'బిచ్చగాడు' చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్న తమిళ హీరో విజరు ఆంటోనీ నటించిన తాజా చిత్రం 'రోషగాడు'. సామాజిక సందేశం ఉన్న అంశాన్ని కథగా ఎంపిక చేసుకోవడం అభినందించదగ్గ విషయం. పోలీసు కథా చిత్రాలు చాలానే వచ్చినా ఇందులో కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ కథ గొప్పగా ఉన్నా కథనంలో అంతగా ఆకట్టుకునేలా చెప్పలేకపోయాడు దర్శకుడు. విజరు అంటోనివి 'బిచ్చగాడు' తర్వాత వచ్చిన చిత్రాలన్నీ కథాబలం లేక ఆడలేదు. ఇప్పుడు కథాబలం ఉన్నా..దాన్ని సమర్థంగా చెప్పడంలో తడబడ్డారు.
తారాగణం
చిత్రం : రోషగాడు
నటీనటులు : విజరు ఆంటోని, నివేత పేతురాజ్ , డానియల్ బాలాజీ తదితరులు
సాంకేతికత : ఛాయాగ్రహణం : రిచర్డ్ నాథన్, సంగీతం : విజరు ఆంటొని, దర్శకత్వం : గణేషా, నిర్మాత : ఫాతిమా విజరు ఆంటోని.
కథ : పోలీస్ కానిస్టేబుల్ కుమార స్వామి (విజరు ఆంటోని). తన తమ్ముడు రవికి అమ్మా, నాన్న అతనే. తమ్ముడిలో అమ్మను చూసుకుని పొంగిపోతాడు. కానీ అతను చదువు అబ్బక వ్యసనపరుడై ఇంటి నుంచి పారిపోతాడు. అలా హైదరాబాద్ పారిపోయి అక్కడి తుప్పుబాబ్జి అనే రౌడీ దగ్గర చేరి హత్యలు చేస్తుంటాడు. రెండు సంవత్సరాల తరువాత ఇన్స్పెక్టర్గా బదిలీపై హైదరాబాద్ వస్తాడు కుమారస్వామి. ఓ హత్య కేసులో సాక్షిని చంపిన కేసులో తన తమ్ముడే నేరస్తుడని తెలుసుకుని అతన్ని చంపేస్తాడు. అయితే, తన తమ్ముడులాగే మరి కొంత మంది పిల్లలు కూడా బాబ్జి కోసం పనిచేస్తున్నారని తెలుసుకొని కుమార్ స్వామి వారందరినీ మార్చాలనుకుంటాడు. ఈ క్రమంలో కుమార స్వామి అనుకున్నది చేయగలిగాడా? లేదా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ : పోలీసు కథలన్నీ ఒకేలా ఉంటాయి. సమాజంలో జరిగే చెడును నిర్మూలించేవాడే పోలీసు. ఆ చెడే తన ఇంటిలో ఉంటే దాన్ని నిర్మూలించి సమాజాన్ని ఎలా ఉద్ధరించాడన్నది ఇందులోని పాయింట్. సరికొత్త కథలతో ముందుకు వచ్చే ఆంటోని ఈ చిత్రంలో కొన్ని అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. సమస్యలు పరిష్కరించే క్రమంలో సినిమాటిక్‌గా మంచి ప్రయత్నం చేశాడనిపిస్తుంది. తన నటనపై తనే సెటైర్లు వేసుకొనేలా కొన్ని సన్నివేశాలు రాసుకోవడం విశేషం. విజరుకి సపోర్ట్ చేసే పాత్రలో నటించిన హీరోయిన్ నివేత పేతురాజ్ తన ఎనర్జిటిక్ నటనతో మెప్పించింది. విలన్‌గా చేసిన డానియల్ బాలాజీ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలుతో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. ఇందులో హిజ్రాలకు న్యాయం చేసేట్లుగా పోలీసు పాత్రను కూడా పెట్టారు.
దర్శకుడు గణేశా మంచి సందేశం ఉన్న కథని ఎంచుకున్నారు. ఆ కథను తెర ప్రదర్శించడంతో కాస్త తికమక పడ్డా ఫర్వాలేదనిపించాడు. ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది కానీ ఇంటర్వెల్లో ఒక చిన్న ట్విస్ట్‌తో సినిమాపై ఆసక్తి కలిగించాడు. కానీ ఆ తరువాత అదే మ్యాజిక్‌ని కొనసాగించలేకపోయాడు. సినిమా మొత్తం తమిళ్ ఫ్లేవర్‌లో ఉండడం, కొన్ని చోట్ల హద్దులు దాటడం వంటివి తెలుగు ప్రేక్షకులకు రుచించవు. సంగీతం కూడా మైనస్.
ఇక ఈ చిత్రానికి సంగీతం, ఎడిటింగ్ అందించిన హీరో విజరు ఆంటోని రెండింటిలోనూ సత్తా చాటలేకపోయాడు. ఉన్నవి మూడు పాటలే అయినా దాంట్లో ఏ ఒక్కటీ గుర్తించుకునేలా లేవు. రిచర్డ్ నాథన్ ఛాయాగ్రహణం బాగుంది. లోబడ్జెట్ సినిమా అయినా ఫాతిమా విజరు ఆంటోని నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపించాయి. వైవిధ్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజరు ఆంథోనికి ఈ చిత్రం ఇంతకుముందు చిత్రాల కంటే బెటర్ అని చెప్పొచ్చు. మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా ఏ సెంటర్ల ప్రేక్షకులను మెప్పించలేకపోయిన బి, సి సెంటర్లవారికి కనెక్ట్ కావచ్చు.
- ధనుంజయ్