ఏ సినిమా నిర్మాణానికైనా మూలం నిర్మాత. సినిమా కోసం ఖర్చు పెట్టిన ప్రతిరూపాయి నిర్మాత చేతుల్లోంచే రావాలి. దానికి నిర్మాతకు సినిమాపై ఒక క్లారిటీ ఉండాలి. కథ, పాత్రల పరిణామక్రమం ముగింపు, మాటలు, పాటలు వీటన్నిటిపై అవగాహన ఉండాలి. అలాంటి నిర్మాతలందరూ విజయవంతమైన నిర్మాతలుగా చరిత్రలో నిలిచిపోయారు. ఆ కోవకు చెందిన నిర్మాతే మన్నవ బాలయ్య. మంచి నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన్ను మనోజ్‌కుమార్‌తో పోల్చేవారు. రూపంలోనే కాదు ఆలోచనల్లోనూ అటువంటి పోలికలున్నవాడాయన. అతని నిర్మాణంలో వచ్చిన చిత్రమే చెల్లెలి కాపురం.
మంచి కుటుంబ నేపథ్య చిత్రం కోసం స్వయంగా కథ రాసుకున్నాడు బాలయ్య. ఆకథకు న్యాయం చేయదగ్గ దర్శకుడు ఎవరు? అని ఆలోచించి కళాతపస్విని ఎంపిక చేసుకున్నాడు. ఆ ఎంపికలో సగం సినిమా విజయం సాధించినట్లే అని భావించారు. అయితే సినిమా మొదలు పెట్టినప్పటి నుంచీ ఆటంకాలు మొదలయ్యాయి. హీరో కారు నలుపు అయితే, ఆ పాత్రను ఎవరు చూస్తారు? ఈ చిత్రంలో శోభన్ బాబును హీరోగా అనుకున్నారు. అయితే అప్పుడప్పుడే పైకొస్తున్న హీరో ఇటువంటి సినిమాలు చేస్తే జనం చూస్తారా? ఒకవేళ తిరస్కరిస్తే ఈ చిత్రంపై ఉన్న అంచనాలన్నీ తారుమారవుతాయి అని బాహాటంగా విమర్శలు వినిపించాయి. అయితే బాలయ్య మహా మొండిఘటం. ఏ సినిమాకైనా కథే మూలం అని నమ్మే వ్యక్తి. తన కథపై తనకు నమ్మకం ఉంది. అందుకే 'ఈ సినిమా జయాపజయాలపై ఆలోచన లేకుండా ఈ సినిమా చెయ్యండి' అంటూ దర్శకత్వ బాధ్యతను విశ్వనాథ్‌గారి చేతుల్లో పెట్టారు.
విశ్వనాథ్ సాహసం
అంతా చక్కగా ఉంటే అటువంటి సినిమాని ఎవరైనా చేస్తారు. అయితే రిస్కున్న కథలు చేయడంలోనే థ్రిల్ ఉందని ఈ చిత్రాన్ని చాలెంజ్‌గా తీసుకున్నాడు విశ్వనాథ్. కళాకారుడిపై రూపుదిద్దిన కథ ఇది. ఆ కళాకారుడు అంద విహీనంగా ఉంటాడు. క్లైమాక్స్‌లో అతనికి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ కథపై విశ్వనాథ్ కూర్చున్నాడు. శోభన్‌బాబు పాత్రను కీలకమైన పాత్రగా మలిచాడు. ఇందులో శోభన్ బాబు పాత్రను కవి, భావకుడు, ఆవేశపరుడు, ఆత్మాభిమానం కలవాడిగా మలిచారు. శోభన్‌బాబు నటనపై విశ్వనాథ్‌కు మంచి అవగాహన ఉంది. శోభన్ బాబు బాడీలాంగ్వేజీకి తగ్గట్టుగా సన్నివేశాల్ని అల్లారు. ఇక ఈ చిత్రంలో వాణిశ్రీ కీలకమైన పాత్రను పోషించారు. అప్పుడప్పుడే నవలా చిత్రాల్లో నటిస్తూ నవలా నాయకిగా మంచి పేరు తెచ్చుకుంటుంది వాణిశ్రీ. సంపన్న కుటుంబంలో పుట్టిన ఒక సాహిత్యాభిమానిగా వాణిశ్రీ చుట్టూ ఒక ఆసక్తికరమైన సన్నివేశాల రూపకల్పన చేశారు. మూడవది నాగ భూషణం పాత్ర. శ్రమ ఒకరిదైతే దోపిడి మరొకరిది. ఈ అంశాన్ని తీసుకుని నాగభూషణంపై హాస్య సన్నివేశాల్ని రూపకల్పన చేశారు. సినిమా నిర్మాణం ఎప్పుడు చేపట్టినా అందులో సమకాలీన సమస్యలు ముడిపడి ఉంటే ఆ చిత్రాలని ప్రేక్షకులు ఆదరిస్తారు. వాటికి బ్రహ్మరథం పడతారు అనేది బాలయ్య ఫిలాసఫీ. 'చెల్లెలి కాపురం' చిత్రం విషయంలో అదే జరిగింది. వాస్తవానికి 'చెల్లెలి కాపురం' చిత్రంలో చెల్లెలి పాత్ర చాలా చిన్నది. ఈ పాత్రను మణిమాల చేసింది. చెల్లెలు సుఖంగా ఉండాలని ఆరాటపడే అన్నయ్యగా శోభన్‌బాబు చేశాడు. వీరిద్దరి చుట్టూ అల్లబడిన కథే మిగతా చిత్ర కథంతా. ఈ కసరత్తు విశ్వనాథ్ అద్భుతంగా చేశాడు.
ఇదో సవాలు
శోభన్‌బాబు అప్పటికే మంచి హ్యాండ్సమ్ హీరోగా వెండితెరపై వెలిగిపోతున్నాడు. అలాంటి హీరోకు కారునలుపు రంగు ఎందుకు పూయవలసి వచ్చిందో ఎవరికీ అర్థంకాలేదు. కారు నలుపు పాత్ర ఉంటే వచ్చే లాభాలు అదనంగా ఉంటాయా? అనే ప్రశ్నలు వెలువడ్డాయి. 1964లో 'నాదీ ఆడజన్మే' చిత్రం వచ్చింది. అందులో సావిత్రి కథానాయికగా ఇలాంటి ఒక పాత్రనే చేసింది. ఆమె మహానటి కాబట్టి రాణించింది. శోభన్ నటించగలడా? అనే విమర్శలు కూడా వినిపించాయి. వీటిని శోభన్‌బాబు చాలెంజ్‌గా స్వీకరించాడు. మేకప్ కోసం సమయం కేటాయించాడు. షాట్కీ షాట్కీ మధ్య గ్యాప్‌లో టచప్ చేసుకునే వాడు కాదు. టచప్ చేసుకుంటే అద్దంలో ముఖం చూసుకోవలసి వస్తుందని అలా జిడ్డువాలుతున్న ముఖంతోనే నటించేవాడు. ఎవరెన్ని విధాలుగా విమర్శించినా వాటిని సవాలుగా తీసుకునేవాడు. అలానే విజయం సాధించాడు.
మహదేవన్ బాణీలు
తెలుగుజాతి కె.వి.మహదేవన్‌కు రుణపడి ఉంటుంది. అలాంటి బాణీలను స్వరపరిచారాయన. పాటరాయడం పూర్తయిన తర్వాత ప్రతిమాటకు ఓ సొబగును అందిస్తారు. ప్రతిపదం అర్థం తెలుసుకుని ఆ పదానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అలా చేసినవే 'చెల్లెలి కాపురం' చిత్రంలోని పాటలన్నీ. 'కనుల ముందు నువ్వుంటే కవిత పొంగి పారదా... తొలి చివరలు చూడగానే ఇల కోకిల పాడదా!' శోభన్‌బాబు వాణిశ్రీలపై చిత్రీకరించిన ఈ పాటని బాలు రసరమ్యంగా పాడాడు. ఇందులో కొన్ని పాటలు సి.నా.రె రాశారు. 'భలే భలే మా అన్నయ్య బంగారంలాంటి అన్నయ్య...' పాటను జానకి పాడారు. మణిమాల (శోభన్ చెల్లి పాత్ర)పై ఈ పాటను చిత్రీకరించారు. 'రానే వచ్చాడు... తీరా తనే వచ్చాడు' అనే జానపద నృత్యగీతికను జానకి పాడారు. వాణిశ్రీపై చిత్రీకరించారు. వీటన్నిటినీ మించి చిత్ర కథకు ప్రాణప్రదమయిన పాట సి.నారాయణరెడ్డి రాశారు. 'ఆడవే మయూరి నటనమాడవే మయూరి.. నా పదములుగని...' ఆద్యంతమూ అద్భుతంగా కొనసాగుతుందీ పాట. కవికి, నృత్య కళాకారిణికీ మధ్య పోటాపోటీ జరిగే సందర్భంలోనిది ఈ పాట. వాణిశ్రీ శోభన్‌బాబు పోటీపడి నటించి సినిమాలో పతాక సన్నివేశాన్ని రక్తికట్టించారు. నిజమైన కవి ఎవరో నకిలీ కవి ఎవరో తెలియజెప్పి నిజాన్ని నిగ్గు తేల్చే సన్నివేశం సినిమాకు ప్రాణధాతువుగా నిలిచింది.
సంక్షిప్త కథ
శోభన్‌బాబు (రాము) ఓ పల్లెటూర్లో రావుగోపాలరావు దగ్గర వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఉంటాడు. తన ఒక్కగానొక్క చెల్లిని చదివించుకుంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. పల్లెగాలికి, పిల్లతెమ్మెరలకు ఆయనలో భావావేశం పొంగుకొస్తుంది. భావగీతికలు రాసుకుంటుంటాడు. ఆ వ్యాపకంలో తన బాధలను మరిచిపోగలుగుతాడు.పెళ్ళీడుకు వచ్చిన చెల్లికి పెళ్ళి చేయాలి. పెళ్ళి చేయాలంటే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే బస్తీకి వెళ్ళడం ఒకటే మార్గం. అలా పట్నంలో తను రాసిన కవితా రచనలు అచ్చు వేయించే నేపథ్యంలో కనిపించిన ప్రతి ప్రెస్సుని సంప్రదిస్తాడు. తన వికారమైన రూపాన్ని చూసి తిరస్కరిస్తారు. అనుకోకుండా తన చిన్ననాటి మిత్రుడు నాగభూషణం కలుస్తాడు. తాను బతకనేర్చినవాడు. శోభన్‌బాబు విషయం తెలుసుకుంటాడు. ''డాబు దర్పం లేకుండా ఎవరూ ఆదరించరు నీ రచనలు. నా పేరుతో అచ్చు వేయిస్తాను. ఆ డబ్బుతో నువ్వు దర్జాగా బతకవచ్చు..'' అంటూ సలహా ఇస్తాడు. నాగభూషణం. శోభన్‌బాబు రచనలను తన రచనలుగా చెప్పుకుని డబ్బు, పేరు సంపాదిస్తాడు. రాము (శోభన్) తనచెల్లిని శ్రీరామ్(నాగభూషణం)ను పెళ్ళి చేసుకోమని ప్రాధేయపడతాడు. ముందు ఒప్పుకోకపోయినా ముందు ముందు రాము రచనల్ని సొమ్ము చేసుకోవాలనే దురాశతో ఒప్పుకుంటాడు. రాము రచనల్ని విపరీతంగా ఆకర్షించిన ఒక మహిళా అభిమాని రాధ (వాణిశ్రీ). శ్రీరామ్(నాగభూషణం)కు ఒక లేఖ రాస్తుంది. ఆ లేఖ చదివిన రాము భావోద్వేేగానికి లోనవుతాడు. ఆమెను ప్రేమిస్తాడు. రాధ(వాణిశ్రీ) మొదట్లో నాగభూషణమే రాము అనుకుంటుంది. ఆ తర్వాత రాముతో మాట్లాడిన తర్వాత ఏదో తేడా ఉందని గమనిస్తుంది. ఒక సందర్భంలో తను నృత్యం చేసేందుకు నాగభూషణాన్ని కవిత్వం చెప్పమంటుంది. నాగభూషణం తెల్లముఖం వేస్తాడు. శోభన్‌బాబు (రాము) రంగంలోకి దిగుతాడు. అప్పుడు అసలు నిజం రాధ (వాణిశ్రీ)కు మాత్రమే కాదు ప్రజలందరికీ తెలుస్తుంది. ప్రజలు బ్రహ్మరథం పడతారు.
సున్నితమైన అంశాల్ని సెల్యులాయిడ్‌పై మలచడంలో విజయం సాధించాడు దర్శకుడు. హీరో అందవికారంగా ఉన్నా అతని మాటలు సన్నివేశాల రూపకల్పన, సెంటిమెంట్ పండించడంలో చతురత ప్రేక్షకులకు ఆ పాత్రను దగ్గర చేశాయి. ఈ చిత్రంలో వాణిశ్రీ, శోభన్‌బాబు నటన కలకాలం గుర్తుండిపోతుంది. ఈ చిత్రంలో పాటలకు ప్రాణప్రతిష్ఠ చేశారు కె.వి.మహదేవన్‌గారు. అమృతా ఫిలింస్ బ్యానరులో వచ్చిన ఈ చిత్రం ఆ బ్యానర్‌కు మంచి పేరునందించింది.
- ఇమంది రామారావు
9010133844
భలే భలే ఆ అన్నయ్య
