- హిందూ సముద్రంలో ముత్యం
శ్రీలంక. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో మరో శ్రీలంక కనిపిస్తుంది. తేయాకు తోటలతో, ప్యాలెస్‌లను పోలిన కట్టడాలతో బ్రిటీష్ కాలనీల వారసత్వానికి సింబాలిక్‌గా కనిపిస్తుంది. తేయాకు తోటల చుట్టుతా మెలికలు తిరుగుతూ సాగే దారుల్లో ప్రయా ణం చేయిస్తూ ఊయలలూపుతుంది. కొండ కోనల్లో దాగుడు మూత లాడే ఆ ప్రదేశాల్లో విహారం దక్షిణ లంకను పరిచయం చేస్తుంది.
ద క్షిణ శ్రీలంకకు చివరి తట్టు అయిన వెలిగామా సూర్యాస్తమయాన్ని కొత్తగా చూపిస్తుంది. కనుచూపు మేర సముద్రమంతా చిక్కటి నారింజ రంగులో కదలాడుతుంటే విశ్వం రంగు అదేనేమో అనిపిస్తుంది. ఇక్కడి టెర్రకోట శైలి పెంకుటిళ్లు ప్రత్యేకం. సారంగులనే మత్స్యకారులు చెక్క ఇళ్లు కూడా చూడముచ్చటగా ఉంటాయి. పురాతన కాలం నాటి రాతి దేవాలయాలు, ఏనుగుల గుంపులతో కిక్కిరిసిన అడవులకు పేరది. కొగ్గల సరస్సు, ఉడా వలావే, యాలా జాతీయ పార్కులు తప్పక చూడాల్సినవి. ఇక్కడి సముద్ర నీటి కింద విరిగిన నౌకల అవశేషాల్ని చూడొచ్చు. భారీ తిమింగలాల్ని చూడాలనుకునే ఆశను ఇక్కడి బీచులు తీర్చేస్తాయి. వంపులు తిరిగి ఉండే ఈ ప్రాంతం నుంచే తేయాకు తోటలు ఆరంభమవుతాయి. ఇక్కడే 400 ఏళ్లనాటి డచ్ గాలే కోట ఉంది. దీన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. బ్రిటీష్‌వారు ఏర్పాటు చేసిన డోండ్రా లైట్‌హౌజ్ పోస్ట్ కార్డు ఫొటోగ్రాఫ్ పరిసరాల్ని కలిగి ఉంటుంది. పోలాగా పిలువబడే ఇక్కడి మార్కెట్లలో శ్రీలంక సినమాన్ (దాల్చిన చెక్క) విరివిగా దొరుకుతుంది. ఇదో బ్రాండ్ కూడా. అక్కడి నుంచి కాండీలోకి దారి పడితే అదే ఓ ప్రత్యేక రాజ్యంగా తోస్తుంది.
ఐ క్యాండీ..
ఈ దీవి మధ్య భాగాన్నంతట విస్తరించిన కాండీ బౌద్ధ రాజ్యంగా విరాజిల్లింది. పచ్చగా, చల్లగా, ఎత్తైన ప్రదేశంలో ఉండే ఈ ప్రాంతం ఉష్ణమండల ప్రాంతమంటే నమ్మశక్యం కాదు. నడుం ఎత్తు వరకు చక్కగా ట్రిమ్ చేసిన తేయాకు తోటల గుండా సాగే ప్రయాణాలు మరిచిపోలేని అనుభూతిని కల్పిస్తాయి. స్ట్రాత్డన్, షానన్, కెనిల్వర్త్గా పిలిచే ఇక్కడి తేయాకు ప్లాంటేషన్లు బ్రిటీష్ వారి ముద్రను చెబుతాయి. ఆ ప్లాంటేషన్లలో పనిచేసేందుకు భారత్ నుంచి తమిళులు తరలి వెళ్లారు. ఈ కొండల గుండా వెళ్లే రైలు ప్రయాణం నిదానంగా సాగినా అక్కడిప్రకృతి సౌందర్యంతో కట్టిపడేస్తుంది. ప్రయాణం ముగియకూడదనే ఆలోచనను తెస్తుంది. రెండు లైన్ల రహదారులే అయినా చాలా పటిష్టంగా, భద్రంగా ఉంటాయి. రాజధాని కొలంబో నుంచి 3 గంటల దూరంలో ఉండే కాండీకి పర్యాటకులను తీసుకొచ్చే టూరిస్ట్ డ్రైవర్లకు స్థానిక విడిది ఉచితంగానో, చవకగానో లభిస్తుంది. పర్యాటక కేంద్రంగా ఎంతగా అభివృద్ధి చెందిందో ఈ విషయం తెలియజేస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్న కాండీ పట్టణం లోయ ప్రాంతంలో ఉంటుంది.
బుద్ధుని దంతం..
ఇక్కడి బుద్ధుడి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. బుద్ధుడి నిర్యాణానంతరం భారత్ అంతటా ఆయన దంతాన్ని ఒక దాన్ని యాత్ర చేసి చివరకు 16వ శతాబ్దిలో ఇక్కడకు చేర్చారు. దాన్ని ఓ బంగారు పెట్టెలో భద్రపరిచి రెండు ఆలయ నిర్మాణాలతో పాలరాతి క్షేత్రం నిర్మించారు. వేయిన్నర ఏళ్లపాటు సాగిన ఆ దంత యాత్రను వివరించే చిత్తరువులు మందిరంలో చిత్రించారు. అప్పటి రాజరికాని పట్టిచూపే ఆభరణాలు, గ్రంథాలు, అక్కడ ప్రత్యేకంగా లభ్యమయ్యే సుగంధాలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. సారంగ్ అనే ప్రత్యేక వస్త్రాన్ని ధరించి బుద్ధ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. కాండీకే ప్రత్యేకమైన నృత్యరీతి ఉంది. అగ్నితో విన్యాసాలు చేసే కళాకారులు అక్కడి కాండ్యన్ కళా, సాంస్క ృతిక కేంద్రంలో ప్రదర్శనలు ఇస్తుంటారు.
ఆర్కిడ్ తోటలు..
కాండీ పట్టణానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉండే రాయల్ బొటానికల్ గార్డెన్స్ చాలా విలక్షణమైనది. ఆర్కిడ్లు, సుగంధ ద్రవ్య, ఓషధ మొక్కలతో 147 ఎకరాల్లో విస్తరించుకుని ఉంటుందిది. సుమారు 4000 జాతుల మొక్కల్ని పెంచుతున్నారు. 1371లో విక్రమబాహు-2 అనే రాజు వీటికి అంకురార్పణ చేశాడు. ఆ తర్వాత బ్రిటీష్ హయాంలో మరింత అభివృద్ధి చేశారు. ఏటా 20 లక్షల మంది పర్యాటకులు ఈ గార్డెన్స్‌ను చూడటానికి వస్తారు. హెల్గాస్ ఫాల్లీ అనే హోటల్ జర్మనీకి చెందిన బాహాస్ కళను ఆలింగనం చేసుకుంది. పాత కాలం నాటి ఫర్నీచర్, ఆయిల్ పెయింటింగ్‌లతో వందేళ్ల వెనక్కు తీసుకెళుతుంది. మహాత్మ గాంధీ, వివియన్ లీ, లారెన్స్ ఒలివియా, జార్జ్ పెక్ వంటి ప్రసిద్ధ వ్యక్తులు ఇక్కడ బస చేశారు. వారి ఫొటోలు ఇక్కడ దర్శనమిస్తాయి.
తేయాకు లోకం..
కాండీ నుంచి 40 మైళ్ల దూరంలో హట్టన్ పట్టణం ఉంది. ఇది కూడా తేయాకు క్షేత్రాలకు సుప్రసిద్ధమైంది. 4000 వేల అడుగుల ఎత్తులో కొండలుంటాయి. జలపాతాలకు ఇవి నెలవులు. కాస్టెరిగా సరస్సును ఆనుకుని తేయాకు తోటలుంటాయి.ఎటు చూసినా అవే దర్శన మివ్వడంతో తేయాకు లోకంగా కనిపిస్తుంది. టియాన్ట్సిన్ బంగళా 1888 నాటిది. దీన్నిపుడు రిసార్ట్‌గా మార్చారు. ఇక్కడి నుంచి మూడున్నర గంటల ప్రయాణం చేస్తే ఎల్లాకు చేరుకోవచ్చు. మృదువుగా కనిపించే కొండల్లో కలప చెట్లు దట్టంగా పరుచుకున్న ఈ ప్రాంతంలో దేవన్ జలపాతం ఉంది. మహావేలి నదిలోని ఓ పాయ 97 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతుంది ఇక్కడ. దాని ధార ఒరవడితో నీరు పొగమంచులా మారి ఆ ప్రాంతాన పరుచుకుంటుంది. ఇక్కడి సమీపాన ఉన్న జార్జ్ సరస్సు నీరు మెరుస్తున్నట్టుగా ఉంటుంది. ఇది కూడా పర్యాటక కేంద్రమే. ఇక్కడి సీతా రామ మందిరం కూడా ప్రాచీనమైంది. చుట్టూ అరణ్య ప్రాంతంలో జాతీయ రహదారికి దగ్గరగా ఉండే ఈ గుడిని రామాయణ కాల సందర్శనీయ స్థలంగా గుర్తించారు. ఇక్కడ అనేక వసతి గృహాలు, రెస్టారెంట్లు పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటాయి. దగ్గరలోని నువారా ఎలియాకు కూడా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి కూరగాయల తోటలు పేరుగాంచినవి. కొండ కోనల్లో కొత్త లంకను దర్శిస్తే అసలైన ద్వీపలోకం కళ్లకు కడుతుంది.
