ఊరి వాసనల్ని పోగేసుకొచ్చే సాయంత్రగాలులు పిలుస్తాయి. పొలిమేరలో మూగిన ముళ్ల చెట్లు పిలుస్తాయి. బీడు భూమిలో కుప్పకూలి రూపం కోల్పోయిన పొలం గట్లు పిలుస్తాయి. నేస్తాలతో ఆటలాడిన బండలు పిలుస్తాయి. తోటోళ్లతో పనులకెళ్లొచ్చి కబుర్లు చెప్పుకున్న వసారా రాళ్లు పిలుస్తాయి. రెండు చేతులూ చాచిన ఇంటి తలుపులు, వీధి వైపే ఎదురుచూసే కిటికీలు పిలుస్తాయి. మాటరాని వీటి పిలుపులే సొంతూరి మనాదిని, హోమ్ సిక్‌నెస్‌ని వలస పక్షులకు జబ్బు చేయిస్తుంటే ఏ మాత్ర వేయాలి మనూరు పనికొచ్చిన పరాయోడికి.
మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. ఇందాకేగా నీళ్ల బాటిల్ ఇచ్చింది. ఓ చిన్న బిందె బయటపెడితే సరిపోను. కానీ, ఇది ఎండాకాలం. వేడి నీళ్లను ఎలా తాగుతారు. గుక్కెడు చల్లని నీళ్లు వాళ్ల గొంతు తడిపితే.. ఇంటి చిన్నోడు పరితపించే కూల్‌డ్రింక్స్ కన్నా ఎక్కువే. అందుకే రోజుకు ఓ పదిసార్లయినా కాలింగ్ బెల్ మోగిస్తుంటారు. కాదు, ఒక్కడే తడవ తడవకు అంత సున్నితంగా పిలుస్తుంటాడు. బెల్ లేకపోతే తలుపు తట్టే సాహసమే చేసేవాడు కాదేమో..! ఒక్కోసారి ఇంట్లోవాళ్లకు చిరాగ్గా తోచినా అంత ఎండన పడి రాళ్ల పని చేస్తున్నారనే సానుభూతి. వాళ్లు చేసే పనిని ఓ పది నిమిషాలు మెట్ల మీద నిల్చుని చూసినా ఎండ దెబ్బ కొట్టేట్టు అనిపించింది ఇంటివారికి. నీడ పట్టున చల్లని గాలి సపర్యలతో ఉంటున్న తమకు రోజుకో పదిసార్లు నీళ్లందించడం పెద్ద పనిగా పట్టించుకోలేదు. అన్నిసార్లు ఒక్కరే ఇవ్వాల్సిన పనీ లేదు. సెలవుల కాలం కూడా కావడంతో చిందులేసుకుంటూ చెంగు చెంగున తిరిగే కుర్ర పిక్కలు ఓ రెండు జతలున్నాయింట్లో. సాయంత్రాలు స్నేహితులతో మైదానాలకు వలసపోయే ఆ కుర్ర పాదాలు ఎంత ఆ మైదానపు మెత్తటి మట్టిని అరగదీస్తుంటాయో..! అయినా, ఇంట్లో కుర్రాళ్లకు కష్టం గురించి ఓ పరిచయం అవసరమని పెద్దలు ఆ నీళ్లబాటిళ్ల సరఫరా ఏర్పాటు చేశారనుకుంటా..!
ఎన్ని రోజుల పనో..? ఏ ఊరోళ్లో..? ఏదీ తెలీకుండానే నాలుగు రోజులు గడిచిపోయాయి. ఎన్ని రోజులనేది కాంట్రాక్టర్ ఇష్టం. ఏ ఊరనేది కూలోళ్ల కష్టం. ఇంటి పక్కనే పనిచేస్తున్నా ఈ ఇష్టాలు, కష్టాలు అడిగి తెలుసుకునేంత దగ్గరలోనైతే సమాజం లేదు. ఇలాంటి మాటామంచికి చాలా దూరం జరిగి వలసపోయి చాలాచాలా ఏళ్లే అవుతోంది. అందుకే ఆ కాలింగ్ బెల్ అరుపుకి, ఆ పరాయోడి పిలుపుకి స్పందించడం అసాధారణమైపోయింది. ప్రతిసారి పర్లేదులే అనుకుని ఆ ఇంటోళ్లు తలుపులు తెరవడం అదో గొప్ప సేవ అయిపోయింది. అందరి పక్షాన ఒక్కడే కాలింగ్ బెల్ కొట్టడం అలవాటు చేసుకున్నాడు. మిగతా వాళ్లకు అంత సాహసం, అవకాశం, ఆలోచన లేవు. తెరుచుకునే తలుపు వార అతడి చూపులు నేలకు దిగిపోతుంటాయి. తలుపులు తెరిచి తెరవగానే ప్రత్యక్షమయ్యే ఓ చిన్నోడి ముఖాన్ని దూరం నుంచే ముద్దు పెట్టుకుంటుంటాడు. ఆ బుడ్డోడు పెద్దోళ్ల జాగ్రత్తలతో సంబంధం లేకుండా బలవంతంగా బాటిల్‌ని రెండు చేతుల్తో గట్టిగా పట్టుకుని పడబోతున్నట్టు బయటకు అడుగేస్తుంటాడు. పడబోకుండా ఆపుతున్నోడిలా ఆ కూలి మృదువుగా పట్టుకుని బాటిల్ అందుకుంటాడు. నెత్తిని మెత్తగా తడిమి నవ్వుకుంటాడు. ఇదిలా జరిగి అప్పటికే ఓ ముప్పై తడవలయ్యింది. ప్రతిసారి ఆ కూలీ కళ్లలో చూపులు ఎటో వెళ్లిపోతుంటాయి. అవి చాలా వెనక్కే పోతుంటాయి. పిల్లల గురించి అనేక జాగ్రత్తల్లో ఒకటైన పరిచయంలేని వాళ్లకు దూరం జరిపే అవస్థ నిశ్శబ్దంగా కళ్లెదుట కనిపిస్తున్నా ఆ కూలీ పెద్దగా పట్టించుకోడు. అది తనకు అవమానంగా తీసుకోడు. కానీ, ఎందుకో కళ్ళకు నీటి తెర అడ్డుపడుతుంది. బహుశా ఈ బుడ్డోడు ఒక్కడేనేమో మనసులో ఏదీ పెట్టుకోకుండా ముఖం చూసి నవ్వగలిగేది. ఓ ముప్పై సార్లకే సొంత మనిషిగా చూసేది.
మరో రోజుకి నీళ్ల బాటిళ్లందుకునేపుడు 'మంచిదమ్మా, మంచిదయ్యా' మాటలకు బదులు కొత్త అలవాటు మోసుకొచ్చాడతడు. తొలి కాలింగ్ బెల్ పలకరింపునకు రెండు తీపి బిళ్లలు బదులిచ్చాడు. ఆ నీళ్ల బాటిల్‌ని అందుకునేప్పటి కన్నా ఆ చాక్లెట్లు ఇచ్చేపుడు అతడి చేతులు చాలా నిదానంగా కదిలాయి. బుడ్డోడి అరచేతుల్ని సాఫీగా చాచి తన కరకుచేతులు పువ్వులా ముద్దెట్టుకున్నట్టే తడిమి చాక్లెట్లను పెట్టి గుప్పిటని సుతారంగా మూశాడు. అలా చేయడంలో అతడేదో పోగొట్టుకున్నది తిరిగి తెచ్చుకునే ప్రయత్నం కనిపిస్తోంది. బుడ్డోడి కేరింతలకు తుళ్లిపడ్డట్టే ఆ ప్రయత్నంలోంచి బయటకొచ్చి మళ్లీ ఎప్పటిలానే ఆ చిరు నెత్తిని తడిమి ఆ కూలీ పనికి మళ్లాడు. ఐదారు రోజుల తర్వాతకు గానీ, వాళ్లందరిదీ ఒకే ఊరని, ఒకే ప్రాంతమని అంతకన్నా వింతగా ఒకే వీధి అని తెలిసి ఆశ్చర్యమేసింది ఇంట్లోవాళ్లకు. నీళ్లబాటిళ్లే కాక అనేక ఊరి విషయాల్ని, సంగతుల్ని మార్చుకుంటున్న ఆ ఇంటికి తెలీని అభిమానమేదో పెరిగింది. అంతకుముందు దూరంగా సగం నీడను కూడా ఇవ్వలేని చెట్టు దగ్గర కూర్చుని భోజనాలు చేసేవాళ్లకు ఇంటి వరండాలో విశ్రాంతిగా తినే అవకాశం దొరికింది. అప్పుడప్పుడూ మజ్జిగ అందుతోంది. అడపాదడపా ఓ కాయో పండో గుమ్మం దాటుతోంది. ఇంట్లోని బుడ్డోడు వాళ్లుండగా బయట ఆడుకోవడంలో పెద్ద ప్రమాదమేమి కనిపించలేదు. అందరూ ఆడిస్తున్నా అతడు మాత్రం చేతులు, తలను నిమరడం దగ్గరే ఆగిపోయాడు. కొన్నిసార్లు ఎత్తుకునే ప్రయత్నం చేసినా మట్టెక్కడ అంటుకుంటుందోనని తన శరీరాన్ని తానే మౌనంగా తిట్టుకున్నాడు. ఎండకు తట్టుకోలేక చెమట్లు కక్కుతున్నందుకో..! మట్టిని అంటించుకోని గుణం లేనందుకో..! కానీ, బుడ్డోడికి అమ్మ రోజూ రాసే పౌడర్ ఎలాగో ఆ కూలీ ఒంటికి పట్టిన మట్టి అలానే. అందుకే వాడు ఈ మధ్య మట్టిలో ఆడటం ఎక్కువైపోయింది. ఆ మట్టి పని చేసేందుకు వచ్చిన ఆ కూలీతో చనువు పెరిగిపోయింది. కిందున్న మట్టిని ఆ చిట్టి చేతుల్లోకి తీసుకుని ఇంకొంత అద్దాడు ఆ కూలి ముఖానికి. ఆ తర్వాత తన చిన్ని బొజ్జకు రాసుకుంటూ పొట్టను మరింత ముందుకు ఎగదోస్తున్నాడు. కూలీ కోపం ఎగిరిపోయింది. ఆ చిన్నారి తడిమేందుకు అనుకూలమైన ఆ మట్టి శరీరం మీద అంతలోనే ప్రేమ కలిగింది. తాను తన చెంపల్ని, భుజాల్ని, ఛాతీని తడుముకున్నాడు. అతణ్ని చూసి బుడ్డోడు చెంపల్ని రుద్దుకున్నాడు. ఇంతలో వాళ్లమ్మ కేకేస్తే ఇంట్లోకి వెళ్లిపోయాడు.
పనై పోయింది. ఆఖరి నీళ్ల బాటిల్ కోసం కాలింగ్ బెల్ చప్పుడు చేశాడు. ఇన్నాళ్లు అతడు కొట్టే బెల్ చప్పుడులో ఓ రకం అలవాటుండేది. ఈ రోజు అలా కాదు. త్వరగా తలుపులు తెరుచుకోవాలనే తాపత్రయం వినిపిస్తోంది. తలుపులు తెరుచుకున్నాయి. నీళ్ల బాటిల్ అందుకున్నాడు కానీ, చేతులే కాస్త కంపించాయి. బుడ్డోడు తలుపు దగ్గర ప్రత్యక్షమవ్వలేదు. వాడి అలికిడి హాల్లో లేదు. వాడి కేరింతలు ఓ మూల నుంచి గుసగులాడటం లేదు. ఆ బాటిల్ అనేక చేతులు మారి, గొంతుల్ని తడిపి తిరిగి ఆ కూలీ వద్దకు వచ్చింది. ఈలోగా ఓ వందసార్లు అతడి చూపులు హాలంతా తనిఖీలు చేశాయి. మరో బాటిల్ అంటూ సంజ్ఞ చేస్తూ తల నేలబారు వేశాడు. ఆ బృందమంతా సామాన్లు సర్దుతూ, వరండా ఖాళీ చేస్తూ 'అమ్మా వెళ్లొస్తాం.. మళ్లీ ఎప్పుడు కలుస్తామో..!' అని ఏవేవో వీడ్కోలు మాటలు చెప్పారు. 'ఈసారెక్కడ పని, వీలుంటే ఇటొచ్చినప్పుడు ఇంటికి రండి..' అని ఇంట్లోవాళ్ల బదుళ్లు.. హడావిడి పెరిగింది. ఆ కూలీ మాత్రం తలుపు దగ్గరే నిలబడిపోయాడు. అతడు గుప్పిట మరింత బిగుసుకుంది. నీళ్ల బాటిలంతా ఎత్తేసి తిరిగిచ్చేస్తూ 'అమ్మా..! చంటోడికివ్వండి' అంటూ ఆ రెండు తీపి బిళ్లల్ని ఆ ఇంటి పెద్దావిడకు ఇచ్చాడు. ఇస్తున్నప్పుడు వాటినో రకంగా తేరిపారా చూసుకుంటూ ఇచ్చాడు. వెనక్కు తిరిగి బయటకు అడుగేసి గేటు వేస్తూ ఓ పాలి హాల్లోకి చూశాడు. బుడ్డోడితో అతడికి పెనవేసుకున్న ఆ నాలుర్రోజుల బంధం ఆమెకు తట్టింది. కూలీని పిలిచింది. 'వాడు పడుకున్నాడయ్యా..! ఈ రోజెందుకో కాస్త మెత్తగా అయిపోయాడు. సాయంత్రం పాలు తాగించగానే నిద్రపోయాడు. అందుకే ఈ రోజంతా బయటకు రాలేదు.' అంటూ బుడ్డోడి మాట చెప్పింది. కూలీకేదో జ్వరం పట్టుకున్నట్టు అయిపోయాడు. 'అయ్యో సుస్తీ చేసిందా..!' అని ఏదో కంగారుగా మాట్లాడాడు. అతడి ఆరాటం అర్థం చేసుకున్న పెద్దావిడ 'అయ్యో పెద్ద జ్వరమేం కాదు. ఎండ ఎక్కువవుతోందిగా. కాస్త త్వరగా అలసిపోయాడంతే.' అంటూ ఏదో ఆలోచించింది. పనికొచ్చిన బృందమంతా అప్పుడే పదడుగులు ముందుకు వెళ్లిపోయి ఆ కూలీ కోసం నిలిచిపోయారు. వాళ్లల్లో ఓ ముసలాయన త్వరగా రావాలంటూ పిలుస్తున్నాడు. 'అమ్మా.. ఓసారి' అంటూ ఏదో అడగబోయి మళ్లీ ఆగిపోయి జాగ్రత్తగా చూసుకోమంటూ చెప్పి కదలబోయాడే గానీ, కూలి అడుగేయలేకున్నాడు. ఇతగాడి అవస్థ ఆ ముసలాయనకు బాగా తెలిసినట్టుంది. మరో నలుగురితో ఆ కూలీ దగ్గరకు వచ్చి 'ఎహె నడువ్. ఆ ఇంటోరిని ఇబ్బంది పెడతావేంది' అంటూ ఏదో అంటున్నాడు. వాళ్ల మాటల్లో అర్థమైంది. ఆ కూలీకి ఈ బుడ్డోడు వయస్సున్న కొడుకున్నాడని. వాణ్ని ఇంటి దగ్గరే వదిలి పనికి వలసొచ్చి చాలా నెలలే అయ్యిందని. అన్ని రోజులు అనేక చోట్ల పనిచేశాడే కానీ, ఓ జీవచ్ఛవంలా, ఓ మర యంత్రంలానే మెలిగేవాడట. ఈ పని దగ్గర మాత్రం కొంచెం ప్రాణమున్నోడిలా మారాడట. అక్కడ తన ఇంటి దగ్గర బిడ్డ యోగక్షేమాలు, ఇక్కడ ఈ ఇంటి బుడ్డోడితో కబుర్లను జతచేసి ఏవేవో కథలు ఆ బృందానికి వినిపించేవాడట. పనికి అందరి కన్నా ముందు బయలుదేరేవాడట. ముందు రోజు రాత్రే రెండు చాక్లెట్లు కొని చొక్కా జేబులో పెట్టుకుని భద్రంగా దానిపై చేయి వేసి పడుకునేవాడట. కాలింగ్ బెల్ కొట్టి నీళ్ల పేరిట బుడ్డోడిని చూసుకుని పనిని హుషారుగా మొదలుపెట్టేవాడట. వారిద్దరి ఆ నాలుర్రోజుల బంధం అంత బలంగా, లోతుగా అల్లుకుపోయిందా అని ఆ ఇంటి పెద్దావిడ నివ్వెరపోయింది. ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇంటికొచ్చి పిల్లాడితో ఆడుకోవచ్చని ఏదో మాటలో మాటగా చెప్పిందే గానీ, ఆ కూలీ మనస్సు మళ్లీ మర యంత్రం కాకూడదనే ఆపేక్ష అయితే బయలుదేరింది. 'ఉండు.. బుడ్డోడిని లేపుకొస్తాను.. టాటా చెప్పిస్తాను' అని లోపలికి వెళ్లబోయింది. 'వద్దులే అమ్మా..! ఆడి పాణం బాలేదు.' అంటూ నమస్కారం చెప్పుకుంటూ వెళ్లబోయాడు. ఈ మాటలన్ని వింటున్న ఇంట్లో వాళ్లంతా అప్పటికే ఓ చోట చేరారు. అటు పనికొచ్చిన వాళ్ల బృందం, ఇటు ఇంటి పరివారం. మధ్యలో గేటు వద్ద కూలీ. 'అయితే, నువ్వే లోపలికొచ్చి చూసిపో' అని ఇద్దరు ముగ్గురు కలసి అన్నారు. అతడినేదో శక్తి తాకినట్టు అయిపోయాడు. వేగం వేగంగా చెప్పులు జోడు నడిచొస్తూనే వదిలేస్తూ.. ఇళ్లంతా చూశాడు. ఇంట్లో ఎవరో అతణ్ని పిల్లాడు పడుకున్న బెడ్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. వాణ్ని అస్సలు కదపకుండా, దూరం నుంచే ఓ నిమిషం పాటు రెప్ప వేయకుండా చూసుకున్నాడు. దగ్గరకెళ్లి వాడి చిరు చేతుల్ని సాఫీగా తడిమి గుప్పిట ముడిచాడు. అంతకుముందు లేని సాహసం ఆ రోజు చేశాడు. తన మట్టి పెదాల్తోటి ఆ నుదుటిని ముద్దాడి ఏం మాట్లాడకుండానే వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఈసారి గుంపు కన్నా ముందు తానే నడుస్తున్నాడు. ఈ బుడ్డోడి సంగతుల్ని, తన బిడ్డ జ్ఞాపకాల్ని అలా ముందుకు నడిచే విదిలించుకునే ప్రయత్నం చేశాడు. అచ్చు ఇలాగే తన వలస బతుకు ప్రయాణం మొదలై ఉంటుంది. తన చిన్నారి నిద్రించేంత వరకు ఎదురుచూసి ఏ పిలుపూ తన అడుగుని వెనక్కు లాగకుండా జాగ్రత్త పడి ఉంటాడు. నిద్రిస్తున్న తన బిడ్డ అర చేతులు సాఫీగా చేసి.. గుప్పిట ముడిచి.. నుదుటిని ముద్దాడి సొంతూరు దాటుంటాడీ (కరకు) మనిషి.
- అజై
95023 95077
పిలుపు
