అదో అపార్ట్మెంట్ల అడవి. పూర్తిగా కాంక్రీట్ అడవని అనడానికి లేదు. మధ్య మధ్యలో మిగిలిపోయిన బోలెడంత ఖాళీ జాగాల్లో పెద్ద పెద్ద చెట్లు చాలానే ఉన్నాయి. అదీ అడవిలానే అనిపిస్తుందనే చాలామంది కొన్ని నెలలే అద్దెకొచ్చి వెళ్లిపోతుంటారు. అద్దెలు తక్కువ కావడం ఆకర్షిస్తే.. నగరానికి దూరంగా అడవిలో తలదాచుకున్న అభద్రత వికర్షిస్తుంటుంది. అలా ఆకర్షణలో పడిన కొత్తవాళ్లు ఓ అపార్ట్మెంట్లో అప్పుడే అద్దెకు వచ్చారు. అంతకు ముందు ఖాళీ చేసినవాళ్ల చెత్తతో పాటు కొన్ని గురుతులు పై అటకల్లో మిగిలిపోయాయి. అందులో అతి విలువైనదిగా అనిపించిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఉంది. అందులో ఒకామె..! ఒక అమ్మ ఫొటో ఉంది. 'అరె.. దీన్నెలా మరిచిపోయార'ని కొత్తవాళ్లింటి అమ్మ అంది. 'బహుశా కలర్ ఫొటో చేయించుకుని ఇది మూలన పడేసుంటార'ని ఆ అమ్మ కొడుకు సర్దిచెప్పాడు. ఇల్లు దులిపేటపుడు ఈ ఫొటోను పడేయకండనే ఆ అమ్మ మాట బాగానే గుర్తు పెట్టుకుని, శుభ్రంగా తుడిచి మళ్లీ ఆ అటక మీదే ఈ కొత్త కుటుంబం వదిలేసింది. అది మళ్లీ దుమ్ము కొట్టుకుపోయినంత కాలం గడిచినా ఆ పాతవాళ్లు రాలేదు. వాళ్ల చిరునామానో, ఫోన్ నెంబరో కనుక్కుని చెబుదామంటే.. ఓనరే సరిగ్గా అడ్రస్‌లో ఉండడు. చుట్టుపక్కల వాళ్లూ తమలానే కొంచెం పాత, కొంచెం కొత్తోళ్లు. అంత కలుపుకుపోతే.. తేడాగా అనుకుంటారనే ఉద్దేశంతో ఆగిపోయారు. అపార్ట్మెంట్ దగ్గర ఎప్పుడో పడేసిన మిగతా చెత్త వారం వారం కొంచెం కొంచెం తరుక్కుపోతోంది. ఆ తరుక్కుపోవడంలోను ఓ పద్ధతి కనిపిస్తోంది ఇంటి పెద్దాయనకు. తొలిసారి కొంచెం విరిగిపోయిన డబ్బాలు, బకెట్లు మాయమయ్యాయి. ఆ తర్వాత ఓ పాత బ్యాగ్, చిరిగిన ప్లాస్టిక్ చాప, మూడు కాళ్ల కుర్చీలు రెండు ఇలా అన్నీ ఇంటి వస్తువులే కనిపించలేదు.
ఇంత ఎండల్లోను అక్కడి వాతావరణం కాస్త చల్లగానే అనిపిస్తోంది పెద్దాయనకు చెట్ల గాలి వల్ల. ఆయన అపార్ట్మెంట్లంత ఎత్తు చెట్లను చూసిందీ అక్కడే. ఇంత మంచి వాతావరణాన్ని వదులుకుని ఎందుకు వీళ్లంతా ఇరుకు పట్నంలోకి పరుగులు తీస్తున్నారో కొన్నిరోజుల వరకు అర్థం కాలేదు. కానీ, ఆ అపార్ట్మెంట్లలో అంతమంది కుక్కుకుని ఉన్నా భరించలేనంత ఒంటరితనాన్ని అవి ఉక్కబోస్తున్నాయని తెలిసివస్తోంది. ఎవరిని పలకరిద్దామన్నా ఇబ్బందే. అందుకే ఆ అమ్మ ఫొటో అలా అటక మీదే పరిమితమైంది. అది గుర్తొచ్చినప్పుడల్లా దాంతో ఆయనకు కాసింత ఇదిగానే అనిపిస్తుండేది. ఈలోగా మరో విషయం దాన్ని మర్చిపోయేలా చేసేది. ఇలా ఆ ఫొటో అటక మీదే పడుండి పోయింది. అపార్ట్మెంట్ మీదకు పూర్తిగా ఎక్కి అక్కడి నుంచి ఆ ప్రాంతాన్ని చూడటంలో ఏదో సంతోషం కలిగి ప్రతి ఉదయమూ దాన్నో రొటీన్ చేసుకున్నాడు. మనుషులు సరిగ్గా మాట్లాడకపోయినా ఆ భవంతులు, ఆ కిటికీలు, తలుపులు చాలా సంభాషణల్నే సాగిస్తున్నాయి. బయట ఆరేసే బట్టల వల్ల ఏ కుటుంబం ఎంత సైజు, ఎంత రిచ్చూ వంటి అంచనాలు వేస్తూ టైంపాస్ చేస్తుండేవాడు. ఆ పెద్దాయనకు మరే పనేం లేదు మరి. బిడ్డల భుజాలకు బాధ్యతలు వదులుకోబడ్డాయి. ఆయన పెద్దరికం అపార్ట్మెంట్ ఆనుపానులు కనిపెట్టుకోవడానికి పరిమితమైంది.
అలాంటి ఓ ఉదయం ఆయన దృష్టి ఎదురు అపార్ట్మెంట్ పై ఫ్లాట్ పూల కుండీల మీద నుంచి ఒక్కసారిగా కిందున్న ఖాళీ జాగాలో కూలిపోయింది. ఎవరో ఓ వ్యక్తి ఆ చెత్తలో తచ్చాడుతున్నాడు. ఓ కర్ర పుల్లతో చెదరగొడుతూ ఏవో అమూల్యాల కోసం, అత్యవసరాల కోసం వెతుకుతున్నాడు. పాత గౌన్లు, చొక్కాల వంటి అత్యవసరాలు అప్పటికే అయిపోయినై కదా..! అదే ఓ పద్ధతిలో పాతింటివారి చెత్త మాయమవుతుందనే విషయం ఉంది కదా! అదే ఇది. ఆ చెత్తలో తర్వాత కనబడకుండా పోయినవి పాత బట్టలు. చిత్తు కాగితాలు ఏరేవారైతే ఆ చెత్తలోని చాలావాటినే తీసుకెళ్లేవాళ్లు. కానీ, ఇతగాడు మాత్రం ఎంచి ఎంచి వెదుకుతున్నాడు. ఆయన తెచ్చుకున్న సంచీ చిత్తు కాగితాలు ఏరేవాళ్లదానిలా లేదు. పెద్దాయనకు పెద్ద ప్రశ్న అయిపోయింది ఆ పొద్దు. కింద చెత్తలో ఆ వ్యక్తి సంచారం అయ్యేంత వరకూ అలానే చూస్తుండిపోయాడు. అలాగే చూడటం వల్ల కిందున్న వ్యక్తి ఆనవాళ్లను అంతెత్తు నుంచి మిగుల్చుకోగలిగాడు. ఎటూ పేదరికం ప్రత్యేకం చేసే పేగులకు అతుక్కుపోయే పొట్ట, రివిటెలాంటి దేహం ఆ చుట్టుపక్కల చూసింది లేదు. పగలు రెక్కీకొచ్చి రాత్రుళ్లు పడే దొంగ అనే అనుమానం లేదూ...! ఆ వ్యక్తి చూపులన్నీ ఆత్రుతగా ఆ చెత్తలోనే కలిసిపోతున్నాయి. అంతసేపటి నుంచీ తలెత్తి అంతెత్తు ఆ అపార్ట్‌మెంట్‌ను చూసింది లేదు.
ఏ దారి ఎటు కలుస్తుందో కనుక్కొచ్చి ఇంట్లో చర్చించే వ్యాపకం ఒకటి కొత్తగా పెట్టుకున్నాడు పెద్దాయన. అలా ఓ పది వీధులు పది రోజులు పూర్తయ్యాక ఇక మారుమూల ప్రాంతం ఒకటి మిగిలి ఉంది. అంతెత్తు అపార్ట్మెంట్ మీది నుంచి చూసినా కనిపించని ఓ ప్రత్యేక ప్రాంతమది. చెట్ల కింద అక్కడక్కడ నీలి, నలుపు పట్టాల కింద కొన్ని జీవితాలు ఎవరికీ పట్టనట్టు మిగిలిపోయాయి. తమ అపార్ట్మెంట్ల వద్ద రీసైకిల్ అయిన చెత్త.. అదే పాత వస్తువులన్నీ చక్కగా పేర్చి వాడబడుతూ అక్కడ కనిపించాయి. అంతకుముందు ఓ చక్రం విరిగిపోయిందని తాను విసిరేసిన తన మనవడి కారు బొమ్మ చుట్టుతా కొందరు చిన్నారులు చేరి ఏదో ఆటాడుతూ కనిపించారు. ఇంట్లోని వస్తువులు అత్యవసరాలయితే, ఈ బొమ్మలు అమూల్యాలన్న మాట..! 'అలా చెత్తలో విసిరికొట్టే బదులు కాస్త బాగుచేయించి వీళ్లకు నేరుగా ఇచ్చే తీరిక చేసుకుంటే ఎంత బావుణ్ను' అని ఆ పెద్దాయనకు అనిపించింది. అంతకుముందు అమ్మ ఫొటోని అప్పజెప్పే విషయంలా.. ఈ అనిపించడమూ సడెన్‌గా వచ్చిన ఫోన్‌కాల్‌తో మిస్సయిపోయింది.
మండు వేసవిలో అకస్మాత్తుగా విజృంభిస్తున్న వర్షాల ధాటికి ఆ పెద్దాయన టెర్రస్ వదిలి సెల్లార్‌కు కాలక్షేపం మార్చాడు. గుండెలదిరే పిడుగులు ఒక్క చుక్క వర్షం పడకున్నా గడగడలాడిస్తున్నాయి. ఒకటే ఈదురుగాలి. ఎదురుగా ఉన్న చెత్తకుప్ప ఎగిరొచ్చి మీద పడుతుందని ఫ్లాట్కెళ్లిపోవాలని మనవరాలి బొమ్మల్ని ఓ కవర్లోకి వేశాడు. మరీ ముందు పార్కింగ్ స్పాట్ తమదే కావడం బిడ్డల బండ్లు ప్రవేశ మార్గానికి దగ్గరలోనే ఉండటంతో ఏవైనా ఎగిరొచ్చి వాటిని దెబ్బతీస్తాయనే ఆలోచన తట్టింది. వెంటనే గేటు మూసేద్దామని అడుగులు వేశాడు. అంత హోరుగాలిలోనూ.. చిత్తుకాగితాలు కవర్లు విసుర్లలోను ఇద్దరు పిల్లలు ఆ చెత్తలో ఇంకా వేటినో వెదుకులాడుతూ కనిపించారు. పెద్దాయన గుండె జల్లుమంది. ఆ గాలి విసురుకి ఏదైనా చెట్టు విరిగితే..! 'ఏరు పిల్లలూ! ఇటు రండి.. వస్తారా..రారా' అంటూ గదమాయించడం మొదలెట్టాడు. ఆయన మాట వాళ్ల చెవిని చేరకుండా ఈదురుగాలి ఎగరేసుకుపోతోంది. ఇంతలో ఎవరో చెట్ల మధ్యలోంచి వేగంగా పరుగెడుతూ వచ్చి పిల్లల్ని భుజాలకు లాక్కొని రోడ్డెక్కాడు. మనిషి వాలకం ఎక్కడో చూసినట్టనిపించింది పెద్దాయనకు. అంతకుముందు తాను అపార్ట్మెంట్ రూఫ్ మీద కాలక్షేపం చేస్తున్నప్పుడు ఆశ్చర్యపోయిన వ్యక్తి అతడు. గాలి, దుమ్ము వల్ల కళ్లు మూసుకుని ఎటు నడవాలో తెలీక పిల్లల్ని గట్టిగా కర్చుకు కూర్చున్నాడు. అతడి తుండు వారి ముఖాలకు అడ్డుపెట్టినా పిల్లలు భయపడిపోతున్నారు. 'ఏరు బాబూ! ఇటు రండి' అంటూ మరోసారి పెద్దాయన గట్టిగా కేక వేశాడు. తలెత్తి చూడకుండానే మాటొచ్చిన వైపుకి పరుగున పిల్లల్ని చేర్చేశాడా వ్యక్తి. 'మంచిదయ్యా..!' అంటూ పెద్దాయనకు దండం పెట్టాడు. తమ చేతుల్లోని బొమ్మల్ని గట్టిగా పట్టుకున్న పిల్లలు.. ఆ స్టఫ్డ్ టారుల్లానే తండ్రి కౌగిలి నుంచి విప్పార్చుకున్నారు. చెవులు, తోకలు లేని ఆ బొమ్మలు, మాసి, దూది బయటకొచ్చిన ఆ బొమ్మలకూ... ఈ పాలుగారని బొమ్మలకు పోలికలెక్కువ కనిపించినై పెద్దాయనకు. మనస్సు చివుక్కుమంది.
కాసేపు మౌనం తర్వాత 'ఏం చేస్తుంటావ్' అని ఆ తండ్రిని అడిగాడు పెద్దాయన. 'ఎవులు పిలిస్తే ఆళ్లొద్దకు పనికి పోతా..' అని వచ్చిన సమాధానంతో ఆయన గుండె బరువైంది. 'మరెందు ఆ చెత్తలోకి వెళుతున్నావు' అన్న మరో ప్రశ్నకు 'బక్కోడినని పనెవల్లూ ఈయట్లేదు సామీ..' అన్న మరో బలహీనమైన జవాబుతో పెద్దాయనింకేమీ అడగలేకపోయాడు. వాళ్లను పరీక్షగా చూడటం మాత్రమే చేయగలుగుతున్నాడు. వర్షం అందుకుంది. ఉన్నట్టుండి ఉట్టి పగిలినట్టైంది ధార. సుమారు నెలన్నర కాగుడు రోజుల తాకిడికి వేడి పొక్కులు దేలిన ఆ చిన్ని దేహాలకు... వర్షధారలోంచి తప్పించుకొస్తున్న చల్లగాలి, పిల్లర్లను తగిలి లోపలికి గెంతుతున్న తుంపర్లు తగిలి ఎంత హాయి కలిగిందో పిల్లలిద్దరూ గెంతులు వేయడం మొదలెట్టారు. ఆ గెంతులాటలు చూసి ఎన్నాళ్లైందో.. తండ్రి వాళ్ల అల్లరికి అడ్డుచెప్పడం మాని.. చేతులు కట్టుకుని నిలబడి ఆరాధనగా చూస్తున్నాడు. పెద్దాయన బరువూ దిగిపోయింది. ఆ తండ్రి పరవశాన్ని కొంచెం తన వశమూ చేసుకుంటూ నీటి తుంపర్లను చేత్తో ఎగరేసే ఆటలో తన చేయీ చిన్నారులతో కలిపాడు. ఇంతలో ఆ తండ్రి జాగ్రత్తగా మడిచిపట్టుకున్న ఓ ఫొటోను తీసి సరిచేస్తున్నాడు. అది ఆ చెత్తలో దొరికిందే. 'సామీ.. ఈ అమ్మ కూడా మీలానే సామీ. అదుగో నా చిన్నబిడ్డ ఏసుకున్న గౌను ఆయమ్మ ఇచ్చిందే..!' అంటూ పెద్దాయనకు చూపించాడు. ఆ ఫొటోలో ఉన్న 'అమ్మ' రూపం.. తమింట్లోని అటక మీద దాచిన ఫొటోఫ్రేమ్లోని 'అమ్మ' రూపం ఒకటే. 'ఆమె నీకు తెలుసా...!' అనే మాట పూర్తవ్వకముందే ఓ పెద్ద పిడుగు దగ్గర్లో పడింది. అది ఆ అపార్ట్మెంట్ల మారుమూల ప్రాంతంలోనే కావడంతో సెల్లారంతా కదిలినట్టైంది. కళ్లను బైర్లు కమ్మించిన వెలుగు చూసిన ఆ తండ్రి అక్కడే కూలబడి చేతులతో తల మీద బాదుకున్నాడు. పెద్దాయనకూ అతడి బాధ అర్థమైంది. అన్నిరోజులూ పోగేసి కట్టుకున్న ఆ గూడు తగలబడిపోయింటుంది. తొలుత కెవ్వుమని అరిచి ఒకరికొకరు కరుచుకున్న పిల్లలిద్దరూ ఆ తర్వాత మళ్లీ తమ కేరింతలు వర్షంలోకి ఎగరేస్తున్నారు. వర్షం చినుకులు పాడు చేయకుండా జాగ్రత్తగా తెచ్చిన ఆ అమ్మఫొటోపై ఆ తండ్రి కన్నీళ్లు పడ్డాయి.
- అజై
95023 95077
అమ్మ ఫోటో
