ప్రజాశక్తి - ఆరిలోవ
అసలే ఇరుకు రోడ్డు. రోడ్డంతా గతులకుల మయం. వీటికితోడు రోడ్డు విస్తరణలో భాగంగా ఒకవైపు అడుగు లోతువరకు తవ్వేసి వదిలేశారు. మరో వైపు రోడ్డు అంచులు చిత్తడి చిత్తడిగా తయారయ్యాయి. వెరసి ప్రయాణికుల పాలిట శాపంగా మారింది ఈ రహదారి. ఇటు జాతీయరహదారి ఆనుకొని సాగర తీరంవైపు వెళ్ళే విశాఖ వేలీ స్కూలు రోడ్డు పరిస్థితి ఇది. ఈ రహదారి విస్తరణలో భాగంగా జూపార్కు కొండవైపు ఒక భాగం ఒక అడుగు లోతువరకు తవ్వేసి వదిలేశారు. సుమారు ఏడాదిన్నర కావస్తున్న రహదారి విస్తరణ పనులు పూర్తికాలేదు. రోడ్డు మరోవైపు రోడ్డు అంచులు ముక్కలు ఊడి చిత్తడి చిత్తడిగా మారాయి. దీనితో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జాతీయరహదారి నుంచి సాగర్ తీరం వైపు వెళ్ళే వాహనాలు, విశాఖ వేలీ స్కూలుకు వచ్చే బస్సులు ఇదే మార్గంలోనే ప్రయాణించాలి. ఒకవైపు అడుగు లోతువరకు తవ్వేసిన రోడ్డు, మరోవైపు తెగిపడ్డ రోడ్డు అంచులతో వాహనాలు ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. చిన్న రోడ్డు కావడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు తప్పించుకోలేక నానా కష్టాలు పడుతున్నారు. రోడ్డు విస్తరణ కోసం రోడ్డుకి ఇరువైపులా తవ్వేసి వదిలేయడంతో ఒకవైపు పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో రోడ్డు అంచుభాగం కనిపించకుండా పోయింది. ఏమాత్రం వాహనం అదుపు తప్పినా తప్పల్లో పడిపోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఎటువైపు వాహనం వెళ్ళినా వాహనాలు టైర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనితో వాహనాలుతప్పించే క్రమంలో ఒక వాహనం వెళ్ళినంత వరకు మరో వాహనం ఒక పక్కకు తీసి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో వాహనదారులు గొడవలు పడే పరిస్థితి ఏర్పడింది. రాత్రి సమయంలో మరీ ఇబ్బందిగా తయారైంది. ఈ రహదారిలో విద్యుత్ దీపాలు సరిగ్గా వెలగక పోతే మలుపులు తిరిగే ఈ రహదారిలో ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢకొీట్టికొని ప్రమాదాలు జరిగే ప్రమాదం పొంచి ఉంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జూ పార్కు వైపు ఒక అడుగు లోతువరకు మట్టి తవ్వేసి ఉంచేశారు. దీనితో వాహనదారులు దీనిని గమనించకపోతే పెద్ద వాహనాలు గొయ్యిలో పడిపోతున్నారు. వర్షాలు పడితే తవ్వేసిన రహదారి మరింత కోతకు గురై జూ పార్కు వెనుక భాగం ప్రహారీ కూలే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికైనా అధికారులు వాహనదారుల పడుతున్న ఇబ్బందులను పరిగణంలోకి తీసుకొని రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని కోరుకుంటున్నారు.
తవ్వేసి వదిలేశారు..
