దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన మొదటి చిత్రం 'ఘాజీ'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో చిత్రం కూడా ప్రత్యేకమైన సబ్జెక్ట్‌నే ఎంపిక చేసుకున్నాడు. అదే అంతరిక్ష నేపథ్యం. బాలీవుడ్లో కూడా టచ్ చేయని నేపథ్యాన్ని ఎంపిక చేసుకుని శభాష్ అనిపించారు. విభిన్నమైన చిత్రాలు చేయాలని తపించే వరుణ్ తేజ్ ఈ ప్రాజెక్టులో కలిసి రావడంతో కొత్త ప్రయత్నం చేశారు. సంకల్ప్ అనుకున్నట్టు తన మార్కులోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయనకు తన బృందం చేసిన సాయం వెండితెరపై కనిపించింది. రెండో భాగంలో ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాడు. లోపాలను పక్కబెడితే చూడదగ్గ చిత్రంగా మలిచారనిపించింది.
నటులు, సాంకేతిక బృందం
సినిమా : అంతరిక్షం 9000కేఎంపీహెచ్
నటీనటులు : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి, రఘు, అవసరాల శ్రీనివాస్, సత్యదేవ్, రెహమాన్ తదితరులు
సంగీతం : ప్రశాంత్ విహారి
కూర్పు : కార్తీక శ్రీనివాస్
సినిమాటోగ్రాఫీ : జ్ఞాన శేఖర్ వీఎస్
నిర్మాణ సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : క్రిష్ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
సంకల్ప్ రెడ్డి
కథ : అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టిన ఓ శాటిలైట్ అక్కడకు వెళ్లాక వైఫల్యం చెందుతుంది. ఆ శాటిలైట్ పని చేయకపోతే మిగిలిన ఉపగ్రహాలకు ప్రమాదం ఉండబోతుంది. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. అందువల్ల వైఫల్యం చెందిన శాటిలైట్‌ను డీకోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పని చేయాలంటే రష్యాలో ప్రత్యేకంగా శిక్షణ పొంది ప్రముఖ వ్యోమగామిగా పేరు తెచ్చుకున్న దేవ్ (వరుణ్ తేజ్)కు మాత్రమే సాధ్యమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గుర్తిస్తుంది. ఇదే స్పేస్ సెంటర్ నుంచి ఐదేళ్ల క్రితం వెళ్లిపోయి రామేశ్వరంలో ఉపాధ్యాయుడుగా జీవితం కొనసాగిస్తున్న దేవ్(వరుణ్ తేజ్) సాధ్యం. అందుకే మళ్లీ ఆయన్ను ఇక్కడకు రప్పించడానికి వ్యోమగామి రియా (అదితి రావు హైదరి) ప్రయత్నిస్తుంది. రియా ప్రయత్నం ఫలిస్తుందా? అసలు దేవ్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ఎందుకు వెళ్లిపోయాడు?. శాటిలైట్‌ను ఎలా డీకోడ్ చేయగలిగాడు? అన్నదే మిగిలిన సినిమా.
విశ్లేషణ : అంతరిక్ష నేపథ్య చిత్రం అంటే హాలీవుడ్ మాత్రమే గుర్తొస్తుంది. ఇప్పటి వరకూ అలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసింది వారు మాత్రమే. బాలీవుడ్లో కూడా ఇటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఇటీవల 'టిక్ టిక్ టిక్' చిత్రం వచ్చిందంతే. సంకల్ప్ రెడ్డి 'ఘాజీ' తర్వాత అంతరిక్ష నేపథ్య చిత్రం చేయడం అనేది అభినందించ దగ్గ విషయం. అదీ రెండో చిత్రమే. దీనికి పెద్ద ఎత్తున చేసిన కృషి సినిమా చూస్తే అర్ధమవుతుది. దీనికి సైన్స్ పరిజ్ఞానం, సైంటిఫిక్ టెర్మినాలజీ తెలుసుంటే ఈ చిత్రం సులువుగా అర్ధమవుతుంది. ఈ చిత్రంలో పారిభాషిక పదాలు చాలా మందికి అర్థకాకపోవచ్చు. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్తోనే ఎక్కువగా పని ఉంటుంది. వాటితో చేయాలంటే భారీ బడ్జెట్ అవసరం కూడా. ఈ చిత్రంలో అనుకున్నంత స్థాయిలో వీఎఫ్ఎక్స్ అయితే లేవు. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన పరిధిలో ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఏది ఏమైనా సంకల్ప్ ప్రయత్నం అభినందించదగ్గది. ఇప్పటి వరకూ ఎవ్వరూ చేయలేనిఆ సాహసం ఈయనే చేశారు. అక్కడక్కడ చిన్నచిన్న పొరపాట్లు ఉన్నా...మొత్తంగా చూస్తే బాగుందనే చెప్పొచ్చు. ఎక్కడా సబ్జెక్ట్ పక్కదారి పట్టే సన్నివేశాలు లేవు. మొదటి భాగంలో అంతా హీరో లక్ష్యాలు, తన వ్యక్తిగత జీవితం, ప్రేమకథ, రొమాంటిక్‌తో సాఫీగా సాగిపోతుంది. రెండో భాగంలో మాత్రమే అసలు కథలోకి వెళతారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏం చేయాలనుకున్నది, దానికి దేవ్ ఎలా చేశాడనే అక్కడే చూడాలి. ముగింపు మాత్రం చిత్రం మొత్తానికే హైలైట్. దానికి ముందు అంతరిక్షంలో విఫలమైపోయిన 'విప్రయాన్' శాటిలైట్‌ను డీల్ చేసే బాధ్యతలు దేవ్ చేపట్టడం, ఆ మిషన్‌ను కరెక్ట్ చేయడం చాలా ఆసక్తిగా ఉంటాయి. హాలీవుడ్లో వచ్చిన 'గ్రావిటీ' వంటి సినిమాలు చూడకపోతే ఈ చిత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. చూస్తున్నంత సేపూ థ్రిల్ ఫీలవుతాం. కొన్ని సన్నివేశాలు, స్పేస్‌లో పరిశోధన హాలీవుడ్ చిత్రాల్లోని సీన్లు అన్నట్టుగా ఉంటాయి. ఈ చిత్రం క్లయిమాక్స్‌లో మాత్రం నిమిషం నిమిషం ఉత్కంఠగా సాగుతుంది. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను బాగా సాయపడింది.
ఈ చిత్రం మొత్తంగా చూస్తే హీరో హీరోయిన్ల ప్రభావం ఎక్కడా కనిపించదు. కేవలం పాత్రలే తెరపై కనిపిస్తాయి. దర్శకుడు సంకల్ప్, అతనికి సాయపడ్డ సాంకేతిక బృందం, ఆర్ట్ డైరెక్టర్ మోనిక రామకృష్ణ, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వీఎస్ మార్కు పూర్తిగా ఉంటుంది. ఈ చిత్రం కోసం వేసి ప్రత్యేక సెట్ నిజంగా అంతరిక్షాన్ని తలపించింది. 'రంగస్థలం' తర్వాత మోనిక రామకృష్ణ తీర్చిదిద్దన కళాఖండం అద్భుతం.
నటన : వరుణ్ తేజ్ వ్యోమగామిగా సరిపోయాడు. అదితిరావు హైదరి ఓకే. రెహమాన్, రఘు పర్వాలేదు. సత్యదేవ్ ట్విన్స్‌లా ఎందుకు పెట్టారన్నది తెలియడం లేదు.
లోపాలను పక్కన బెడితే తెలుగులో వచ్చిన తొలి అంతరిక్షం నేపథ్య చిత్రంగా ఈ సినిమా ఎప్పటికీ నిలిచిపోతుంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన పంథాలో చక్కగా విషయాన్ని చెప్పగలిగాడు. ఈ ప్రయత్నానికి అభినందనలు తప్పనిసరి.