హాయిగొలిపే సముద్రపు పిల్లగాలులు, సుగంధ ద్రవ్య పరిమళాలు, భిన్న సంస్కృతుల కలబోత ఆ నగర విశిష్టత. ప్రపంచంలోనే ముఖ్యమైన అది పెద్ద నౌకాశ్రయంగా దీనికి పేరుంది. ఒకప్పుడు ఈ నగరాన్ని పోర్చుగీసువారు, తర్వాత డచ్‌వారు ఏలారు. అదే కేరళలోని కొచ్చి నగరం. ఆ నగర విశేషాలు...
కేరళరాష్ట్ర రాజధాని తిరువనంతపురమైనా వ్యాపార వాణిజ్యాల రాజధానిగా పేరు తెచ్చుకుంది మాత్రం కొచ్చి నగరం. భారతదేశంలోని అందమైన పర్యాటక స్థలాల్లో ఇదొకటి. అంతేకాదు ప్రపంచంలోనే ముఖ్యమైన, పెద్ద నౌకాశ్రయం ఇది. ఎందుకంటే భూ, సముద్ర, వాయు మార్గాల ద్వారా రవాణా సౌకర్యం ఉన్న అతికొద్ది నౌకాశ్రయాల్లో ఇదొకటి. అందుకే ఈ నగరాన్ని 'అరేబియా సముద్ర రాణి' అంటారు.
ఆ నగరం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ వ్యాపార వాణిజ్యాలు చేయాలని చైనా, అరబ్బు దేశాల వారు ఉవ్విళ్లూరారు. యూరోపియన్ దేశస్తులు ఏకంగా ఆ నగరాన్ని తమ సొంతం చేసుకున్నారు. వెనిస్ దేశస్థులు సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిరాటంకంగా సాగించారు. వీరందరికీ ఆ నగరమంటే ఎందుకంత ఇష్టమంటే... ఏ దేశంతోనైనా సత్సంబంధాలు చేయడానికి వీలైన నౌకాశ్రయం అక్కడ వుండడమే. ఇన్ని దేశాల సంస్కృతులు అక్కడ ఏళ్ల తరబడి ఉన్నాయి. అందుకే ఆ నగర వీధుల్లో ఇప్పటికీ ఆయా సంస్కృతుల పరిమళం గుబాళిస్తుంది. ప్రకృతి సౌందర్యం పర్యాటకులనే కాదు, నిత్యం అక్కడుండే స్థానికులను కూడా మంత్రముగ్ధులను చేస్తుంది.
చరిత్ర పుటల్లో కొచ్చి...
క్రీ.శ.1498లో వాస్కోడిగామా తన వ్యాపార స్థావరంగా కేరళలోని కాలికట్ తీరాన్ని ఎంచుకున్నాడు. తర్వాతికాలంలో ఇక్కడే స్థిరపడ్డాడు. మరో రేండేళ్లకు పోర్చుగీసువారు వచ్చి కొచ్చి మహారాజు అనుమతితో స్థిర నివాసం నిర్మించుకున్నారు. 1662-63 ప్రాంతంలో పోర్చుగీసు వారి ప్రాబల్యం తగ్గి ఆ ప్రాంతం డచ్చివారి అధీనంలోకి వెళ్లింది. ఆ తర్వాత బ్రిటీష్ పాలనలోకి వచ్చింది. అందుకే ఇప్పటికీ యూరోపియన్ సంస్కృతిని చాటి చెప్పే రాజప్రాసాదాలు, ప్రార్థనా మందిరాలు, చారిత్రక కట్టడాలు ఇక్కడ కనిపిస్తాయి.
అతి ప్రాచీన చరిత్ర కలిగిన కొచ్చి నగరాన్ని పాత కొత్తల మేలుకలయికగా అభివర్ణించొచ్చు. ఫోర్ట్ కొచ్చి, మట్టన్‌చెరి, ఎర్నాకులం, ఎడపల్లి, వెల్లింగ్టన్, తేవర, నైటిల్ల తదితర ద్పీపాలన్నీ కలిసి కొచ్చి నగరంగా ఏర్పడ్డాయి. ఈ ద్వీపాలన్నింటినీ వంతెనల ద్వారా కలిపారు.
సందర్శనీయం...
మెరైన్ డ్రైవ్‌లోని బోట్జెట్టీ నుండి కేరళ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (కేటీడీసీ) బోట్లలో మట్టన్‌చెరి, పోర్ట్ కొచ్చిలకు వెళ్లొచ్చు. సముద్ర కాలువల (బ్యాక్‌వాటర్స్)లో ఈ పడవ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఒకవైపు ఎర్నాకుళంలోని అత్యంత ఆధునిక ఆకాశ హార్మ్యాలు, ఇంకొక వైపు బోల్‌ఘట్టీ, పోర్ట్కొచ్చి, మట్టన్‌చెరి దీవులు, మరోవైపు కొచ్చి నౌకాశ్రయంలో నిలిచి ఉన్న పెద్ద నౌకలు... ఇలా ఎటు చూసినా అద్భుతమైన దృశ్యాలే కనిపిస్తాయి.
ఫోర్ట్కొచ్చిలో రెండంతస్తుల అందమైన డచ్ ప్యాలెస్ ఉంది. దీన్ని పోర్చుగీసు వారు నిర్మించారు. తర్వాత వచ్చిన డచ్‌వారు దీనికి ఎన్నో మార్పులు చేర్పులు చేసి కొచ్చి మహారాజుకు కానుకగా ఇచ్చారుట. అందుకేనేమో దీన్ని డచ్ ప్యాలెస్ అనే పిలుస్తుంటారు. ఈ కోట గోడలపై చిత్రించిన రామాయణ, మహాభారతాలకు సంబంధించిన చిత్రాలను చూసి తీరవలసిందే.
యూరోపియన్లు మనదేశంలో నిర్మించిన అతి పురాతన సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి కూడా ఇక్కడే ఉంది. వాస్కోడిగామా కొచ్చిలోనే మరణిస్తే, ఆయన మృత దేహాన్ని ఈ చర్చిలోనే సమాధి చేశారు. తర్వాత చాలా కాలానికి ఆయన అస్థికలను పోర్చుగల్‌కు తీసుకెళ్లారని చెప్తుంటారు. అయితే సమాధి ప్రదేశాన్ని ఇప్పుడూ చూడొచ్చు.
చూడాల్సిన ప్రదేశాల్లో మరోటి జ్యూయిష్ సినగోగ్. ఇది యూదుల ప్రార్థనా మందిరం. ప్రపంచంలోనే అతి పురాతనమైనదట. ఈ మందిరం ప్రత్యేకత ఏంటంటే... చేత్తో పెయింట్ చేసిన కొన్ని వందల చైనీస్ టైల్స్‌ను నేలమీద పరిచారు. వీటిలో ఏ రెండు చిత్రాలూ ఒకేలా ఉండవు. కొన్ని వందల సంవత్సరాలు గడిచినా వీటి మెరుపు కూడా చెక్కుచెదరలేదు.
ఇక్కడున్న బీచ్ చిన్నదైనా అందంగా ఉంటుంది. బీచ్ పక్కన యూరోపియన్ సంస్కృతిని ప్రతిబింబించే పురాతన భవంతులు కనిపిస్తాయి. బ్యాక్ వాటర్స్ పక్కనే ఉన్న చైనీస్ ఫిషర్‌నెట్స్ కొచ్చికే ప్రత్యేకం. చైనాలో తప్ప మరెక్కగా కనిపించని ఈ వలలు ఇక్కడ కనిపిస్తాయి. స్థానికులు వీటితోనే చేపలు పడతారు.
సూర్యాస్తమయమయ్యేసరికి పడవలను సముద్రం ఒడ్డుకి తీసుకువచ్చి ఆపుతారు. ఆ సమయంలో సముద్రం అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు... సముద్రం, ఆకాశం కలిసినట్లుండే ప్రదేశంలో బంగారు కాంతులతో మెరిసిపోయే సాగరశోభలను చూడాల్సిందే. ఆ సమయంలో సముద్రంలో ఎగిరిపడే డాల్ఫిన్లను చూడడం అపురూప దృశ్యం.
కొచ్చి నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో త్రిపునితురలోని సువిశాల మైదానంలో హిల్ ప్యాలెస్ ఉంది. ఇది కొచ్చి మహారాజుల నివాస గృహం. ప్రస్తుతం దీన్ని మ్యూజియంగా మార్చారు. ఇందులో రాజవంశీయుల రథాలు, యుద్ధ సామగ్రి, దుస్తుల వంటివి చూడొచ్చు. ఆ రాజవంశానికి చెందిన రాజా రవివర్మ చిత్రించిన వర్ణచిత్రాలు కూడా ఇక్కడు న్నాయి. మనసును కట్టిపడేసేలా, జీవకళ తొణకి సలాడే ఆ చిత్రాలను ఇష్టపడనివారు ఉండరేమో.
సముద్రపు కాలువల్లోని బోల్‌ఘట్టీ అందమైన చిన్న ద్వీపం. ఇక్కడ డచ్‌వారు నిర్మించిన కోట ఉంది. ప్రస్తుతం దీన్ని హోటల్‌గా మార్చారు.
కొచ్చి చుట్టుపక్కల వేగా, ల్యాండ్, డ్రీమ్ వరల్డ్, సిల్వర్ స్టార్మ్, ఫాంటసీ పార్క్ తదితర వాటర్ థీమ్ పార్కులున్నాయి. ఇవన్నీ పిల్లలనే కాదు పెద్దలనూ ఆకట్టుకుంటాయి.
వెనిస్ ఆఫ్ ఇండియా
కొచ్చికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో అలెప్పీ ఉంది. దీన్ని 'వెనిస్ ఆఫ్ ఇండియా'గా పిలుస్తారు. ఇక్కడ వెంబానద్ సరస్సులో నిర్వహించే పడవ పందేలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. కేరళ అందాలను తనివితీరా చూడాలంటే, ఇక్కడి నుంచి కొచ్చికి బ్యాక్ వాటర్స్‌లో పడవ ప్రయాణం చేయాల్సిందే.
తెక్కడిలోని ప్రసిద్ధిగాంచిన పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చ్యువరీకి కొచ్చి నుండి రోడ్డు మార్గంలో వెళ్లొచ్చు. ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడ త్రిసూర్ పూరమ్ ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి.
ఇక్కడికి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో మున్నార్ హిల్ రిసార్ట్ ఉంది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో తేయాకు, యాలకుల తోటలు కనిపిస్తాయి. భూమాతకు చిలకపచ్చ చీర కట్టినట్లుండే ఈ ప్రాంతం పర్యాటకుల్ని వేరే లోకంలో విహరిస్తున్నామన్న భ్రమ కలిగిస్తుంది.
సరసమైన ధరలకే....
షాపింగ్ మాల్ ప్రియులకు కొచ్చి కచ్చితంగా నచ్చి తీరుతుంది. పర్యటన గుర్తుగా కొనడానకి ఎన్నో హస్తకళాఖండాలు లభిస్తాయి. కథాకళి మాస్క్‌లు, పడవల వాల్ హ్యాంగింగ్స్, కేరళ సంప్రదాయ చీరలు... ఇలా ఇంకెన్నో వస్తువులు ఆకర్షిస్తాయి. ముఖ్యమైన మరో విశేషమేమంటే ఇక్కడ బంగారు ఆభరణాలు మనం ఊహించనన్ని వెరైటీల్లో దొరుకుతాయి. నాలుగైదు అంతస్తులుగా ఉండే బంగారు షాపులు కనిపిస్తాయి. ఒక్కో అంతస్తులో ఒక్కో రకమైన నగలుంటాయి. ఒక అంతస్తులో రాళ్ల నగలూ, ఒక అంతస్తులో పిల్లలకూ, ఒక అంతస్తులో పెద్దలకీ... ఇలా అన్నమాట.
అక్కడి ఆప్యాయతలు, పండుగలు, సముద్ర గాలులు, కొబ్బరి తోటలు, పడవ షికార్లు, గర్జించే మేఘాలు... అన్నీ పర్యాటకుల మదిలో చెక్కుచెదరని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అందమైన ఆ అనుభూతుల్ని ఎన్నిసార్లు నెమరువేసుకున్నా తనివి తీరదు.
కొచ్చికి వెళ్తే అక్కడి వంటలైన పాలడ ప్రథమన్ (ఒక రకమైన పాల పాయసం), అరటి, పనస చిప్స్, కేరళ హల్వా, ఫళంపురి, అప్పం, ఆడియాపం, కేరళ పరాటాలను తప్పక రుచి చూడాల్సిందే.
కేరళ రాష్ట్రం సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు, శొంఠి తదితరాలన్నీ సరసమైన ధరలకు లభిస్తాయి. నాణ్యత కూడా బావుంటుంది.
కొచ్చిలో అందరికీ అందుబాటులో ఉండే హోటళ్లు ఉన్నాయి. హైదరాబాద్ నుండి కొచ్చికి దాదాపు 25 గంటల ప్రయాణం. అక్టోబర్ నుండి మే నెల వరకు పర్యటనకు అనువైన సమయం. అయితే ఓనం, క్రిస్మస్ సమయాల్లో వెళ్తే అక్కడి ఆచార వ్యవహారాలు చూడ్డానికి వీలవుతుంది. కేరళవాసుల ఆచారాలు, వేషభాషలు, ఆహా రపు అల వాట్లు, పండు గలు భిన్నంగా ఉంటా యి కనక సందర్శ కులకు కన్నుల పండుగే.
అరేబియా సముద్రరాణి
