- ఆర్థిక సంస్కరణల అమలు - సమీక్ష
ఆర్థిక సంస్కరణలు మొదలై పాతికేళ్లు దాటింది. ఆర్థిక సంస్కరణలకు పూర్వరంగం చాలా దారుణమైన స్థితిగతులు దేశంలో ఉండేవి. దేశంలోని అంతర్గత సమస్యలకు తోడు బాహ్య పరిస్థితులు వల్ల భారత్ ముందున్న సమస్యలు సంక్లిష్టంగా మారాయి. మోయలేనంత విదేశీ రుణభారం, ఉరకలెత్తుతున్న ద్రవ్యోల్బణం, భారమైన చెల్లింపుల సమస్యలతోడు గల్ఫ్ యుద్ధం, సోవియట్ యూనియన్ పతనం వంటి సమస్యల వల్ల ఆర్థిక అవ్యవస్థ కట్టలు తెంచుకోవడంతో 1991 జూన్‌లో సంస్కరణలకు తెరతీశారు.
దేశాన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడేసే లక్ష్యంతో ప్రారంభమైన సంస్కరణలు అనూహ్య విజయాలు సాధించినా, అనేక వైఫల్యాలు చోటు చేసుకున్నాయి.
సంస్కరణలు అమలయ్యాక దేశ స్థూల ఆర్థిక సూచీలు మెరుగయ్యాయి. గడచిన పాతికేళ్లలో జిడిపి సగటు వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదయ్యింది. గడచిన దశాబ్ద కాలంలో వృద్ధిరేటు ఏడు నుంచి తొమ్మిది శాతం మధ్యలో నమోదవ్వడం గమనించవచ్చు. సంస్కరణల అమలు వల్ల అనేక ఆర్థిక సమస్యలను అధిగమించగలిగాము. సంస్కరణల నేపధ్యంలో ఆర్థికాభివృద్ధి ఎగుమతుల్లో పురోగతి, చెల్లింపుల సమతూకం, విదేశీ ఆర్థిక సంక్షోభాలను తట్టుకునే శక్తి, సేవలరంగ విస్తృతి, విదేశీ మారక ద్రవ్య నిలువల్లో పురోగతి, ఐటీలో ముందడుగు, స్టాక్ మార్కెట్ దూకుడు, టెలీకమ్యూనికేషన్ సదుపాయాల అనూహ్య అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల వెల్లువ వంటి అత్యంత సానుకూలాంశాలు సంస్కరణల ఫలితాలుగా పేర్కొనవచ్చు. సంస్కరణలు ప్రారంభించిన నాటితో పోలిస్తే భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలలో మెరుగైన అనుసంధానం కలిగి ఉంది. సంస్కరణల ఫలితంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి సాంకేతికత బదిలీ అయ్యి దేశాభివృద్ధికి చోదకశక్తిగా మారుతుంది.
సంస్కరణల అమలు ప్రస్థానంలో కొన్ని రంగాలలో అద్భుతమైన ఫలితాలు సాకారమైనప్పటికీ కొన్ని రంగాలలో విధానాల రూపకల్పన, వాటి అమలు పరంగా వైఫల్యాలు స్పష్టంగా కళ్లకు కడుతున్నాయి. ప్రధానంగా ఐదు రంగాలలో వైఫల్యాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. మౌలిక వసతుల కల్పన పరంగా చెప్పుకోదగిన అభివృద్ధి సాధించినప్పటికీ గడచిన పాతికేళ్లుగా చైనా వంటి దేశాలు సాధించిన అభివృద్ధితో పోల్చి చూస్తే మన ప్రగతి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికే అనేక గ్రామాలకు సమీప పట్టణాలతో అనుసంధానం లేదు. గ్రామీణ ఆర్థికవ్యవస్థలు అభివృద్ధి కాకుండా పట్టణ ప్రాంతాలు సుస్థిరమైన అభివృద్ధిని సాధించలేవు. ఇప్పటికే దేశమంతటా విద్యుత్‌కు పెద్ద మొత్తంలో కొరత ఉంది. సంస్కరణల అనంతరం మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ప్రయివేటు పెట్టుబడులపై ఆధారపడడం బాగా పెరిగింది. ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి) లో అనేక ప్రాజెక్టులు చేపట్టారు. అయితే ఈ విధానం ఆశించిన ఫలితాలను అందివ్వలేదు.
వ్యవసాయ అభివృద్ధిలో తీవ్రమైన వైఫల్యం కనిపిస్తోంది. రైతుల ఆదాయంలో ఏమాత్రం పెరుగుదల లేదు. వ్యవసాయ రంగంలోని వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించకుండా సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్ల వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. 1950లో చైనా, ఇండియా తలసరి ఆదాయాలు ఒకే విధంగా ఉండేవి. 1978లో చైనా ఆర్థిక సంస్కరణల అమలును చేపట్టింది. సంస్కరణలను అమలు చేసేముందే క్రమపద్ధతిలో వ్యవస్థాపూర్వక సమస్యలపై దృష్టి సారించింది. మౌలిక సౌకర్యాల రంగంలో భారీ పెట్టుబడులు పెట్టి, విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. భూసంస్కరణలు పటిష్టంగా అమలు చేయడంతోపాటు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో మార్కెట్ సంస్కరణలు అమలు చేసింది. అంతేగాక గ్రామీణ పారిశ్రామికీకరణకు ప్రాధాన్యం ఇచ్చి, వ్యవసాయ రంగం వెలుపల భారీ పెట్టుబడులు పెట్టింది. చైనా రాజకీయ పరిస్థితులకు, మన దేశ పరిస్థితులకు మధ్య వైరుధ్యం ఉన్నప్పటికీ వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పారిశ్రామికీకరణ వంటి అంశాలు అనుసరించదగినవే.
ఆర్థికవ్యవస్థలో చేపట్టే వ్యవస్థాగత మార్పుల్లో తొలుత వ్యవసాయానికి, తర్వాత పారిశ్రామిక రంగానికి, అనంతరం సేవల రంగానికి ప్రాధాన్యమివ్వాలి. అయితే భారత్ ఈ వరుస క్రమాన్ని పాటించలేదు. వ్యవసాయ రంగం తరువాత వస్తూత్పత్తి రంగంపై దృష్టి కేంద్రీకరించాల్సిన భారత్ సేవల రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. జిడిపిలో ఆయా రంగాల వాటా ఈ వాస్తవాలను తేటతెల్లం చేస్తున్నాయి. అధికంగా సేవలరంగ అభివృద్ధికి దోహదం చేశాయి. అధిక శాతం ప్రజలకు జీవనాధారం అయిన వ్యవసాయ రంగంలో సంస్కరణల వైఫల్యం కనిపిస్తోంది. అన్నదాతల ఆదాయాలను పెంచకుండా దేశం నుంచి పేదరికం తరిమికొట్టడం సాధ్యమయ్యే పనికాదు.
తయారీ రంగంలోనూ ఉపాధి తీరుతెన్నులు కలవరపరుస్తున్నాయి. సుదీర్ఘకాలంగా ఉపాధిలో తయారీ రంగం వాటా 12 నుంచి 15 శాతం మధ్య కొట్టుమిట్టాడుతోంది. అధిక పెట్టుబడులు అవసరమైన పరిశ్రమలను నెలకొల్పడంపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల ఉపాధి అవకాశాలు ఆశించినంతగా పెరగలేదు. ఈ ధోరణి మారాల్సి ఉంది. చిన్న పరిశ్రమలను నెలకొల్పడం వల్ల ఉపాధి అవకాశాలు పెంపొందించవచ్చు. భారత్‌లో తయారీ వంటి కార్యక్రమం ఆ దిశగా మంచి ముందడుగుగా పేర్కొనవచ్చు. దేశీయ గిరాకీని పెంచడంతోపాటు నైపుణ్య ఆధారిత తయారీ రంగానికి ఊతమివ్వాల్సిన అవసరం ఉంది.
దేశానికి మానవవనరులు తిరుగులేని వరాలు. జనాభా సానుకూలత వల్ల భారత్ మరో 20 ఏళ్లలో శ్రమశక్తి 32 శాతం పెరగనుంది. ఆధునిక యుగంలో జనాభా ఒక సమస్యగా కాకుండా అవకాశంగా గుర్తించాలని జనాభా రంగ నిపుణులు సూచిస్తున్నారు. యువతకు సరైన ఉపాధి లభించక నిరాశ నిస్పృహలలో కూరుకుపోతున్నారు. దేశంలో ఉత్తరాదిన యువకుల సంఖ్య అధికంగా ఉంటే దక్షిణాదిన వారి సంఖ్య తగ్గుముఖం పట్టనుంది. ఆర్థిక సంస్కరణల అమలువల్ల పట్టణ యువతకు ముఖ్యంగా ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉన్న యువతకు సేవారంగం చక్కటి ఉపాధి అవకాశాలు అందివచ్చాయి. సరైన చదువు, నైపుణ్యాలు ఉండి తగిన ఉపాధి అందిపుచ్చుకున్నప్పుడే యువకులు దేశానికి తరగని పెట్టుబడులుగా రూపొందుతారు. భిన్నరకాల ఉపాధికి ఉపయోగపడే రీతిలో యువతే యువకులను సుశిక్షితులను చేయాలి. సంపదను సృష్టించగలిగే సామర్థ్యాలను యువతకు అందించే విధంగా విద్యావ్యవస్థను సమగ్రంగా పునర్వ్యవస్థీకరించాలి. ఏదో ఒక నైపుణ్యాన్ని కల్పించడం కాకుండా నిరంతరం నైపుణ్యాన్ని మెరుగుపరచుకునేందుకు యువతకు అవకాశం కల్పించాలి. నైపుణ్యాన్ని విస్తృతంగా వినియోగించే విధంగా ఆర్థికవ్యవస్థలో మార్పులు తీసుకురావాలి.
పాతికేళ్ల సంస్కరణల అమలులో సామాజిక సూచీల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. అసమానతలు, ఆకలి, పౌష్టికాహార లేమి వంటి వాటిని కట్టడి చేయకుండా పూర్తిగా ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించడం వల్ల ఏర్పడిన ఫలితమిది. విద్య, వైద్య రంగాలకు తక్కువ ప్రాధాన్యత కల్పించడం వల్ల మానవాభివృద్ధి పరంగా దేశంలో అసమానతలు పెచ్చరిల్లాయి. ఆర్థికాభివృద్ధి సాధనలో సామాజిక రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి.
ఆర్థిక సంస్కరణల అమలు అనంతరం పాలనా రంగంలో వైఫల్యాలు చోటుచేసుకున్నాయి. పాలనా పరంగా అనేక కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. ఆర్థిక, స్థిరాస్తి రంగాలలో లెక్కలేనన్ని కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవర్గాల మధ్య అపవిత్ర పొత్తులు కుదిరి, ప్రజాధనం స్వాహా అయ్యింది. ఎప్పటి నుంచో ఉన్న అవినీతి అలాగే కొనసాగింది. నల్లధనం గుట్టలు గట్టులుగా పోగుపడింది.
- ఎస్.ఎం.సువర్ణకుమార్
డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్, ఏలూరు.
సెల్ : 9441169869
గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
