హైదరాబాద్ మహానగరాన్ని పాలించిన నిజాం నవాబుల కాలంలో ఎన్నో భవంతులు, విశ్రాంతి మందిరాల నిర్మాణం జరగ్గా, ప్రస్తుతం చాలామంది ధనవంతుల భవనాలు ప్రభుత్వ కార్యాలయాలుగా, విశ్వవిద్యాలయాలుగా, వైద్యాలయాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక వసతి గృహం నేటికీ చెక్కు చెదరకుండా ప్రస్తుతం రాష్ట్రపతికి ఆతిథ్యమిస్తోంది.. హైదరాబాద్‌లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం. శీతాకాల విడిది సందర్భంగా రాష్ట్రపతి ఇక్కడ బస చేయడం ఆనవాయితీ.
సికింద్రాబాద్ నుంచి 10 కి.మీ దూరంలో సిద్ధిపేటకు వెళ్ళేదారిలో లోతుకుంట అనే ప్రాంతానికి దగ్గర్లో రాష్ట్రపతి నిలయం ఉంది. దీన్ని పురాతన, వారసత్వ కట్టడంగా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన పురాతన చెట్ల నీడలో రాష్ట్రపతి నిలయం ఆనాటి రాచరికపు తీపి గుర్తుగా నిలుస్తుంది. సికింద్రాబాద్ దగ్గరలోని బొల్లారంలో అప్పటి నిజాం నవాబు ''నజీర్ ఉద్ దౌలా'' 1860లో తన విశ్రాంతి మందిరంగా ఈ భవనాన్ని నిర్మించారని తెలుస్తుంది. దాదాపు 93 ఎకరాల సువిశాల ప్రాంతంలో ఉన్న ఈ ప్యాలెస్ చుట్టూ 50 అడుగుల ఎత్తులో ఉండే గోడలు నిర్మించి కనుచూపు మేరలో ఉండగానే శత్రువుని కనిపెట్టేందుకు వీలుగా నిర్మాణం జరిగింది. నిత్యం నిజాం సైనికులు కనుసన్నల్లో ఉండేది. తదుపరి పరిపాలన సర్ సాలార్జంగ్ చేతికి వచ్చాక ఇది ప్రధాన సైనిక అధికారి కార్యాలయంగా మార్చారు. ఇక్కడే సైనికులకు శిబిరాలను ఏర్పాటు చేసి యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చేవారు. ఆ తరువాత బ్రిటిష్ పాలకులతో కుదిరిన ఒప్పందం మేరకు బ్రిటిష్ సైన్యానికి స్థావరాలుగా మార్చేశారు. బ్రిటిష్ సైనికాధికారులు సైతం తమ నివాస గృహంగా మార్చేసుకున్నారు. అప్పట్లో దీనిని ''బ్రిటిష్ రెసిడెన్సీ'' అని పిలిచేవారు.
స్వాతంత్య్రం వచ్చాక చిన్న చిన్న రాజ్యాలు, సంస్థానాలన్ని సువిశాల భారతదేశంలో ఐక్యం కాగా, హైదరాబాద్ సంస్థానం విలీనం చేయడానికి మాత్రం నిజాం ఒప్పుకోలేదు. పైగా ప్రజలపై వేధింపులు పెరిగిపోయాయి. నిజాం పాలన తట్టుకోలేని ప్రజలు 'ఆంధ్ర మహాసభ' ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాలు, తెలంగాణ సాయుధ పోరాటాంలో పాల్గొన్నారు. చివరకు భారత ప్రభుత్వం నిజాం సైనికులపై పోలీస్ చర్యకు పాల్పడింది. ఇది 5 రోజుల పాటు జరిగాక నిజాం తన సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో విలీనం చేశాడు. భారత ప్రభుత్వం సైనిక స్థావరాలను కంటోన్మెంట్ ప్రాంతంలో ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్యాలెస్‌ని మిలిటరీ అధీనంలోకి తీసుకుంది. ఆపై భారత రాష్ట్రపతి విడిది నివాసంగా ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి నిలయం ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఉండాలనే, ప్రజల బాగోగులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో విడిది భవనాల్ని ఒకటి ఈశాన్య రాష్ట్రాలలోను మరొకటి దక్షిణాదిన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈశాన్య రాష్ట్రాలు సిమ్లాలో, దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్‌లో ఆతిథ్యమిస్తున్నారు. కేవలం పర్యటనలకే కాక వాతావరణం ఇబ్బందుల దృష్ట్యా విడిది ఏర్పాట్లు చేశారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉంటుంది. ఈ భవనంలో మొఘల్ గార్డెన్స్‌కి ధీటుగా ఆరోగ్యాన్ని పెంచే మూలికా వనాల నడుమ నిత్య పచ్చదనంతో శోభాయమానంగా ఉంటుంది. అన్ని కాలాల్లో ఆహ్లాదకరంగా ఉండే అద్భుత వాతావరణం ఉన్న ఈ భవనానికి కొత్త సొగసులద్ది రాష్ట్రపతి నిలయంగా మార్చారు.
దాదాపు 150 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ భవనంలో 20 నివాస గదులు ఉన్నాయి. వీటన్నింటిని 3 విభాగాలుగా విభజించారు. ప్రెసిడెంట్ వింగ్, ఫ్యామిలీ వింగ్, ఎడిసి వింగ్‌గా పిలవబడుతున్నాయి. ప్రత్యేకంగా పెద్ద డైనింగ్ హాల్, మార్నింగ్ రూం, డైనింగ్ హాల్ ప్రత్యేకంగా ఉంటాయి. ఈ డైనింగ్ హాళ్ళకు ప్రత్యేక వంట గదులుండటమే కాదు, ఒకదాని నుండి మరొక దానిలోకి వెళ్లగలిగేలా రూపొందించారు.. నాటి నిజాం ప్రభువులు. ప్రస్తుతం ఈ గదులన్ని అత్యాధునిక పరికరాలతో నిండిపోయాయి. ఈ భవనం నిర్మాణం 20-25 అడుగుల ఎత్తులో ఉండటం, అన్ని భవనాల్ని కలుపుతూ చుట్టూ ఉన్న విశాలమైన వరండా వల్ల ఈ నిర్మాణం చూడముచ్చటగా ఉంటుంది.
శీతాకాల విడిది
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా మన దేశ ప్రథమ పౌరుడిగా మొదటి రాష్ట్రపతి డా|| బాబు రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ, వి.వి.గిరి , డా|| నీలం సంజీవరెడ్డి తదితరులు క్రమం తప్పకుండా ప్రతి ఏటా 15 రోజులు బస చేసేవారు. 2000లో కె.ఆర్.నారాయణన్ వచ్చారు. ఆ తరువాత జ్ఞాని జైల్ సింగ్ వచ్చినప్పుడు కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలకు విధిగా హజరయ్యేవారు. ఈ ప్రాంతం చాలా సుందరంగా ఉందని కితాబు ఇచ్చారు. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కువగా శాస్త్రవేత్తలతోనూ, విద్యార్థులతోనూ సమావేశం అయ్యేవారు. ప్రతిభా పాటిల్ వచ్చినప్పుడు బొల్లారంలో మూలికా వనాన్ని ప్రారంభించారు. 2011 నుంచి రాష్ట్రపతి పర్యటన అనంతరం ఒక వారం రోజుల పాటు జంట నగరాల్లో సాధారణ పౌరులకు ఈ నిలయాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు.
మూలికా వనం
ప్రకృతి ప్రేమికుల కోసం నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2010 జనవరి 10న మూలికా వనాన్ని ప్రారంభించారు. ఈ గార్డెన్ కోసం 35 ఎకరాలు కేటాయించి వనమాలికల వృక్షాలను వివిధ ప్రదేశాల నుంచి సేకరించి సుందర వనంగా తీర్చిదిద్దారు. 111 రకాల పూల మెక్కల్ని ఇక్కడ చూడవచ్చు. వివిధ రకాల రోగాలను నయం చేసే హెర్బల్ మొక్కలు పెంపకానికి 7000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. సర్పగంధ, కలబంద, కొత్తిమీర, నిమ్మగడ్డి, గంధం, గడ్డదినుసు, మల్లె, తులసి వంటి మొక్కల్ని పెంచుతున్నారు. సి.పి.డబ్ల్యు.పి, ఆంధ్రప్రదేశ్ వనమూలికల శాఖ కృషితో వనాన్ని విస్తరించారు. మొఘల్ గార్డెన్స్‌కు ధీటుగా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కోరిక మేరకు ప్రజల సందర్శనార్థం అనమతిస్తున్నారు.
- అనంతోజు మోహన్ కృష్ణ
8897765417
రాష్ట్రపతికి మన ఆతిథ్యం
