తెలుగింటి పండగలోనూ ఎంతో వైవిధ్యం. అది కలగూర విందులా ఉంటేనే కదా అందరి పండగయ్యేది. ఎక్కడా కనిపించని విధంగా బోనాలెత్తే కుటుంబాలున్నాయి. ఇక్కడ థింసా, సోబేరీ నాట్యాల పోటీ విన్యాసమూ ఉంది. రుచిలో గుత్తొంకాయ, పొట్టేలు కూర ఢకొీట్టుకోవడమూ ఉంది. గొడ్డలి అమ్మ అయ్యే ఆచారమూ కనిపిస్తుంది. సంక్రాంతి అంటే ఒక్క భోగి మంటలు, చిల్లు గారెలు, బసవడి నాట్యాలు, హరిదాసు గానాలే కాదు. చాలానే ఉన్నాయి.. మన విస్త్రత, వైవిధ్య పెద్ద పండగలో.
అనకాపల్లి సమీపంలోని బొజ్జన కొండ ప్రాచీన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి. అనకాపల్లికి మూడు కిలో మీటర్ల దూరంలో, రైల్వే స్టేషన్‌కు రెండు కిలో మీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. సుమారు రెండు వేల ఏళ్లనాటి బౌద్ధ శిథిలాలను, గత వైభవ చిహ్నాలను నేటికీ ఇక్కడ చూడవచ్చు. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటక ప్రియులకు బొజ్జన కొండ మధుర స్పృతులను మిగిలిస్తుంది. ఇక్కడే, ప్రతి ఏటా కనుమ రోజున అతిపెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు సుమారు 50 నుంచి 60 వేల మంది కొరడను సందర్శిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనంతో కొరడ కిక్కిరిసిపోతుంది. కొండ శిఖరాగ్రం మీదనుంచి చూస్తే గళగళలాడే శారదానది, ఏలేరు కాలువ, ఇంకొక పక్క అనకాపల్లి పట్టణ అందాలు రమణీయ దృశ్యాలు కనిపిస్తాయి. ఉత్తర దిశగా పర్వత శ్రేణి, పచ్చని పంట పొలాలు కనువిందు చేస్తాయి.
మిర్తివలసలో బోనాలెత్తి...
విజయనగరం జిల్లా బలిజిపేట మండలంలోని మిర్తివలసలో వందేళ్లుగా 100 కుటుంబాలు ఏటా సంక్రాంతి పండగ రోజున బోనాల పండగను ఘనంగా నిర్వహిస్తారు. సంక్రాంతిని పురష్కరించుకొని గ్రామాల్లో బోనాలను ఏర్పాటు చేసిన వాటికి పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ బోనాలకు పెద్దలు కత్తిని చేతపట్టి బోనాలకు కాపరులుగా ఉంటారు. బోనాలకు పూజలు, పాటలు, ఆటలతో ఎంతో సందడిగా నిర్వహిస్తారు. మహిళలు బోనాలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా వస్తారు. చివరగా గ్రామ శివారున ఉన్న బోనాల అమ్మవారి గుడి వద్దకు వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు. పండగను చూడడానికి పక్క గ్రామాల నుంచి తండోపతండాలుగా ప్రజలు తరలివస్తారు.
తాడిపత్రిలో పందుల పందెం
అనంతపురం జిల్లాలో సంక్రాంతి మిగతా ప్రాంతాలకు దగ్గరగానే ఉంటుంది. కానీ, కనుమ రోజు ఇక్కడ పెద్ద కూరగా పొట్టేళ్ల మాంసం వండుకుని తింటారు. కొన్నేళ్ల నుంచి తాడిపత్రి ప్రాంతంలో సంక్రాంతి సందర్భంగా పందుల పందెం నిర్వహిస్తున్నారు. గతంలో ఈ సంప్రదాయం ఉండేది కాదు. అనంతపురం జిల్లాలో కోళ్ల పందేలు ఉండవు. అరకొరగా రెండు మూడు చోట్ల మాత్రమే జరుగుతాయి. ఈ మధ్యకాలంలో అయితే పందుల పందెం ఎక్కువగా జరుగుతోంది.
కర్నూలు జిల్లాలో కలగూరే..
కర్నూలు జిల్లాలో మాత్రం కీడు పండుగగా సంక్రాంతిని భావించి నామమాత్రంగా జరుపుకుంటారు. నంద్యాల, కర్నూలు లాంటి పట్టణ ప్రాంతాల్లో పిల్లలకు సెలవు రోజులు రావడంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే జిల్లాలోని పశ్చిమప్రాంతం పల్లెల్లో ఇంటి ముందు కల్లాపి కూడా చల్లరు. పిండి వంటలకు, కొత్త బట్టలకు దూరంగా ఉంటారు. సంక్రాంతి పండగ రోజున పొలాల నుంచి ధాన్యం ఇంటికొస్తుంది. ధాన్యానికి పూజ చేసి సజ్జ పిండితో రొట్టెలు, కలగూరకాయలతో చేసిన వంటలను మాత్రమే చేసుకుంటారు. వెల్దుర్తి మండలంలో సజ్జపిండి, జొన్నపిండితో నల్లనువ్వులు, తెల్లనువ్వులు కలిపి రొట్టెలు చేస్తారు. ఇదే పండగ వంటకం. ఘుమఘుమలాడే గుత్తొంకాయలతో చేసిన కూరలతో కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు విందారగిస్తారు. కనుమను కరిపండగా అని కూడా అంటారు. కోళ్ళపందేల పండగగా పిలుస్తారు. ఈరోజున పారువేట గుర్రపుపందేలు, ఎడ్లపందేలు, టెంకాయలతో, నిమ్మకాయలతో పందేలతోపాటు ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. ఒకప్పుడు తొక్కుడు బిల్ల, అష్టచెమ్మ, లగోరీలు, గిరిగిరి ముటుకులు గాజామాలు, పిడ్డీఫీలు అనే ఆటలు ఆడపిల్లలు ఆడేవారు. ఇప్పుడు చాలాచోట్ల పండగనంతా టీవీనో, సినిమానో, జూదమో ఆక్రమించేస్తోంది.
మన్యంలో సంక్రాంతి
విశాఖ మన్య ప్రాంతంలో సంక్రాంతి పండుగ సందడి జనవరి మొదటి వారం నుంచే ప్రారంభమవుతుంది. ఈ పండుగను గిరిజనులు ప్రాంతాల వారీగా మూడు వారాల పాటు జరుపుకుంటారు. పండుగ రోజు తమ గ్రామాల్లోని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు. నూతన వస్త్రాలు ధరించి భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులూ గిరిజనులు థింసా నృత్యాలు చేస్తూ ఆనందంగా జరుపుకుంటారు. వ్యవసాయ ఆధారంగా జీవించే గిరిజనులు సంక్రాంతి పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ పండుగ గిరిజనుల జీవన శైలికి అద్దం పడుతుంది. గ్రామాల్లో ఉన్న గ్రామ దేవతలకు, శంకు దేవునికి పూజలు నిర్వహిస్తారు. వరి ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చిన తరువాత ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగ సందర్భంగా గ్రామాల్లో ఉన్న బారికిలు ఇంటింటికీ వెళ్లి బియ్యం, కొంత నగదును సేకరించి పండుగను చేస్తారు.
భోగి రోజున గ్రామాల్లోని యువకులు భోగి మంటలు వేసుకొని ఆనందంగా గడుపుతారు. చదువు నిమిత్తం వేరే ప్రాంతాల్లో ఉన్న వారంతా కచ్చితంగా పండుగకు గ్రామాలకు చేరుకుంటారు. కొన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కర్రలను సేకరించి భోగి మంట వేసుకుంటారు. మరికొన్ని గ్రామాల్లో కర్రలను దొంగిలించి భోగి మంటను వేస్తారు. భోగి మంటల్లో నాగలి దుంపలను కాల్చుకొని తింటారు. పశువులకు ఆ రోజు స్నానాలు చేయించి రాగి పిండితో చేసిన ఉండలను కడతారు. ఆ ఉండలను పిల్లలు లాక్కొని తినాలి. అలా తింటే ఆరోగ్యంగా ఉంటారని గిరిజనుల నమ్మకం. సంక్రాంతి రోజున గ్రామంలోని అందరూ కలిసి పులగం (అలసందులు, బియ్యంతో కలిపిన వంటకం)ను వండి కొత్తబట్టలు ధరించి స్థానికంగా గ్రామాలో కొలువైన దేవతలకు పూజలు చేసి నైవేద్యంగా పెడతారు. వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లను శుభ్రం చేసి వాటిని పొలాలకు తీసుకువెళ్లి పూజలు చేస్తారు. అలాగే పశువులకు స్నానం చేయించి పంచె కప్పి, అడ్డాకులో నాగలిదుంపలు, పులగం కలిపి తినిపిస్తారు.
సొబోరి ప్రత్యేకం..
మన్యంలో ఈ పండుగను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ప్రధానంగా సొబోరి నృత్యం ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. యువకులు వేషధారణలతో గ్రామాల్లో, వారపుసంతల్లో సొబోరి నృత్యం చేస్తూ చందాలు వసూలు చేస్తారు. చిన్నారులు బుడియాల వేషధారణతో సేర్ బుడియాలు దండుతారు. అలా వచ్చిన చందా సొమ్ము పంచుకుంటారు. వచ్చిన పిండివంటలు, బియ్యాన్ని వండి పంక్తి భోజనాలు చేస్తారు. కొన్ని గ్రామాల్లో ఆ సొమ్మును సంక్రాంతి సంబరాలకు ఖర్చు చేస్తారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో నిర్వహించుకుంటారు.
(జిల్లా డెస్క్‌ల సహకారంతో....)
ఏజెన్సీలో కంది కొత్తల పండగ
విజయనగరం జిల్లా పార్వతీపురం ఏజెన్సీలో గిరిజనులు సంక్రాంతి పండగకు 15 రోజులు ముందు ఏటా కందికొత్తల పండగను ఘనంగా జరుపుకుంటారు. గిరిజనులంతా చిన్నారుల నుంచి వద్ధుల వరకు ఈ పండగలో భాగస్వామ్యమవుతారు. గిరి గ్రామాల్లో విస్తారంగా పండించే కందిపంట డిసెంబర్ మూడు, నాలుగు వారాల్లో చేతికొస్తుంది. ఈ నేపథ్యంలో కంది, చిక్కుడు, కరద తదితర కలగాయ కూరలతో అన్నం వండి జాకరమ్మకు నైవేద్యంగా పెడతారు. ప్రత్యేక పూజలు చేసి కుటుంబమంతా చల్లగా ఉండాలని కోరుకుంటారు. పురాతనం నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా నెమలి ఈకలతో ప్రత్యేకంగా తయారు చేసిన ఎదురుకర్రకు ముస్తాబు చేసి అందులో చిన్న కోడి పిల్లను, కంది, చిక్కుడు పువ్వులను కట్టి చివరి భాగంలో వెండితో తయారుచేసిన గొబ్బెమ్మను సత్తరమ్మగా తయారు చేస్తారు. ఆయా గ్రామాల్లో ఆచారాల ప్రకారం గుగ్గిలం కర్రను అలంకరించి గొడ్డలమ్మ (గొడ్డలి)ని అమర్చి ముస్తాబు చేస్తారు. వీటిని ఇళ్ల ముందు కట్టేందుకు ఎవరూ తాకని మట్టి తీసుకువచ్చి పీను తయారు చేసి, ఆ కర్రను పాతుతారు. వీటికి బయటకు తీసుకువెళ్లే ముందు గుగ్గిలం, సాంబ్రాణితో పూజిస్తారు. కొత్తబట్టలు వేసుకొని ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొంటారు. డప్పులు, సన్నాయి వాయిద్యాల నడుమ డాన్సులు చేస్తారు. చిన్నారుల నుంచి వద్ధుల వరకు థింసా నృత్యం చేస్తారు. గురువారం సాయంత్రం నుంచి సోమవారం వరకు గ్రామ గ్రామాన దేవతామూర్తులను ఊరేగిస్తూ ఉల్లాసంగా గడుపుతారు. మంగళవారం లేదా బుధవారం దేవతలకు అనుపోత్సవం జరుగుతుంది. గ్రామ పొలిమేరల్లో జంతువులను బలి చేసి వాటితో గ్రామస్తులంతా కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి.
- బి.విభీషణ్, కురుపాం
కలగూరే పండగ
