ఆడపిల్లల చదువుతోనే దేశాభివృద్ధి
ప్రజాశక్తి-ఒంగోలుటౌన్
ఆడపిల్లలందరూ చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని యుటిఎఫ్ జిల్లా నేత ఉమామహేశ్వరి పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ రెండో రోజు తరగతులు ఎల్బిజి భవన్లో ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా విద్య- విద్యార్థినులు అనే అంశంపై ఉమామహేశ్వరి మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చే సమయానికి మన దేశ అక్షరాస్యత 12 శాతం మాత్రమే ఉండేదన్నారు.2018కి అక్షరాస్యత శాతం 65 శాతంగా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 72 సంవత్సరాలు అయిందన్నారు. సంవత్సరానికి ఒక్క శాతం కూడా అక్షరాస్యత పెరగలేదని విమర్శించారు. పేరు రాయడం వస్తే చాలు వారు కూడా అక్షరాస్యులేనని, ఒక ఆడపిల్ల చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్లేనని ఆమె తెలిపారు. ఆడపిల్లలు ఉన్నత చదువులు చదువు కోవాలంటే అనేక ఆటంకాలు ఉన్నా యన్నారు. ఆడపిల్లలు వాటిని అధిగమించి చదువుకోవాలని పిలుపునిచ్చారు. విద్యా హక్కు చట్టాన్ని పఠిష్టంగా అమలు చేసే దిశగా పోరాటాలు చేయాలన్నారు. చంద్ర బాబు నాయుడు గత నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో 4,000 పాఠశాలలు, 1020 హాస్టల్స్‌ను మూసివేసి పేదవిద్యార్థులను చదువుకు దూరం చేశారన్నారు. అందులో ఆడపిల్లల శాతం ఎక్కువుగా ఉందన్నారు. ఆడపిల్లలకు విద్యావకాశాలు, రక్షణ కల్పించే దిశగా ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ చిన్నారి పాల్గొన్నారు.