ఐదు రోజుల ఆర్భాటం
-అక్టోబర్ 2కి 7,100 కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం
- గత నెలన్నరలో 600 మాత్రమే మంజూరు
- ఇంజినీర్ల పనితీరుపై కమిషనర్ గుర్రు
-ఆస్తిపన్ను విధించడంలోనూ నిర్లక్ష్యం
-కుళాయి కనెక్షన్ ఇవ్వడంలోనూ అవినీతి
ప్రజాశక్తి - ఒంగోలు సబర్బన్
తాగునీటి కుళాయి కావాలని... ఇంటిపన్ను వేయండని దరఖాస్తు చేసుకొని నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా కనికరం చూపని అధికారులు ఏకంగా మీ ఇంటికే వచ్చి కుళాయి కనెక్షన్ ఇస్తాం..ఇంటిపన్ను వేస్తామని ప్రగల్భాలు పలికారు. ఐదు రోజుల్లోనే అన్ని దరఖాస్తులు పరిష్కరిస్తామని చెప్పి చతికిలపడ్డారు. అధికారుల మధ్య సమన్వయలోపం, ఉన్నతాధికారుల పర్యవేక్షణలేమి కారణంగా వారు చెప్పినవేవీ అమలు కావట్లేదు. అందులో ప్రధానమైంది. ఐదు రోజుల్లో తాగునీటి కుళాయి మంజూరు పథకం.. దీని తీరు తెన్నులను ఇలా ఉన్నాయి..
నగరంలో విలీన గ్రామాలను మినహాయిస్తే 54 వేల అసెస్మెంట్లు ఉన్నాయి. ఇందులో 46 వేల ఇళ్లకు తాగునీటిని కుళాయిల ద్వారా అందించాలి. ప్రస్తుతం మాత్రం 28 వేల గృహాలకే నీటిని అందిస్తున్నారు. మరో 6,700 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. పైప్లైన్లు లేని ప్రాంతం నగరంలో 12.5 శాతం ఉంది. ఇది మినహాయిస్తే అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి మరో 7,100 కనెక్షన్లు ఇస్తే నూరు శాతం లక్ష్యం పూర్తవుతుందనేది అధికారుల అంచనా. అయితే కనీసం 600 కనెక్షన్లు కూడా గత నెలన్నరలో ఇవ్వకపోవడం శోచనీయం.
ఐదు రోజుల ప్రణాళిక ఏమైంది....
గాంధీ జయంతి నాటికి నగరంలోని అన్ని ఇళ్లకు తాగునీరు అందివ్వాలనే లక్ష్యంతో అధికారులు రెండు మాసాల కిందట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుళాయి కోసం దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో కనెక్షన్ ఇస్తామని ప్రకటించారు. ఆస్తిపన్ను విధించడంలో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నందున ఇది వారి లక్ష్యానికి ఆటంకంగా మారింది. దీంతో ఆస్తిపన్ను ఐదు రోజుల్లోనే వేస్తామని ప్రకటించారు. అయితే అధికారులు చెప్పిన మాటలు అమలుకు నోచుకోలేదు. కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చిన సంబంధిత దరఖాస్తులు ఇబ్బడిముబ్బడిగా పెండింగ్‌లో ఉన్నాయి.
ఆ టీంలు ఏం చేస్తున్నాయి..
ఈ కార్యక్రమం అంతా నడిపేందుకు కమిషనర్ కొన్ని టీంలను ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ప్రతి రోజూ డివిజన్లో తిరుగుతూ నగర ప్రజల చేత దరఖాస్తులు పెట్టించేలా బాధ్యతలను అప్పగించారు. ఒక్కో ఎఇకి రోజుకు 25 నుంచి 30 కుళాయి కనెక్షన్లు ఇచ్చే బాధ్యత చెప్పారు. మొత్తం ఏడు మంది ఎఇలకు గానూ రోజుకు 185 ట్యాప్ కనెక్షన్లు ఇవ్వాలి. అయితే ఎఇలు, రెవెన్యూ అధికారులు ఎవరూ డివిజన్లలో తిరగకుండా కమిషనర్ ఆదేశాలను వారు ఎంచక్కా పక్కన పెట్టేశారు.
ఇదో వింత తంతు..
అమృత్ పథకం కింద తాగునీటి కుళాయిని ఉచితంగా ఇవ్వాలి. అవసరమైన సామాగ్రిని కూడా టెండర్ తీసుకున్న ఏజన్సీనే సమకూర్చాలి. డిపాజిట్‌తోపాటు సామగ్రికి అయిన ఖర్చును భవిష్యత్త్‌లో నీటి, ఆస్తిపన్నుతోపాటు కలిపి వాయిదాల పద్దతిలో నగరపాలక సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అమృత్ పథకం తీసుకున్న ఏజన్సీ వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏజన్సీ వారు గతంలో పనిచేసిన ప్లంబర్లనే వర్కర్లుగా పెట్టుకోవడంతో వారు కనెక్షన్లు ఇచ్చేందుకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఏజెన్సీపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మంజూరు అయిన తరువాత వారాల తరబడి కూడా కుళాయి కనెక్షన్ ఇవ్వడం లేదు.
ఇంజనీర్ల మీద కమిషనర్ గుర్రు ..?
నగరంలో తాగునీటి సరఫరా విషయంలో సమయపాలన పాటించడంలేదని, లీకులను అరికట్టడంలోనూ, కొత్త కుళాయి కనెక్షన్లు ఇవ్వడంలోనూ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ట్యాప్ కనెక్షన్ల మంజూరులో తీవ్రమైన అవినీతి జరుగుతుందని, ఇంజనీర్లకు ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కమిషనర్ ఇంజనీర్లను మందలించినట్లు తెలిసింది. పనితీరు మారకుంటే చట్టప్రకారం చర్యలు తప్పవని ఇంజనీర్లను కమిషనర్ హెచ్చరించినట్లు తెలిసింది.
ఐదు రోజుల ఆర్భాటం
