కొందరికి ప్రేమ నచ్చదు. ఓ వైఫల్యమో, ఓ విపరీతమో దాన్ని మలినంగా చూపిస్తుంది. కొందరికి ప్రేమని మించింది ఏది ఉండదు. ఓ విజయమో, ఓ సహానుభూతో దాన్ని మేలిమి చేస్తుంది. ఇవి రెండూ భిన్న ధృవాల్లో ఉద్దేశాలు, అభిప్రాయాలు, నిర్వచనాలు, అనుభవాలు. కానీ, ఇప్పటి ప్రేమల వైవిధ్యం చాలా ఎక్కువ. రెండు వైపుల్లో ఎటో తేల్చుకోలేనంత అయోమయం ఇప్పటి బంధాల్లో కనిపిస్తోంది. ప్రేమ పేరిట ఎన్నో ప్రయోగాలు, పోకడలు ఓ పక్కా అర్థాన్ని ఆ ప్రేమలకు, బంధాలకు ఇవ్వలేని పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ప్రేమను ధైర్యంగా ఓపెన్ చేసేస్తున్నారు, 'ఇన్ రిలేషన్' స్టేటస్‌లతో చాలా అడ్వాన్స్డ్ అయిపోతున్నారు. కానీ, ఏదో వెలితి, ఏదో అసంపూర్ణత, ఏదో సమస్యతో.. ప్రేమ అనే పదం వాడుతున్నా సరే, అవి తాత్కాలిక బంధాలవుతున్నాయి. టైంపాస్ చేసేస్తున్నాయి. అనేక బంధాల్లో ఎంపికలుంటున్నాయి, అనేక చాయిస్‌ల్లో జీవితాలు నలిగిపోతున్నాయి. వీటన్నింటినీ ప్రేమ అంటే కుదురుతుందా..? మరి ఏది ఆ ప్రేమ ప్రేమా..!
అరె.. ప్రేమకెన్ని డెఫినిషన్లు. ఏది ఫాలో అవ్వాలో అస్సలు అర్థం కాదు. ఇప్పుడు ప్రేమ చాలా ఓపెన్ అయిపోయింది, బాగా సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నారు. అనేక అర్థాలు తీస్తున్నారు. మరెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. దాదాపు చాలా ప్రేమలు ఇప్పుడు అందరికీ తెలిసిపోతున్నాయి. వారి కథలు సుఖాంతమా.. కాదా అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేమ తర్వాత మెట్టూ ఎక్కేసి భాగస్వాములుగా ఎంతవరకూ రాణిస్తున్నారో వాళ్లింటి కిటికీల్లోంచి చూసినట్టే వారే విడమరిచి పంచేసుకుంటున్నారు. అప్పుడే లవ్ అనే మాటకు వైబ్రేషన్ తెలిసొచ్చిన అడాల్సెన్స్ నుంచి ప్రేమని శ్లాఘనీయం చేస్తూ జీవితాల్ని అంకితమిచ్చే ఆరాధకుల వరకూ అందరిదీ తలో మాట. తలో ప్రబంధం. సినిమాలు, సోషల్ మీడియా, పుస్తకాలు, గుసగుసలూ అన్నీ ప్రేమకు అర్థాన్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాయి. మనకెటూ సరిగ్గా తెలీదు అని ఏదో ఒకటి ఫాలో అయిపోవడమూ చూస్తున్నాం. ఇలాంటి అసందిగ్ధంలో పడే తమకు నప్పని బంధాల్లోకి, ప్రయోగాల్లోకి వెళ్లి జీవితాల్నే కోల్పోతున్న కథలు వింటున్నాం. ప్రేమంటే ఇదీ అని డెఫినిషన్ ఇవ్వడంలో క్లారిటీ దొరక్కపోవచ్చు గానీ, ఆ బంధాన్ని ఎలా తీసుకోవాలనే విషయంలో మాత్రం స్పష్టత ఉండాలి. ప్రేమలో పడేపుడు, ప్రేమను ప్రకటించేపుడు గుర్తుకు రాని చాలా విషయాలు ఆ తర్వాత కలసి చేసే ప్రయాణంలో అడ్డు పడుతూనే ఉంటాయి. అలా అర్ధాంతరంగా అసంపూర్ణంగా ఒక్కటనుకున్న జీవితాలు ముగిసిపోతాయి. అవును, ఇద్దరివీ రెండు జీవితాలే. ఎవరి లక్ష్యాలు, ఎవరి ఆకాంక్షలు, ఎవరి ఆలోచనలు వాళ్లవే. కానీ, ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఓ ఉమ్మడి ప్రణాళికతో, ఆలోచనతో, లక్ష్యంతో కలసి అడుగేస్తే చాలావరకూ ప్రేమలకు సమస్యలు ఎదురవ్వవు. ఇన్ని బ్రేకప్‌లు కనిపించవు. ముఖ్యంగా ఇప్పటి నవీన ప్రేమల్లో చాలా వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. మన కోసమే పుట్టిన వ్యక్తి దక్కేంత వరకూ అంటూ వారి ప్రయోగాలు పదుల బంధాల్ని ప్రయత్నించి దారుణంగా విఫలమవుతున్నాయి. అసలు ఒక బంధమే బలపడి మరోదానికి అవకాశం ఇవ్వకుండా ఇద్దరూ కలసి దక్కించుకునే ఆలోచనే ఈ రోజుల్లో కష్టమైపోతోంది.
ఫేజ్‌లు జీవితంలోనే.. లవ్‌లో కాదు
ఇదివరకు ప్రేమ అనేది ఓ జీవితం తర్వాత కూడా గొప్పగా చెప్పుకునే బంధం. ఇప్పుడు మారుతున్న పోకడల వల్ల అదో ఫేజ్ అనేస్తున్నారు. అది ఫేజ్ అవ్వడానికి కూడా ఓ రకంగా ఇప్పుడున్న వేగవంతమైన బంధాలే. ఎదుటి మనిషి గురించి వారి దృక్పథాల గురించి అస్సలు ఆలోచించకుండానే పూర్తిగా తెలుసుకోకుండానే.. చుట్టూ ఉన్న అందరికీ రిలేషన్ ఉంది తమకే లేదనే తొందరలో ఓ బంధంలోకి దూకేస్తున్నారు. ఆ తర్వాత అది బంధనంలా మారిపోతోంది. బయట పడితే ఓ కష్టం, కొనసాగితే మరో కష్టం. ఇష్టంలేని పెళ్లిళ్లకు ఈ తరహా బంధాలకు అంత తేడాలేం ఉండవు. పెళ్లి అయితే విడాకులు అవుతాయి. కాస్తో కూస్తో సమాజంలోను, కుటుంబాల్లోను సానుభూతి అన్నా కనిపిస్తుంది. కానీ, ప్రేమలో విఫలమైతే అదీ కొన్నాళ్ల కొనసాగింపు తర్వాతైతే ఈ సానుభూతి కన్నా చులకన ఎక్కువ ఎదురవుతుంది. డిప్రెషన్ అనేది ఇప్పటి యువతని ఎక్కువగా వేధించడానికి కారణం ఈ తరహా బంధాలే. అన్నింటికన్నా ఎక్కువనుకున్న ప్రేమ విషయంలోనే దెబ్బతగలడం వారిని వెంటాడే సమస్య అవుతోంది. ఓ దీర్ఘకాలిక రుగ్మతగా మారి తర్వాతి బంధాల్ని నేలకూలుస్తోంది. అందుకే అడ్వాన్స్‌గా ఉండటం వరకూ ఓకే గానీ, అది ఏయే విషయాలకు పరిమితమవ్వాలనే విషయంలో మాత్రం పక్కా క్లారిటీతోనే ఉండాలి. సింగిల్ స్టేటస్ పెద్ద నామోషీగానే అనిపించొచ్చు కానీ, బంధంలో ఉన్నా ఒంటరితనాన్నే మిగిల్చే బంధాల్లోకి చిక్కుకుపోవడం అంత సరైంది కాదు.
అందమైన మనస్సు స్టేటసైతే..
స్టేటస్ అంటే మరో విషయం గుర్తొస్తుంది. ఇప్పుడు అందంగా కనిపించడానికి ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అలా ఉండటానికి అందొస్తున్న అవకాశాలు అన్నీ ఇన్నీ కావు. ఇది ఓ రకంగా అందమే ఒకరి స్టేటస్‌ని ఫైనల్ చేసే అంశంగా మారిపోతోంది. అందమైన మనస్సు, అందమైన ఆలోచనలు, గొప్పవైన లక్ష్యాలు, హుందా నడవడికలు ఇవేవీ ఇప్పుడు ప్రేమ దరఖాస్తుల్ని అంతగా ప్రభావితం చేయడంలేదు. వాటి వెయిట్ పెంచడంలేదు. ఎక్కువగా కనిపిస్తోంది పైపైకి ప్రదర్శితమయ్యే ట్రెండ్లు, ఫ్యాషన్లు, లుక్సే. అందుకే ఇప్పుడు ప్రేమ అనే విలువైన బంధం కూడా ఫ్యాషనైపోయింది. ఒకడు జీవితంలో ఓ పదిమందిని ప్రేమించానని చెప్పుకోవడం గుర్తింపు అయిపోతోంది. ఈ మధ్యే బ్రేకప్ పార్టీ ఇచ్చానని చీర్స్ కొట్టడం అలవాటు అవుతోంది. ఈ బంధం కాలేజీ రోజుల వరకే, జాబ్ లొకేషన్ వరకే అని చెప్పుకోవడంలో అంత వెనుకాడటం లేదు. పెళ్లి అనివార్యమని ఆలోచిస్తూ దాన్ని దిగమింగలేకపోతున్నారు. ఇప్పుడు ప్రపంచం మరుగుజ్జుదైపోయింది కానీ, బంధాలు నిలబడేంత దగ్గరిది కాలేకపోతోంది. భారీ లక్ష్యాలు, కెరీర్ ఉత్థానపతనాలు, రకరకాల సంబంధాల అభిరుచులు ఇవన్నీ కూడా ప్రేమ నిలబడేందుకు, బలపడేందుకు అవరోధాలవుతున్నాయి. ఒకప్పుడు బలవంతపు పెళ్లిళ్లొద్దని తిరుగుబాటు చేసిన ప్రేమ విప్లవాలే ఇప్పుడు ఇష్టపడిన జీవితాలకి కష్టంగా కనబడుతున్నాయి. తాళి కడితేనే పెళ్లా, రింగ్ తొడిగినంత మాత్రాన ఎంగేజ్ అయినట్టా అని ప్రశ్నించిన యువతే.. కలిసి తిరిగినంత మాత్రాన ప్రేమించినట్టా, లివిన్లోకి వెళ్లినంత మాత్రాన శాశ్వత బంధమనుకుంటామా అనే కొత్త కాన్సెప్ట్‌ల్ని తెస్తున్నారు. పరిస్థితులకు, రోజులకు తగ్గట్టు అప్డేట్ అవుతున్నామనే భ్రమల్లో వీళ్లంతా మరిచిపోతోన్న విషయమొకటుంది. ఎప్పుడో శతాబ్దాల క్రితం నాటి వేలంటైన్స్ కథని ప్రేమకు అంకితం చేసుకుని దానికంటూ ఓ రోజు పెట్టుకుని ప్రేమోత్సవాలు చేసుకుంటున్నారు. వందల ఏళ్లనాటికీ, ఇప్పటికీ చాలా మార్పులొచ్చేసిన లెక్కయితే దానికెందుకు అంత గుర్తింపునివ్వడం. అంటే రివాజులు మారి ఉండొచ్చు కానీ, ప్రేమ మారలేదు. ఒకరి కోసం ఒకరు అనే ఉమ్మడి బంధంలోని సారం మారలేదు. జస్ట్.. మనం సరిగ్గా దాన్ని అర్థం చేసుకోవడం లేదంతే, మన జీవితాలకు తగినట్టు అన్వ యించుకోవడం లేదంతే.
స్వచ్ఛమంటే..?
స్వచ్ఛమైన ప్రేమ అనే మాట ఇప్పుడు ఎక్కువగా విని పిస్తోంది. అంటే.. అస్వచ్ఛమైన ప్రేమలు కూడా ఉంటాయా అనే అనుమానం కలుగుతుంది. జంటలో ఒక్కరిది మాత్రమే స్వచ్ఛ మవడం వల్ల పుట్టకొస్తోన్న పదాలివి. అవును 'నిరీక్షణ' ప్రేమకు 'తీన్మార్' ఇప్పుడు 'నాన్న నేనూ నా బారుఫ్రెండ్స్' ప్రేమలకి చాలా తేడాలు ఉండొచ్చు. కాలగమన ప్రభావం వల్లో మారుతున్న ఆలోచనలు, తీరుల వల్లో ప్రేమకు నిర్వచనాలు మారిపోవచ్చు. 'ఆరెంజ్'లోలా ఉన్నంతసేపూ అంకితమవ్వొచ్చు. 'రాజారాణి'లా తర్వాత కూడా ప్రేమలు నిలుపు కోవచ్చు. అన్నీ సాధ్యమే. కానీ, వీటన్నింటిలో మారనిది ఒకటుంది.. అదే ప్రేమ. దాని గొప్పదనం. ఓ ప్రేమ కథకు విలన్లు కులం, మతం, ప్రాంతం, జాతి, స్థాయి, హోదాలే ఎక్కువ. వాటిన్నంటినీ కాదనుకుని రెండు హృదయాలు చేరువవుతోంటే... అంత కన్నా గొప్పదనమేముంది. అందుకే ఆ ప్రేమకథలు బతకాలి. కొనసాగాలి. ప్రేమ అనేది ఓ మహావృక్షంలా ఎప్పటికీ నిలిచిపోవాలి. 'అలాంటి ప్రేమలు కథల్లోను, సినిమాల్లోను కనిపిస్తాయంతే..! అలాంటోళ్లు ఈ రోజుల్లో ఎక్కడుంటార'నేవాళ్ల మాట పాక్షికంగా మాత్రమే ఒప్పు అవుతుంది. ప్రేమను అలా వ్యక్తం చేసేవాళ్లు కరువవుతున్నారు గానీ, ప్రేమ ఎప్పుడూ కావ్యమే. అది అమ్మాయి ఒప్పుకోలేదని యాసిడ్ దాడి చేసేవాళ్ల క్రూరత్వాలకో, డబ్బు లేదని వదిలేసి వెళ్లే అమ్మాయిల స్వార్థాలకో పేరు తగిలించబడటంతో వచ్చిన అపవాదు. ఒక అమ్మాయిని పదే పదే వెంటబడి వేధించి ఏదో బలవంతం మీద 'లవ్ యూ'లు చెప్పించుకునే భావజాలాల వల్ల పంకిలమవుతోంది. ఓ అబ్బాయి ప్రేమను ఆసరాగా చేసుకుని బాగుపడాలనుకునే 'బంగారం' అనే మాటల మనస్తత్వాల వల్ల మలినమవుతోంది.
లవ్ ఫెయిలవుతుందా..!
ఇది వరకు త్యాగం చేసేవాళ్లు అమర ప్రేమికులు, సర్వస్వం తానే అనుకునేవాళ్లు ఆరాధ్యులు. ఇప్పుడు వెర్రివాళ్లు, అమాయకులు. ఈ పిలుపుని భరించలేకే, ఒప్పుకోలేక అంత నిస్వార్థ ప్రేమల్లోకి వచ్చే సాహసం చేయడంలేదు చాలామంది. ఓ జంట కలిసి ఉండటానికి పెళ్లి ఒక్కటే కాదు.. డేటింగ్లు, సహజీవనాలు, స్ట్రింగ్స్ నాట్ అటాచ్డ్లు, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్లు వీటిని దాటి టైంపాస్ బంధాలు, వికృత పోకడలకు వంటి అనేక ప్రయోగాలు చేస్తూ ఏదీ పూర్తి కాలం, శాశ్వత బంధంగా నిలబడలేదని మరో బంధంలోకి వెళ్లేవారిదో సమస్య. ఆ బంధాల్లో మైనస్ అవుతోన్న ప్రేమని వాళ్లు గమనించడం లేదంతే. ప్రేమ ఉండి ఉంటే మరో చాన్స్, మరో ఎక్సెపెరిమెంట్కి తావివ్వదు. అజరామరం అనే ప్రేమ ఓ శాశ్వత బంధానికి పునాది వేస్తుంది. ఇద్దరిదీ ఒకే జీవితంగా ఉమ్మడి నడత అయితే, లవ్ ఫెయిల్ అవ్వదు. అయినా, అలా కలిసుంటేనే ప్రేమా? అనే వాదనలూ ఎలాగూ ఉన్నాయి. కలిసుండే అవకాశం లేకున్నా ఎదుటి వారి మంచిని కోరే ప్రేమ విడిపోయిందెప్పుడు. భౌతికంగా దగ్గరగా ఉంటే సరిపోతుందా.. మానసికంగా ఎక్కడో ఉన్నారనే ఆలోచన సరైంది కాదేమో..! చెరో దారిన వెళ్లిపోయాక కూడా వారి దగ్గరే ప్రేమ నిలిచిపోయిందో, వెళ్లిపోయిందో, చచ్చిపోయిందో అనుకోవడమూ మనకు మనం విధించుకునే పరిమితే. నీ ప్రేమ ఎంత గొప్పదో.. తన ప్రేమా అంతే గొప్పదైనప్పుడు అటు బంధం కలిసినప్పుడు నువ్వింకా అక్కడే ఆగిపోతాను, తనకీ పలుకుతాడు తగిలిస్తాను అన్నపుడు ప్రేమకు ఉరితాడు పడిపోతుంది. నీలానే నిన్ను ప్రేమిస్తూ మరో బంధం కలిసొచ్చాక వెనక్కు నడుస్తానంటే ప్రేమ తలకిందులవుతుంది... ఇవేవీ ఓ గొప్ప కవి రాసిన మాటలో, మరో సినిమాలోని డైలాగులో కాదు. ప్రేమ బంధాల్లోని ఔట్కమ్ని ఎలా తీసుకోవాలనే దాని మీద జరగాల్సిన అంతర్మథనం.
తప్పు ప్రేమది కాదు
ఇప్పటి ప్రేమలు ఎంత ధైర్యంగా బహిర్గతమవుతున్నాయో అంతే వల్నెరబుల్గా తయారవుతున్నాయి. చాలా చిన్నపాటి విషయాలు, మనస్పర్థలు, అనుమానాలు, ఇబ్బందులకే తల్లడిల్లిపోతున్నాయి. అంటే.. ఆ తప్పు ప్రేమది కాదు. ప్రేమికులదే. చిన్న విషయాలకే జీవిత బంధాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్న బలహీన మనస్తత్వాలదే. 'ఇలా ఎలా ప్రేమిస్తార్రా...' అనే ఈ ఒక్క మాటనే అటో గొప్ప ప్రేమ డైలాగ్గాను, ఇటో చీదరింపు బ్రేకప్ సాకుగాను మార్చేసేది ప్రేమిస్తున్నాం అనుకునేవారి పద్ధతిదే. కాలం ఎంత మారినా, పరిస్థితుల్లో ఎంత మార్పులొచ్చినా.. ప్రేమకథలకు సుఖాంతమయ్యే అవకాశాలు సామాజికంగా ఆశించినంత స్థాయిల్లో పెరగలేదు. అప్పుడు ప్రేమజంటలు బలంగా నిలబడగలిగేవి. తమ ప్రేమను సాధించగలగడమో, త్యాగం చేయగలగడమో, తర్వాతి జీవితానికి విలువనివ్వడమో కనిపించేది. ఇప్పుడు ప్రేమికులే బలహీనంగా కనిపిస్తున్నారు. సాధించే విషయం పక్కనబెడితే వాళ్లే అనేక ఆటంకాల్ని అనేక ప్రయోగాలతో సృష్టించుకుంటున్నారు. వ్యర్థమైన కాన్సెప్ట్‌లు చెప్పుకుంటూ లేని సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు బ్రేకప్‌లు కూడా మంచి వ్యాపారమైపోయాక కొందరికి అనుకోని లాభంగా కనిపిస్తుండగా ఒక జంట నిలిస్తే ఏముంది? భళ్లున బద్దలైపోతే ఏముంది? ఆ తర్వాత మరో ఆప్షన్ అంతా షరా మామూలే అనే నిలకడలేని భావజాలాన్ని తలకెక్కించే మాధ్యమాలు, వ్యాపార పోకడలు ఎక్కువవుతున్నాయి. తప్పక మరో బంధాన్ని కావలించుకునే, ఇదీ చూద్దామంటూ ఇంకో సంబంధానికి షేక్‌హ్యాండ్ ఇచ్చే కొత్త సంస్కృతి పెద్దదవుతోంది. వీటన్నింటినీ ప్రేమ అని ఓ గాటన కట్టేస్తే ఇదివరకు అనుకున్న ఆ గొప్ప బంధానికి మరో పదం పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. అన్నింటికీ లవ్ అనే మాటను జోడిస్తే.. ఇంకెన్నో అసంబద్ధ, అసందిగ్ధత బంధాలకు దారులు పడిపోతాయి. తాత్కాలిక బంధాలతో డస్సిపోయిన ఎన్నో వ్యథాభరిత కథలు ఓ ప్లాస్టిక్ నవ్వుతో మరో గట్టి బంధం కోసం మూలుగుతుంటాయి. కొత్త బంధాలు బ్రేకప్ అయినప్పుడల్లా ఒంటరితనం కాదు. ప్రతి బంధంలోనూ ఒంటరిగా మిగిలిపోయే జీవచ్ఛవాలు కదులుతుంటాయి.
ప్రేమ అనేది జీవితంలో ఓ ఫేజ్ కాదు. అలా అయ్యేది ప్రేమ కాదు. అది వివాహ బంధమైనా, జీవితాంతం కలిసుండిపోవాలనే మరో అనుబంధమైనా యదార్థ ప్రేమే పరిపూర్ణతనిస్తుంది. ప్రేమలో గెలుపోటములు, బ్రేకప్‌ల మాటే ఉండదు. ఎలా గెలిచాం, ఎలా ఓడిపోయాం, ఎందుకు విడిపోయాం.. అదే బ్రేకప్ అయ్యామనే దృష్టిలోనే, కారణాల్లోనే తేడా ఉంది. ప్రేమ అలానే ఉంటుంది. అంతే ఉంటుంది. హెచ్చుతగ్గులుండవు. ఒకరి బంధంలో స్వచ్ఛత, మరొకరి బంధంలో అపరిపక్వత కానరాదు. నిజంగా ప్రేమను ప్రేమలాగే ప్రేమిస్తే, ఆ బంధాల్ని అలానే భావిస్తే ప్రేమకు వైఫల్యం ఉండదు. అప్పుడు ప్రేమను ఒక్కరోజే సెలబ్రేట్ చేసుకోవడమో.. ఒక కథనే అంకితమిచ్చుకోవడమో ఉండదు. ప్రతి కథా విలువైనదే అవుతుంది. ప్రతి రోజూ ప్రేమోత్సవమే జరుగుతుంది. ముఖ్యంగా ప్రేమలో క్లారిటీ ఉంటే మిగతా బంధాల్లా ఒంటరితనం మిగిలిపోదు. ఒంటరిగా జీవితం నడిచిపోదు. ప్రేమా జిందాబాద్!
- అజరు కుమార్ వారాల