గిర్రున తిరిగింది సైకిల్ చక్రం. స్టాండేసిన సైకిల్ పెడల్ మీద కాలు ఆడించుకుంటూ దర్జాగా మాట్లాడుతున్నాడు కోటిగాడు. అంతకు ముందెప్పుడూ కాదు గానీ, ఆ రోజు... ముఖ్యంగా ఆ నిమిషం మాత్రం వాడు హీరోగా కనిపించాడు. తిరునాళ్లలో కిక్కిరిసిన జనం మధ్య నుంచి ఎలా తప్పించుకొచ్చిందో అదాటున ఓ పిల్లగాలి వాడి ముఖానికేసి గట్టిగా కొట్టింది.. ఉప్పు చారలు దేలిన వాడి ముఖానికి, నిప్పుదేలిన వాడి కళ్లకు అమ్మ కొంగు అద్దినట్టుగా. వాడు కాళ్లూపడం ఆపేశాడు. సైకిల్ చైన్ కదలకపోయినా సైకిల్ చక్రం తిరుగుతూనే ఉంది. వాడిక్కడ ఎందుకు హీరో అయ్యాడంటే.. మా సైకిళ్లన్నీ తిరునాళ్ల బయటే దూరంగా నిలిచిపోయినరు. కానీ, వీడి సైకిల్ సరాసరి తిరునాళ్లకు పెద్దోడైన జెయింట్ వీల్ దగ్గర వరకూ వచ్చేసింది. వాడు నిన్నో ప్రామిస్ చేశాడు. ఈ యేడు సావాసగాళ్లందరినీ రంగుల రాట్నం ఎక్కిస్తానని. అందుకే వాడు దర్జాగా సైకిల్ పెడల్ మీద కాళ్లూపుతుంటే మేమంతా ఎదురు నిలుచుని వాడి దర్పం చూస్తున్నాం. మాలో ఒకడికి వాడు చెప్పినదాని మీద అస్సలు నమ్మకం లేదు. బడిలో ఉన్నప్పుడే వాడు చివరి క్లాసులొదిలేసి పనికెళ్లిపోయాడు.. వాడెలా రంగుల రాట్నం ఎక్కిస్తాడని ఎకసెక్కాలాడేడు దారెంట. అయినా, చూద్దాం! అంటూ తోడొచ్చాడే గానీ, వాడికైతే నమ్మకం లేదు. కానీ, ఇప్పుడు కోటి గాడి తీరు చూస్తుంటే మాత్రం వాడూ రంగుల రాట్నం ఎక్కడం ఖాయమైనట్టే ఉందని గుంపు వెనుక నుంచి మధ్యలోకి వచ్చి వింటున్నాడు. అంతకు ముందు మా క్లాసులోని కొందరు అమ్మాయిల్ని కోటిగాడు రంగుల రాట్నం ఎక్కించాడట..! నిన్న చెరువు గట్టు కాడ సైకిల్ చక్రాల మధ్య మాటల్లో పెద్ద చర్చే జరిగింది. అందులోను ఎకసెక్కాలాడేవాడితో సిగ్గుమొగ్గలు వేయించే అమ్మాయిని కూడా అవడంతో కోటిగాడి స్టార్డమ్ అమాంతం చక్రాల్లా తిరిగి సైకిల్ చక్రం నుంచి జెయింట్ వీల్ అంత పెద్దదై పోయింది. బ్యాచ్ బ్యాచ్ అందరికీ కోటిగాడి మీద పరేషాన్ ఎక్కువైంది. నిన్న ఎకసెక్కాలాడేవోడి అమ్మాయి. మరి రేపు...! ఇలా అందరు క్లాస్ అమ్మాయిల్ని రంగుల రాట్నం ఎక్కించేస్తే..! బ్యాచ్‌లోని అడాల్సెంట్ లవ్వోళ్లంతా బావురుమన్నారు. కోటిగాడి మీద అలిగారు. ఓ చిన్నపాటి యుద్ధాన్నే చేయాలని చెరువు గట్టు కాడే ఇక బ్యాచ్‌లో వాణ్ని మిగుల్చుకోవాలో లేదో తేల్చేయాలని.. పెద్ద పెద్ద మాటలే ఆడారు. మాట్లాడితే రాళ్లను ఏరి చెరువు నీటి మీద కదలకుండా నిద్రపోతున్న చంద్రుడికి లాగి లెంపకాయలు విసురుతున్నారు. నీటి అలజడికి చెదిరిపోవడమూ మళ్లీ సర్దుకోవడం చంద్రుడికేంటి నాకే చిరాకేసింది. వీళ్లలో అలజడికి పక్కన చెట్టు కింద కూర్చుని కునికిపాట్లు పడుతున్న కుక్కకు చికాకు పెరిగింది. పెద్ద గొంతుతో అందర్ని అక్కడితో కసిరేసింది. మాలో ఇంకా సైకిల్ సైడు తొక్కుడు గాడు ఒకడున్నాడు. వాడికిలాంటివి అస్సలు పడవహే. అందుకే అంతదూరంలోంచి కోటిగాణ్ని గుర్తుపట్టి ఓ విజిలేసి కేకేశాడు. అంతకు ముందు అది తేల్చేద్దాం ఇది తేల్చేద్దామని కాస్త గట్టిగా మాట్లాడిన వాళ్లంతా మిగతా బ్యాచ్‌లో వెనక్కెళ్లిపోయి అటు మొఖం వేసుకుని చూస్తున్నారు. మిగతా వాళ్లంతా కోటిగాడి చేతుల్ని కొడుతూ గుంపు మధ్యలోకి లాక్కున్నారు. 'అరెరు చెప్పు. మన క్లాసమ్మాయిల్ని రంగుల రాట్నం ఎక్కించావంటగా..! నన్ను పిల్వచ్చు గదరా..!' అని ఒకడు, 'ఆళ్లు నీతో కూర్చుంటే భయమేయలేదురా..! నిన్న తిరునాళ్లకు మాస్టారు కూడా వచ్చాడట.' అని ఇంకొకడు కోటిగాడి సాహస గాథలో వాళ్లకున్న డౌట్లేవో అడుగుతూ సతాయిస్తున్నారు. వాడు మాత్రం నెమ్మది అయిపోయాడు. 'అరె అదేం లేదురా...' అంటూ చొక్కా చేతులు భుజాలకు ముడుచుకుంటున్నాడు. వాడు క్లాసులో కనిపించేదే తక్కువ. ఇంతలో అమ్మాయిల్తో ఇంత స్నేహం ఎలా ముదిరిపోయిందో చాలామందికి అర్థం కాలేదు. పదే పదే ఆ విషయాన్నే వీపు మీద ముంజేతితో గుచ్చుతూ అడుగుతుంటే.. 'ఏ పో! వాళ్లనొదిలేరు.. మిమ్మల్నీ రేపు ఎక్కిస్తగా..' అంటూ చేసిన వాగ్దానం.. ఆ తర్వాత జట్టు కటీఫ్లకు విరిచే వేళ్లూ జరిగినవన్నీ సైకిల్ చక్రంలానే గిర్రున తిరిగి ఆగారు.
'ఏరు పొండ్రా..! ఆ చెట్టు కాడ నిలుచోండి. కాసేపాగి నేనొస్తా..!' అంటూ చెదరగొట్టేశాడు కోటిగాడు. టికెట్ కౌంటర్ దగ్గర ఏదో మాట్లాడి లోనికెళ్లి నిల్చున్నాడు వాడు. అదేంటి మమ్మల్నంతా వదిలేసి వాడొక్కడే షోగ్గా తిరిగేస్తాడా ఏంటి అని గుంపంతా ఒక్కసారిగా అటెన్షన్ తీసుకుని చూసింది. వాణ్ని అనేక పేర్లతో పిలిచింది. వాడు అక్కడ నుంచి కాసేపాగండి అంటూ చేయూపాడు. ఆ తర్వాత బహుశా ఓనర్ అనుకుంటా రంగుల రాట్నం దగ్గర పొగ పీలుస్తున్న ఒక పెద్దాయన దగ్గరకెళ్లి ఏదో చాలాసేపు మాట్లాడాడు. రంగులరాట్నమంటేనే తిరునాళ్లకు పెద్దోడు. ఇక దాని ఓనర్గారంటే..! అలాంటాయనతో వాడు అంత చక్కగా మాట కలిపేసరికి కోటిగాడు ఇంకా పెద్ద హీరోలా కనిపిస్తున్నాడు. ఆ పెద్దాయనకు మా వైపు చూపించి ఏదో చెప్పాడు. వేళ్లతో ఏదో లెక్క చెప్పేసి ఆయనేదో అనేసి పక్కకు వెళ్లిపోయాడు. చెట్టు దగ్గర కాసేపు నిలబడి కాసేపు కూలబడి కాసేపు కొమ్మలపై ఊగి కాసేపు అటొచ్చే వాళ్లెనుక చూసి ఇలా చాలా సమయమే గడిచింది. రంగుల రాట్నం ఫుల్లుగా నిండి ఆరేడు సార్లు తిరిగేసుంటది. రాను రాను క్యూలైను పెరుగుతుందే గానీ, తగ్గడం లేదు. దానితో సంబంధం లేకుండా గేటులోనికెళ్లిన వాళ్లలో ఎవరిని ముందు ఎక్కించాలో..! ఏ పెట్టెలో అవకాశం ఇవ్వాలో అంతా కోటిగాడే చూసుకుంటున్నాడు. ఇప్పుడింకా పెద్ద హీరో అయిపోయాడు. 'వాడేందిరా...' అంటూ మా బ్యాచ్‌లోని ఎకసెక్కాలోడు నోరు తెరిచాడు. 'మరదే కోటిగాడు' అంటూ గుంపులో ఎవడో అన్నాడు. ఇంకెవడు.. సైకిల్ని సైడు తొక్కేవాడే అయింటాడు. ఆ ట్రిప్పు పెట్టెల్లో అక్కడున్నోళ్లను ఎక్కించేశాక కౌంటర్లో ఏదో చెప్పి మా దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. ఇందాకటి కంటే ఇప్పుడు వాడి ముఖంలో ఉప్పు మరింత దేలి కనిపిస్తోంది. ఎంత ఉధృతంగా గాలి వీస్తున్నా వాడి చెమట్లు ఆగడంలేదు. అంతమంది జనాల మధ్యలో ఉన్నాడుగా అందుకే ఉక్కపోత. చెట్టు కింద గుంపు మళ్లీ సమావేశమైంది. కోటిగాడు ఓ ప్రణాళికే తెచ్చాడు. ఆ తడవ నుంచి మాలో ఒక్కొక్కడు రంగుల రాట్నం దగ్గరకెళ్లాలి. కోటిగాడు చేయెత్తగానే కౌంటర్లో వాడి పేరు చెప్పి లోనికెళ్లాలి. ఇలా మూడు తడవలైపోయాయి. ఇంకో రెండు తడవల్లో మా బ్యాచ్ తిరునాళ్లను గింగిరాలు తిప్పుతూ చూసేది ముగిసిపోయేది. అంతకు ముందు మూడు తడవల్లో మా వాళ్ల కేరింతలు చెట్టు వరకూ వినిపించాయి. ఒకడు కళ్లు మూసుకుని ఏడుస్తూ బల్లిలా అతుక్కుపోయిందానికి చెట్టు కొమ్మలు విరిచేస్తూ బ్యాచ్ నవ్వేస్కుంది. ఆ చెట్టు వరకూ గట్టిగా నడిచి వచ్చి వాంతి చేసుకున్న ఎకసెక్కాలోడి తడవా అయిపోయింది. ఇక మిగిలింది మరో ఇద్దరం. కోటిగాడితో తిరిగేందుకు మాలో ఎవడు ఆగాలో ఒకటే ఆలోచనైపోయింది. అది మాట్లాడుకుంటూనే... నువ్వెళ్లు నువ్వెళ్లు అనుకుంటూ ఇద్దరం కౌంటర్లో కోటిగాడి పేరు చెప్పాం. 'ఏరు పక్కకెళ్లండంటూ..' కౌంటర్లోని వ్యక్తి కసిరేశాడు. ఇది ఇద్దరమూ వాదులాడుకుంటూ కౌంటర్లో తల పెట్టి గట్టిగా మేం అరిచినందుకా..! అర్థం కాలేదు. గేటు దగ్గరే నిలబడిపోయి కోటిగాణ్ని పిలుస్తున్నాం. ఎత్తిన పదుల చేతుల్లోంచి మా చేతుల్ని వాడు గుర్తు పట్టి 'రండ్రా..!' అంటూ సైగ చేశాడు. మేం లోనికెళ్లబోతే కౌంటర్లో మనిషి బయటకొచ్చి కోటిగాణ్ని ఏదో తిట్టాడు. వాడు కాసేపాగండంటూ చేతులూపి ఆ తడవ జనాల్ని పెట్టెల్లో సర్దేశాడు. రంగుల రాట్నం గిరగిరా తిరుగుతుంటే.. చొక్కా చేతుల్ని భుజాలకు మడుస్తూ కౌంటర్ దగ్గరకు వచ్చాడు. వాళ్లిద్దరూ ఏదో అరుచుకున్నారు. నేలకు తలేసి మా దగ్గరకొచ్చి 'అరేరు రేపు ఎక్కించమంటారా..' అని అనునయంగా అడిగాడు. మిగతా బ్యాచ్.. రంగుల రాట్నం మీది నుంచి చూస్తే తిరునాళ్లు ఎలా ఉన్నాయో ఇంకా చెప్పుకుంటూనే ఉన్నారు. ఎదురుగా కోలాహలం గింగిరాలు తిరుగుతోంది. మళ్లీ రేపంటే కష్టమేనన్నట్టు ముఖాలు పెట్టేసరికి కోటిగాడు మళ్లీ కౌంటర్ దగ్గరకెళ్లాడు. వాడెక్కడ మమ్మల్ని మరిచిపోతాడేమోనని భుజం మీద చేయి గట్టిగా వేసి కూడా నడిచెళ్లాం. 'సరే..! సారుకు నే చెప్తా. నాకు ఇక నుంచి బేటా వద్దు. ఈళ్లిద్దరినీ ఎక్కించేయండి.' అన్నాడు. అప్పట్లో ఆ బేటా ఏంటో అర్థం కాలేదు. వెనకే నడిపించుకుంటూ తీసుకెళ్లి మొదటి పెట్టెలోనే ఎక్కించాడు. దాన్లోకి కాలు పెడుతుంటే అది అటూ ఇటూ కదిలింది. భయపడుతున్నామనుకుని మా చేతుల్ని వత్తి జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. పెట్టె నిండి పైకెళతుంటే.. వాడో రకంగా చూశాడు. జెయింట్ వీల్ అంత పెద్దదిగా.. సాంతం పైనుంచి చూస్తుంటే కనిపించిన ఊరంత పెద్దదిగా ఏదో ఆనందం వాడి కళ్లలో కనిపించింది. ఆ రాత్రికి వాడికి థ్యాంక్స్ చెప్పేందుకు, ఓనరుకి వాడికంత క్లోజెందుకు అనే సందేహం తీర్చుకోవడానికి, వాడు కౌంటర్లో మాట్లాడిన ఆ మాట అర్థం ఏంటో తెలుసుకునేందుకు బ్యాచ్ బ్యాచంతా చెరువు గట్టు కాడ ఎదురుచూస్తున్నాం. ఈసారి సైకిల్ సైడు తొక్కుడు గాడి కంటే ముందుగా ఎకసెక్కాలోడే 'ఆడు వస్తున్నాడ్రా' అని అరిచాడు. అంతకు ముందు డౌట్లన్నీ వదిలేసి.. ఎవడు హీరోలా భయపడకుండా రంగులరాట్నంలో కూర్చున్నాడో, ఎవడు కళ్లు గట్టిగా మూసుకుని 'అమ్మా' అని మొత్తుకుందో వీరావేశంతో కోటిగాడికి చెప్పుకొస్తున్నారు. వాడదంతా విని మా బ్యాచ్ ఆనందంలో కలసిపోయాడు. అందరూ చెప్పిందంతా విని 'అంత బాగుంటదిరా అది..? నాకు తెలీదు.' అంటూ ఏదో రకంగా చూశాడు. అంతకుముందు మా పెట్టె పైకెళుతుంటే మమ్మల్నే గమనిస్తూ చూస్తున్నట్టుగా.
- అజై
95023 95077
రంగుల రాట్నం
