'ఐసిడిఎస్'ను ప్రైవేటుపరం చేసే కుట్ర
అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ
ప్రజాశక్తి-వేటపాలెం
ఐసిడిఎస్‌ను ప్రయివేటు పరం కాకుండా కాపాడుకుందాం అని అంగన్వాడీ వర్కర్ల హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ పిలుపునిచ్చారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వేటపాలెం ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎస్.భ్రమరాంబ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్ వాడీలు అనేక పోరాటాలు చేసి వేతనాలు పెంపు సాధించుకోవడం జరిగిందన్నారు. పిల్లలు పౌష్టికాహార లోపాన్ని తగ్గించడంలో ఐసిడిఎస్ ముఖ్య పాత్ర నిర్వహిం చిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ అంగన్వాడీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించి చేతులు దులుపుకునే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణలో భాగంగా మిక్స్డ్ఫుడ్ ప్యాకేజీ విధానాన్ని, నగదు బదిలీకి వ్యతిరేకంగా పోరాడేందుకు భవిష్యత్తులో సిద్ధంగా ఉండాలన్నారు. సంఘాన్ని బలోపేతం చేసుకుని ఐక్య ఆందోళనతో ముందకు సాగాలని పిలుపునిచ్చారు. సిఐటియు డివిజన్ ఉపాధ్యక్షులు ఎం.వసంతరావు మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి ఎం.చిరంజీవి, నాయకులు బుల్లెమ్మాయి, పి.ప్రమీళ, భూలక్ష్మీ, నిర్మల, సుజాత, ప్రసన్నకుమారి, హైమావతి, సునీత, రమణ పాల్గొన్నారు.
'ఐసిడిఎస్'ను ప్రైవేటుపరం చేసే కుట్ర
