ఐదు రోజులుగా నీళ్లు బంద్
ప్రజాశక్తి - మద్దిపాడు
స్థానిక ముస్లిం కాలనీలో తాగునీటి సరఫరా లేదని కాలనీవాసులు వాపోతున్నారు. మద్దిపాడు పడమర పాలెంలో నూతనంగా నిర్మించిన ఓవర్హెడ్ ట్యాంకు నుంచి ముస్లిము కాలనీ, పడమరపాలెం, గడియాపూడి నిర్వాసితుల కాలనీ, ఇందిరమ్మ కాలనీలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. గత ఐదు రోజుల నుండి ఓవర్హెడ్ ట్యాంకు నుంచి నీరు సరఫరా కావడం లేదని, కొన్ని గృహాలకు మాత్రమే నీరు వస్తున్నాయని వారు తెలిపారు. కొన్ని ఇళ్లవారు మోటర్లను బిగించడంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని వారు తెలియజేశారు. నీరు ఎప్పుడు సరఫరా చేస్తున్నారో కూడా అర్థం కాక కూలీనాలీ చేసుకునే ప్రజలు వాటి కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వ్యవసాయ పనులు చేసుకునేవారు పనులను ఆపుకొని నీటి కోసం నానా అగచాట్లు పడుతున్నారు. ప్రయివేటు వాటర్ ట్యాంకును రూ.1200 లకు కొనుగోలు చేసి నాలుగైదు ఇళ్లవారు తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఓవర్హెడ్ ట్యాంకు వద్ద హైస్పీడ్ మోటర్లను బిగించినట్లయితే అన్నీ ఇళ్లకు నీరు సక్రమంగా వచ్చే అవకాశం ఉందని స్థానికులు తెలుపుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఐదు రోజులుగా నీళ్లు బంద్
