- నల్లధనం - సమాంతర ఆర్థికవ్యవస్థ
- ఇండియన్ ఎకానమి
దేశ ఆర్థికవ్యవస్థకు నల్లధనం క్యాన్సర్ వంటిది. దేశం ఎదుర్కొంటున్న బహుముఖమైన సంక్లిష్ట సమస్య నల్లధన విస్తృతి అంతకంతకూ పెరగడం. ఇది దేశ ఆర్థికవ్యవస్థతో పాటు సామాజికంగానూ విభిన్న రీతులలో దెబ్బతీస్తుంది. ఇది ప్రభుత్వ రాబడిని తగ్గించి ఆర్థికవ్యవస్థను కుంటుపరుస్తుంది. దీన్ని నిర్మూలించడం దేశ ఆర్థికవ్యవస్థకు ఎంతో లాభదాయకం.
చట్టబద్ధంకాని విధానాలలో సంపాదించిన ఆదాయాన్ని ప్రభుత్వానికి లెక్క చూపించకుండా పన్ను ఎగవేయడం ద్వారా సంపాదించిన ఆదాయాన్ని నల్లధనం అంటారు. నల్లధనం కలిగివున్న ఆర్థికవ్యవస్థనే సమాంతర ఆర్థికవ్యవస్థ అంటారు. తెల్ల ఆదాయం లేదా తెల్ల ద్రవ్యం అనగా తాము సంపాదించిన మొత్తం రాబడిని, దానికి సంబంధించిన లెక్కలను ప్రభుత్వానికి తెలియజేసి.. దానిపై పన్ను చెల్లించినట్లయితే, దానిని చట్టబద్ధ ఆదాయం అంటారు.
నల్లధన ఉత్పత్తి ప్రధానంగా రెండు మార్గాల ద్వారా జరుగుతుంది.
1. చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా సృష్టించేది
2. చట్టబద్ధ కార్యకలాపాల ద్వారా సృష్టించేది
నేరపూరిత కార్యకలాపాలు, అవినీతి, మత్తుపదార్థాల అక్రమరవాణా వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాల నల్లధనం ఉత్పత్తి కారణమవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. గృహాలు, ఇతర ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలలో రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలపై తక్కువ విలువను చూపడం ద్వారా.. అంటే మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు మధ్య అంతరం ఎక్కువగా ఉండటం వల్ల నల్లధనం పేరుకుంటుంది. విదేశీ వ్యాపారంలో భాగంగా ఎగుమతి, దిగుమతుల విషయంలోనూ తక్కువ విలువను చూపించి, సుంకాలను ఎగవేసి సంపాదించిన ఆదాయం నల్ల ధనమే. ఎగుమతి, దిగుమతి చేసుకున్న వస్తువుల విలువను గోప్యంగా ఉంచుతారు. అంతేగాక ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో తమకు అవసరమైన పర్మిట్లు, కోటాలు, లైసెన్సులు పొందే విషయంలో అధికారులకు అప్పగించే లాభాలు, బహుమతుల వల్ల ఆర్థికవ్యవస్థలో నల్లధనం పెరిగిపోతుంది. లంచాలు ఇచ్చి పొందిన పర్మిట్లను కోటాలను నల్లబజారులో ఎక్కువ ధరకు రహస్యంగా అమ్ముకోవడం వల్లా నల్లధనం పెరుగుతుంది.
మన దేశంలో ప్రధానంగా స్థిరాస్థి రంగంలోనూ, వజ్రాలు, బంగారం, నగల ద్వారా అత్యధికంగా నల్లధనం పేరుకుపోతుంది. లాభాపేక్షలేని సంస్థల వల్ల, విద్య, డాక్టర్లు, లాయర్లు వంటి సేవారంగానికి చెందిన వ్యక్తుల పట్లా నల్లధనం ఇబ్బడిముబ్బడిగా పోగుబడుతోంది.
గుప్తంగా, రహస్యంగా దాచిన నల్ల ద్రవ్య పరిమాణాన్ని తెలుసుకోడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. భారతదేశంలో ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకు ఖాతాల ద్వారా జరగడం లేదు. చాలా లావాదేవీలు డబ్బు ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పటికీ మన ద్రవ్య కార్యకలాపాలు ఎలక్ట్రానిక్ మాద్యమంలోకి పూర్తిగా రాలేదు. ఆస్తుల మార్కెట్లో క్రమబద్ధీకరణ, శాస్త్రీయత లోపించడం, విదేశాలకు నగదు వెళ్లడం వంటి కారణాలరీత్యా నల్లధనం అంచనా వేయడం కష్టమవుతుంది. నల్లధన పరిమాణంపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ 'బ్లాక్‌మనీ ఇన్ ఇండియా' అనే గ్రంథంలో 1950లో ఐదు శాతం, 1970లో ఏడు శాతం, 2010లో 50 శాతం వరకూ నల్లధనం ఉంటుందని అంచనా వేశారు. అదేవిధంగా ప్రముఖ అర్థశాస్త్ర వేత్త అయిన సూరజ్.బి.గుప్త భారతదేశంలో గుప్త ద్రవ్యంపై చేసిన అధ్యయనం ప్రకారం 1987-88 ధరలలో 2005 నాటికి స్థూలదేశీయ ఉత్పత్తిలో దాదాపు 50 శాతం నల్లధనం చలామణీలో ఉంటుందని పేర్కొన్నారు. అంతేగాక నల్లధనం పెరుగుదల రేటు మన దేశంలో స్థూల దేశీయ ఉత్పత్తి పెరుగుదల రేటుకన్నా అధికంగా ఉన్నట్లు అంచనా వేశారు. ఇటీవల అధ్యయనాల ప్రకారం నల్లధనం పరిమాణం మొత్తం ద్రవ్య పరిమాణంలో 75 శాతం ఉండవచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద మన దేశంలో నల్లధనం పరిమాణం అధికంగానే ఉన్నట్లు పేర్కొనవచ్చు.
ఇక దేశంలో నల్లధనం పెరగడానికి కారణాలు పరిశీలిస్తే మనదేశంలో నల్లధన ఆర్థికవ్యవస్థ రెండో ప్రపంచ యుద్ధకాలం నుంచి ప్రారంభమైంది. బ్రిటీషు ప్రభుత్వం యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ద్రవ్య సరఫరా పెంచివేసింది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగింది. అధిక లాభాలు, ఆదాయాలు ఆర్జిస్తున్న వారిపై ప్రభుత్వం భారీగా పన్నులు పెంచింది. ఫలితంగా పన్ను ఎగవేతకు నల్లమార్కెట్లు ఆవిర్భవించడానికి దారి తీసింది.
ప్రణాళికా బద్ధమైన అభివృద్ధిని సాధించేందుకు వనరుల వినియోగంలో ప్రభుత్వం ఆంక్షలు, నియంత్రణలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఆంక్షలను, నియంత్రణలను రూపుమాపడం వల్ల నల్లధనం విస్తరించింది. ఆ కాలంలో పర్మిట్లు, కోటాలు, లైసెన్సులు పొందడానికి ప్రజలు లంచాలు, బహుమతులు ఇచ్చి, తమ పనులను చేసుకోవడం వల్ల నల్లధనం వృద్ధి చెందింది.
మన దేశంలో పన్నుల ఎగవేత అధికం. స్వచ్ఛందంగా పన్ను చెల్లించడానికి ముందుకొస్తోంది దిగువ, మధ్యతరగతి ప్రజలే. సంపన్నుల్లో ఇటువంటి చొరవ కానరావడంలేదు. కేంద్ర, రాష్ట్ర, ప్రయివేటు సంస్థల ఉద్యోగులే పన్ను చెల్లింపుదారులలో ఎక్కువగా ఉన్నారు. పన్ను చెల్లించే వ్యాపారులు, వృత్తులలో ఉన్న వారి సంఖ్య స్వల్పం. వారీ వార్షికాదాయాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగుల జీతం నుంచి పన్ను కోత ఉంటుంది. ఈ విధానం వ్యాపారులు, వృత్తి వర్గాల వారికి వర్తించదు. దీనివల్ల వారి నుంచి పన్నుల రాబట్టడం సమస్యాత్మకంగా ఉంటుంది.
ప్రభుత్వం అనుసరిస్తున్న పన్నుల విధానంలో ఉన్న లోపాల వల్ల నల్లధనం, నల్ల మార్కెట్లు విస్తరిస్తున్నాయి.
ఒకప్పుడు దేశంలో రాబడి పన్నురేటు అత్యధికంగా 97.5 శాతంగా ఉండేది. అంటే ప్రతి వంద రూపాయల సంపాదనలో రూ.97.50 ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాలన్న నిబంధన ఉండేది. అందువల్ల పన్ను ఎగవేత ధోరణులు ప్రబలిపోయాయి. దీంతో ప్రభుత్వం పన్ను రేట్లను హేతుబద్ధీకరించింది. క్రమేణా వ్యక్తిగత రాబడి పన్ను 30 శాతానికి, కార్పొరేటు పన్ను 35 శాతానికి తగ్గాయి. అయినా పన్నురాబడి మార్గాలను పెంచుకోడానికి ధీటైన కసరత్తు జరగలేదు. దీనివల్ల నల్లధనం పేరుకుపోయింది.
ఫైనాన్షియల్ మార్కెట్లు నల్లధన విస్తృతికి కారణమవుతున్నాయి. ప్రధానంగా స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టే పెట్టుబడులలో 15-20 శాతం పార్టిసిపేటరీ నోట్స్ (పి.నోట్స్) ద్వారానే వస్తున్నాయి. భారతీయుల ధనమే మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు వెళ్లి తిరిగి పి.నోట్స్ రూపంలో భారతీయ కంపెనీలలోకి వస్తున్నాయి.
ఖాతాలను ఉద్దేశ్య పూర్వకంగా తప్పుగా నిర్వహించడం ద్వారానూ నల్లధనం సృష్టి జరుగుతోంది. ప్రధానంగా సత్యం కంప్యూటర్స్ వంటి కార్పొరేట్ కంపెనీలలో ఇటువంటి పరిణామాలను గమనించవచ్చు. అందుకే రతన్ టాటా 'మాతరం వారు ఉత్పత్తి చేసి సంపద సృష్టించారు. కానీ ఈ తరం వారు ఖాతాలను మార్చడం ద్వారా సంపద సృష్టిస్తున్నారు'. అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ వ్యయం పెరగడం వల్లా నల్లధనం స్థాయి పెరుగుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్టు ప్రకారం 1960 నుంచి మన దేశంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయించిన ద్రవ్యపు నిల్వలు సక్రమంగా వినియోగించకపోవడం వల్ల, నిజమైన పేదలను ఎన్నిక చేయడంలో జరిగిన తప్పిదాల వల్లా నల్లధనం చోటు చేసుకుందని పేర్కొంది. నల్లధనం చలామణి అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది.
నల్లధనం దేశాన్ని ఆర్థికంగానూ, సామాజికంగానూ అనేక రీతులుగా దెబ్బతీస్తుంది. దేశంలో ప్రధానంగా ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధానంగా నల్లధనం చలామణీయే. నల్లధనం వల్ల రాజకీయ రంగం సైతం కలుషితమైంది. దీనివల్ల నల్లధనం బాగా సంపాదించిన బడా వ్యాపారవేత్తలు, సంపన్నులు, భూకబ్జాదారులు మాత్రమే రాజకీయాల్లోకి రాగలుగుతున్నారు. విచ్చలవిడిగా డబ్బును పంపిణీ చేయగల వారే ఎన్నికలలో పోటీ చేయగలుగుతున్నారు. ఫలితంగా సామాన్యుడు ఎన్నికలలో నెగ్గుకురావడం అసాధ్యంగా మారింది. అసమానతలు అంతకంతకూ విస్తృతమవుతున్నాయి.
విలువైన జాతీయ ద్రవ్య వసతులను ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించడం వల్ల, దేశంలో లభ్యమయ్యే ద్రవ్య వనరులను అభివృద్ధి ఉత్పాదక కార్యక్రమాలకు వినియోగించకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. ఉదాహరణకు నల్లధనంలో భూములు, బంగారం, వజ్రాలు కొనుగోలు చేయడంవల్ల ఆ ధనం తిరిగి ఆర్థిక ప్రక్రియలో కలవదు. ధనాన్ని ఇటువంటి అనుత్పాదక కార్యక్రమాలకు ఉపయోగించడం వల్ల ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది.
దేశంలో ఉన్న నల్లధన ఆర్థికవ్యవస్థ వల్ల ప్రభుత్వం, ఆర్థిక నిపుణుల దేశ అభివృద్ధికి అవసరమైన అభివృద్ధి విధానాలను రూపొందించడంలో విఫలమవుతున్నారు. ఆదాయం, పొదుపు వంటి అంశాలకు సంబంధించిన విలువలు కనుగొనలేకపోవడం వల్ల దేశాభివృద్ధికి తోడ్పడే అభివృద్ధి విధానాలను తయారు చేయలేకపోతున్నారు. నల్లధన విస్తృతివల్ల రిజర్వుబ్యాంకు రూపొందించే ద్రవ్యవిధానం, ప్రభుత్వ కోశ విధానం మధ్య సమన్వయం కొరవడి సత్ఫలితాలను పొందలేకపోతున్నారు.
చట్టవిరుద్ధంగా పొందిన లంచాలు, కమిషన్ల రూపంలో సంపాదించిన నల్లధనాన్ని ఆడంబరాలకు, ఆర్భాటాలకు విచ్చల విడిగా ఖర్చు పెట్టడం వల్ల ప్రజలలో నైతిక విలువలు కుంటుబడుతున్నాయి.
భారత ప్రభుత్వం నల్లధనాన్ని కట్టడిచేయడానికి గతంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. 1951, 1965, 1976, 1985, 1997, 2016లలో స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాలను ప్రవేశపెట్టింది. 1981లో ప్రత్యేక బేరర్ బాండ్ పథకాన్ని తీసుకువచ్చింది. 2016 నవంబరు 8న పెద్ద నోట్లను రద్దు చేసింది. అయితే ఇవేవీ ఆశించినంతగా ఫలితాలు ఇవ్వలేకపోయాయి. జిఎస్టి ప్రవేశపెట్టడం, ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయడం వంటి కీలక చర్యల ద్వారా నల్లధనం అదుపుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
నల్లధనం అరికట్టడానికి నిపుణులు అనేక పరిష్కారాలను సూచిస్తున్నారు.
1. ప్రపంచవ్యాప్తంగా నల్లధనం వెలికి తీయడానికి జరుగుతున్న పోరులో భారత్ భాగస్వామి కావాలి. భారతీయులు నల్లధనం దాచినట్లుగా పేర్కొంటున్న దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాలి.
2. నల్లధనం అదుపు చేయడానికి అవసరమైన చట్టబద్ధమైన బలమైన నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
3. నల్లధనానికి సంబంధించిన కేసులను త్వరితంగా విచారణ చేసేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి.
4. నల్లధన నిరోధానికి అవసరమైన వ్యవస్థలను, ప్రక్రియలను అభివృద్ధి చేయాలి. అవసరమైన మానవ వనరులను తయారుచేయాలి.
5. వ్యక్తులను కాకుండా కుటుంబం మొత్తాన్ని ఎసెస్మెంట్ యూనిట్‌గా పరిగణించాలి.
నల్లధనం ఆర్థికవ్యవస్థకు సమాంతరంగా ప్రవహించి, దాన్ని కుంగదీస్తుంది. నల్లధన ఉత్పత్తి, విదేశాలకు వెళ్లకుండా నిరోధించడం కష్టమే కానీ అసాధ్యం కాదు. నల్లధనం ఉత్పత్తిని నిరోధించడం, ఉత్పత్తి అయిన దాన్ని వెలికితీయడం, విదేశాలకు వెళ్లిన ద్రవ్యాన్ని రాబట్టడం వంటి విషయాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన రాజకీయ ఏకాభిప్రాయంగల పరిష్కారం సాధించాలి. ్య
- ఎస్.ఎం.సువర్ణకుమార్
డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్, ఏలూరు.
సెల్ : 9441169869