. అలా మోసపోయిన కస్టమర్లూ మన మధ్య లేకపోలేదు.
లాభం-నష్టం ..రెండూ!
ఇంటర్నెట్ సౌలభ్యం విస్తరించిన క్రమంలో వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల్ని ఆన్లైన్లో విక్రయించేందుకు పోటీపడుతున్నాయి. దీంతో ఆయా కంపెనీలు నిత్యావసర వస్తువులు మొదలుకొని, ప్రతి ఒక్కటీ ఆన్లైన్లో ఇట్టే అమ్మేస్తున్నాయి. అయితే ఆన్లైన్లో వినియోగదారుడు వస్తువుల కోసం వెచ్చిస్తున్న సొమ్ముకు ఎంతటి ప్రయోజనాలు ఉన్నాయి? ఎలాంటి లాభనష్టాలు ఉన్నాయి? అనేది బేరీజు వేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించకపోతే భారీమూల్యం చెల్లించక తప్పదు. 'ఉత్పాదక కంపెనీలు లేదా అమ్మే ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు బాగానే వారంటీ, గ్యారంటీ ఇస్తున్నాయిగా?' అనే ప్రశ్న తలెత్తవొచ్చు. కానీ ఆన్లైన్ షాపింగ్ అనే విషయంలో నెంబర్‌వన్‌గా చెలామణి అవుతున్న కంపెనీల పట్లా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కస్టమర్ల జేబులకు కత్తెర్లు పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయనేది మరిచిపోవొద్దు.
ప్రచారం.. ఆర్భాటం.. ఎక్కువే!
ఆన్లైన్లో షాపింగ్ అంటే డిస్ప్లేలో పొందుపరిచిన వస్తువుల ఫొటోలు, వాటి వివరాల్ని చూసి ఎంపిక చేసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ వస్తువుల నాణ్యతను పసిగట్టే అవకాశం ఉండదు. మనం బయట బజార్లో దొరికే షాపుల్లో నాణ్యతా ప్రమాణాలను తెలుసుకోడానికి ఆ వస్తువును భౌతికంగా చూసి, చేతి స్పర్శతో నాణ్యతను పసిగడతాం. అయితే ఆన్లైన్ షాపింగ్‌లో అలాంటి అవకాశం ఉండదు. కేవలం ప్రొడక్ట్ (వస్తువు) కు సంబంధించిన వివరాలు మాత్రమే ఉంటాయి. వాటిని కూలంకషంగా చదివి, నాణ్యతా ప్రమాణాలను అంచనా వేసుకోవాలి. వినియోగదారుల్ని ఆకర్షించే క్రమంలో అగ్గిపుల్ల, పిన్నీసుల్ని సైతం ఎంతో అద్భుతంగా, ఉన్నతంగా చూపించే టెక్నాలజీ వచ్చేసింది. ఈ క్రమంలో అక్కడ ఆకర్షణీయంగా కనిపించే బొమ్మల్ని చూసి 'చాలా బావుంది, అద్భుతం' అనే భావనకు రాకుండా నిజరూపంలో ఆ వస్తువు ఎలా ఉంటుందనే విషయంలో ఓ అవగాహనకు రావాలి.
ఆఫర్లతో.. ఆచితూచి
వ్యాపార రంగాల్లో ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగ సీజన్లలో డిస్కౌంట్ సేల్ ఆఫర్లనేవి సర్వసాధారణం. ఈ విషయంలో ఈ-మార్కెట్ (ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు) అసలు మార్కెట్ కంటే ముందుంటుంది. 40 శాతం, 60 శాతం డిస్కౌంట్లు అని ఆర్భాటంగా జరిగే ప్రచారాల్లో నిజమెంత? అమ్మే వస్తువుల్లో నాణ్యత ఎంత? అనేది పరిశీలించాలి. సాధారణంగా పండుగ సీజన్లలో కొత్త ఉత్పత్తులతో పాటే నిల్వ సరుకుకు డిస్కౌంట్ సేల్ పేరుతో అమ్మే ప్రయత్నాలు జరుగుతుంటాయి. నాణ్యతలేని వస్తువుల్ని కూడా అమ్మేసి లాభపడుతుంటాయి. ఆయా ఆఫర్ల కంటే.. ముందుగా వస్తు నాణ్యత ఎలా ఉంది? దానికిగల ప్రమాణాలేంటి? కొంటే.. లాభమా? నష్టమా? కొన్న వస్తువుకి గ్యారంటీ ఎంత? ఇలాంటి విషయాలన్నింటిపైనా పూర్తి నమ్మకం, అవగాహన ఏర్పడ్డాకే.. ఆన్లైన్ షాపింగ్ చేయాలి.
నకిలీ కంపెనీలు
ఈ ఆన్లైన్ షాపింగ్ విధానంలో అసలు కంపెనీని పోలిన కంపెనీలు కుప్పతెప్పలుగా ఉంటాయనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే ఒక అక్షరం తేడాతో పేరుమోసిన కంపెనీల పేర్లతో నకిలీ వ్యాపారాలు అనేకం మార్కెట్లో హల్చల్ చేయడం మనకు తెలుసు. ఇలాంటి దిగువశ్రేణి ఉత్పత్తి కంపెనీలు చాలావరకూ ఆన్లైన్ షాపింగ్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. అలాంటి కంపెనీ ఉత్పత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే బ్రాండెడ్ కంపెనీలైనా, చిన్నా చితకా కంపెనీలైనా ఆన్లైన్లో అమ్మే వస్తువుకు ఎంత గ్యారంటీని ఇవ్వగలుగుతున్నాయి? మార్కెట్ ధరకు ఆన్లైన్ షాపింగ్ ధరకు తేడా ఎంత? అనే విషయాలపై శ్రద్ధపెట్టాలి.
ఆన్లైన్ షాపింగ్‌లో ప్రధానంగా డబ్బు చెల్లించే విధానం మూడు పద్ధతుల్లో ఉంటుంది. 1. క్రెడిట్ కార్డ్, 2. డిబెట్ కార్డ్, 3. డెలివరీ టైమ్‌లో చెల్లించే పద్ధతి. మూడో పద్ధతినే ఎంచుకోవడం శ్రేయస్కరం. వీలైనంత తక్కువగా బ్యాంక్ లావాదేవీలు ఇంటర్నెట్ ద్వారా జరపకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇటీవల కాలంలో నెట్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతున్న మోసాలు అనేకం.
- వి. చైతన్య