కష్టాలు వస్తే కలసి వస్తాయని ఒక సామెత ఉంది. అయితే, సుఖాలు కలసి వచ్చినపుడు ఇతరులకు అన్ని విషయాలూ తెలిసే అవకాశముండదు. మనం సామెతల గురించి పక్కనబెట్టి మారన్ సోదరుల పరిస్థితిని చూద్దాం. జెమిని చానళ్ళను ఇవ్వబోమని ఎంఎస్ఓలు ప్రకటించినట్టు ఇటీవల ఓ సమాచారం వాక్యంగా బుల్లి తెరమీద పరుగులు తీసింది. నిజానికి దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుగు ఛానళ్ళలో, తెలుగు పత్రికల్లో (మీకందుబాటులో ఉండే మూడింతలు) కనబడలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో, సంస్థలతో పెద్దగా సంబంధం లేని టైమ్స్ ఆఫ్ ఇండియా చెన్నరు కూర్పు (ఎడిషన్)లో గత శుక్రవారం దీనికి సంబంధించి వార్తను ప్రచురించింది. విజయవాడకు చెందిన పి.వి.శివప్రసాద్ అనే వ్యక్తి ఒక కంప్లయింట్ దాఖలు చేశారు. చందాకు సంబంధించిన కమీషన్ సుమారు రూ.40 లక్షలు మొత్తాన్ని సన్ సంస్థ తమకు ఇవ్వలేదనేది అభియోగం. 2009 మే 5న ఇవ్వమని అడిగితే జులై 14న రమ్మని చెప్పారట. రెండోసారి వెళ్ళినపుడు కలిసే అవకాశం లేకుండా గెంటివేశారని కూడా పేర్కొన్నారు. దీనికి సంబంధించి చెన్నరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచి క్రిమినల్ కేసును నమోదు చేసింది. దీన్ని రద్దు చేయమని కళానిధి మారన్ మద్రాసు హైకోర్టును కోరాడు. ఇది శుక్రవారం సంచిక తెలిపిన సమాచారం. ఇదిలా ఉండగా ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో చీఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సుప్రీంకోర్టు తోసిపుచ్చినట్టు గురువారం సాయంకాలానికి వార్తలు వచ్చాయి. నిజానికి 2జి కేసులో భాగంగా ఈ దృష్టాంతం చాలామందికి గుర్తుండవచ్చు. గురువారం రోజున సుప్రీంకోర్టు మారన్ విన్నపానికి విస్తుపోయిందన్న రీతిలో టైమ్స్ ఆఫ్ ఇండియా శీర్షిక పెట్టింది. కనుక ఛార్జిషీటు తప్పదనే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఎక్కడైనా లభిస్తాయి. కనుక మీరు సులువుగా చదువుకోవచ్చు. మరో కంటికి తెలియకుండా బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ వందలాది టైన్లు ఉచితంగా సన్ ప్రసారాలకు వాడుకున్నప్పుడు ఎక్కువమందికి తెలియదు. లేదా మరో వాణిజ్య సంస్థకు వాటా ఇవ్వకపోతే కుదిరేది కాదు అని బెదిరించిన వేళ కూడా చాలామందికి తెలియదు. కానీ, ఇప్పుడు అలా కాదు కష్టాలు వరుసగా వస్తున్నాయి. చాలా తక్కువ వ్యవధిలో స్పైస్‌జెట్ విమాన సంస్థను కొన్నారు. డెక్కన్ క్రానికల్ నుంచి డెక్కన్ చార్జర్స్‌ను కైవశం చేసుకున్నారు. ఇవన్నీ సాధ్యమైనపుడు ఆమాత్రం నేపథ్యం ఉంటుందని కొందరు వ్యాఖ్యానించవచ్చు. వాటన్నిటికి మించి చెన్నరులో ఈ వినాయక చవితి ముందు ఎంతోమంది టీవీ ప్రసారాలు లేక ఇబ్బంది పడ్డారు. 15 రోజుల్లో కల్ కేబుల్స్ ప్రయివేటు లిమిటెడ్ చానళ్ళ పంపిణీని మూసేయమని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ గత బుధవారం కోరింది. అంతే కాదు; టీవీ చానళ్ళ వినియోగదారులు మరో ఆపరేటర్‌కు మారవల్సిందిగా కూడా టీవీ తెరమీద సమాచారం ఇవ్వమని ఆదేశించారు. దాంతో గురువారం సన్‌టీవీ సంస్థ మద్రాసు హైకోర్టుకు వెళ్ళింది : తమకు ముందుగా చెప్పలేదని, దీనినుంచి విముక్తి కలిగించమని. అయినా, ఉపశమనం పెద్దగా లేదు. స్క్రోలింగ్ వేయనక్కరలేదని మాత్రం వెసులుబాటు దొరికింది. అదే గురువారం వార్తలతోపాటు చెన్నరులో కొన్నిచోట్ల కేబుల్‌వైర్లు కత్తిరిస్తున్నట్టు ఫొటోలతో పాటు వివరమైన వార్తలు వచ్చాయి. అందువల్లనే వినాయక చవితి రోజున కొన్నిచోట్ల కేబుల్ ప్రసారాలు లేవు. దీని నేపథ్యం కేంద్ర సమాచార ప్రసారమంత్రిత్వశాఖకు సంబంధంలేదు. టీవీ, మొబైల్‌ఫోన్, ఇంటర్నెట్ ప్రసారాలకోసం సంస్థలు వేసే తీగలకు సంబంధించి సంవత్సరానికి కిలో మీటరుకు రూ.8,400 ల అద్దె ఉండేదట. ఇటీవల దానిని రూ.32,450గా చేశారు. ఇక ప్రతి సంవత్సరం 10 శాతం పెరుగుతుంది. ఈ రుసుం కట్టని 15 సంస్థల వైర్లను గురు, శుక్రవారాల్లో రాష్ట్ర ప్రభుత్వం కత్తిరించింది. ఇది ఇంకా కొనసాగవచ్చు. రాజకీయ నేపథ్యం గల మీడియా సంస్థల కథలు నేరుగా, సీదాసాదాగా ఉండవు. ఎన్నో ట్విస్టులు, లోగుట్టులు తప్పక ఉంటాయి. వైర్లు వేయడానికి ఉండే అద్దె 2000 సంవత్సరం నుంచి అలానే ఉంది. పదిహేనేళ్ళలో వినియోగదారులు కట్టిన రుసుం రేటు ఎంతో కొంత పెరిగి ఉండవచ్చు. ఇది మారన్ల తాత కరుణానిధి ఏలిన కాలం కనుక రుసుం పెరగలేదు. కట్టకపోయినా ఖాతరు చేయలేదు. తరువాత తమిళనాడులో జయలలిత ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో ఈ ప్రభుత్వంతో సాన్నిహిత్యం గల బిజెపి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ సంస్థలు చెల్లించిన పైకం వివరాలు తవ్వితీసింది. మారన్ల కట్టని మొత్తాలు బయటపడ్డాయి. సన్ సంస్థ వారి ప్రసారాలను వినియోగదారులకు చేర్చే కల్ కేబుల్స్ అనే పంపిణీ సంస్థకు సుమంగళి కేబుల్ విజన్ అనేది ఉప సంస్థ. మద్రాసులోని కేబుల్ కనెక్షన్లలో దాదాపు సగం ఈ సంస్థకి ఉన్నాయి. మిగతా 50 శాతం కనెక్షన్లు టిసిసిఎల్, అక్షయ, ఆధార్, క్రిస్టల్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అరసు కలిగి ఉన్నాయి. సుమంగళికి 3.5 లక్షల మంది చందాదారులున్నారని టైమ్స్ రాస్తుండగా, లక్షన్నర అని ఎక్స్‌ప్రెస్ రాస్తోంది. నిజానికి ఈ సంఖ్యలో ఏది ఎంతవరకు వాస్తవమో చెప్పలేం. ఈ ధోరణి అరికట్టాలని సెట్ టాప్‌బాక్స్ విధానం ప్రవేశపెట్టారు. కానీ చెన్నరులో ఉండే 40 లక్షల కేబుల్ కలెక్షన్లలో సగం ఇంకా ఆపరేటర్లు నడిపే విధానంలో ఉన్నాయి. కేవలం 11 లక్షలు మాత్రమే డైరెక్ట టు హౌం విధానంలో ఉన్నాయని ఒక అంచనా. ఇది కూడా గత సంవత్సరంలో డిటిహెచ్ మంచి వృద్ధి (12 శాతం) ఫలితమని తెలుస్తోంది. కేబుల్ పంపిణీలో గల కనెక్షన్లు సగం దాకా ఉన్నవి మారన్ సంస్థలే! కానీ నేడవి వేరే సంస్థకు మారే అవకాశం ఉంది. తక్కువ రేటుగల అరసు, ఇతర డిటిహెచ్ సంస్థలూ లబ్ధి పొందే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ఉంటుందన్నది తమిళనాడు రాజకీయాలు ఎరిగిన వారు చెప్పగలరు. కనుక మారన్ల కేబుల్స్ ఏకఛత్రాధిపత్యం దెబ్బతినే అవకాశం ఎంతో ఉంది. అది ఎంత అనేది కాలమే చెప్పాలి. ఆఖరి మెరుపు : ఎడిషన్ అనే మాటకు తెలుగు పదం లేదా? 1924 ఏప్రిల్ ప్రభుద్ధాంధ్ర లో తెలుగు సంపాదకులకు రాసిన విన్నపంలో గిడుగు రామమూర్తి గారు .. కొన్ని దిన పత్రికలు రోజుకు రెండు కూర్పులు అచ్చు పడతవి.... అని రాశారు. ఎడిషన్ అనే పదానికి కూర్పు అనేది ఇక్కడ సరైన మాట అన్నమాట! - డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ 94407 32392, 80562 42890
మారన్ల వరుస కష్టాలు
