- ఎంవిఎస్ శర్మ
మన దేశంలో ప్రతి పౌరుడూ ఆధార్ కార్డు పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది. యుపిఎ ప్రభుత్వం ఈ ఆధార్ ప్రాజెక్టును ఇన్ఫోసిస్ సంస్థకు నేతృత్వం వహించిన సాఫ్ట్వేర్ నిపుణుడు నందన్ నీలేకణికి అప్పజెప్పింది.
ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యమా అని ఇప్పుడు మనం ఏ లావాదేవీ జరపాలన్నా అన్నింటికీ ఆధార్ తప్పనిసరి. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఆధార్‌లో నమోదయిన వేలి ముద్రలతో సరిపోలకపోతే రేషన్ ఆగిపోతుంది. పెన్షన్ ఆగిపోతుంది. ఉపకార వేతనాలూ ఆగిపోతాయి. కాయకష్టం చేసుకుని బతికే పేదల చేతుల్లో వేలి ముద్రలు అరిగి పోయి వుంటాయి. సుమారు 10 శాతం ప్రజానీకం వేలి ముద్రలు సరిపోలడం లేదన్నది దేశం మొత్తం మీద అనుభవం. అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలకి అర్హులైన పేదలలో 10 శాతం ప్రజలు ఆ సంక్షేమానికి దూరమయ్యారన్నమాట. ప్రభుత్వ లెక్కల్లోని పేదరికాన్నే కొలబద్దగా తీసుకున్నా మూడు, నాలుగు కోట్లమంది పేదలు సంక్షేమానికి దూరం అవుతున్నారు! మరి వీరికి ఏది దారి?
డూప్లికేటు గాళ్లను, బోగస్ పేదలను గుర్తించడానికి ఆధార్ ఉపయోగపడిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంబరంగా గొప్పలు చెప్పుకుంటున్నాయి. బయోమెట్రిక్ గుర్తింపులో సరిపోలని వారందరూ డూప్లికేట్ గాళ్లేనా? మోసగాళ్లేనా? అదే వాస్తవం అయితే ప్రభుత్వాన్ని మోసం చేసిననట్టే కదా! వారందరి మీద కేసులు పెట్టి శిక్షించాలి కదా! ఆ పని ప్రభుత్వాలు చెయ్యలేవు.
మరి వారి పొరపాటేమీ లేకపోయినా చేతులు అరిగేలా కష్టపడిన 'నేరాని'కి సంక్షేమ పథకాలకు దూరమై పోయిన పేదలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఏమీ లేదు.
అంటే వేల కోట్ల రూపాయల బ్యాంకు 'రుణాలను' దిగమింగి కొరగాని నిరర్థక ఆస్తులుగా చిత్రీకరించి ప్రజల సొమ్మును తేరగా ఆరగించే అంబానీలు, అదానీలు, డొల్ల కంపెనీలు నడిపే వాళ్లు - వీరంతా గౌరవీయులు, ప్రభుత్వానికి నమ్మదగిన వ్యక్తులు. అందుకే వీరి పాత పారు బకాయిలను ఏ విధంగా రద్దు చేయాలి? మళ్లీ కొత్త అప్పులు వారికి ఎలా సమకూర్చాలి? అందుకోసం కొత్తగా ఏం చట్టాలు చేయాలి? అన్నది ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన కర్తవ్యంగా ఉంది.
వృద్ధులు, వికలాంగులు, పేదలు ఆధార్ పుణ్యమా అని సంక్షేమ పథకాలకు దూరమైతే వారంతా ప్రభుత్వ లెక్కల ప్రకారం 'ఫ్రాడ్'గాళ్లు. వాళ్ల గురించి పట్టించుకోనవసరమే లేదు!
'మేం మిడిల్ క్లాసు వాళ్లం. మమ్మల్ని ప్రభుత్వాలు గాని, రాజకీయ పార్టీలు గాని పట్టించుకోవు. అందుకే మేమూ వారిని పట్టించుకోం. మాకు ఏ రాజకీయాలూ వద్దు' అనుకునే 'మేధావి' వర్గం ఒకటుంది. వీరంతా మొదట్లో ఆధార్‌ను స్వాగతించారు. ఈ దెబ్బతో అమెరికా లాగా మన దేశమూ ఎదిగిపోతుందని సంబరపడ్డారు. కానీ ఇప్పుడు ఆధార్ వలన వీరందరి వ్యక్తిగత సమాచారం కాస్తా నడిరోడ్డున పడుతోంది. ప్రైవసీ అనేదే లేకుండా పోతోంది. వీరందరికీ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఈ మెయిల్ అకౌంట్లు ఉన్నాయి. సెల్ఫోన్లో మన మిత్రుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వారితో జరిపిన సంభాషణలు రికార్డయి వున్నాయి. ఈ మెయిల్ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ రికార్డయి ఉన్నాయి. ఐతే దేనికదే విడివిడిగా ఉన్నాయి. మనం ఇ-బ్యాంకింగ్ చేస్తాం. దానికో పాస్వర్డ్ వేరే ఉంది. సెల్‌ఫోన్‌కి మరొకటి ఉంది. ఈ మెయిల్‌కీ పాస్వర్డ్ వేరుగా ఉంది. బయట వ్యక్తులు హ్యాకింగ్ చేసి వీటిలో దేనిలో చొరబడినా దానిని నివారించడానికి రెండో దొంతర సెక్యూరిటీ (బ్యాంక్ అకౌంట్‌కి ఒటిపి మాదిరిగా) ఉంది.
ఐతే ఇప్పుడు వీటన్నింటికీ ఆధార్‌తో అనుసంధానం చెయ్యాలన్నది ప్రభుత్వం వాదన. అదే గనుక జరిగితే విడివిడిగా మనకున్న బ్యాంకు ఖాతాలు, ఈ మెయిల్ ఖాతాలు, టెలిఫోన్ కాల్ రికార్డులు అన్నీ ఉమ్మడిగా ఆధార్‌తో అనుసంధానం అవుతాయి. 'దీనివలన నష్టం ఏమిటో' అని కొందరడగవచ్చు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయితే అంత వరకే నష్టం. ఈ మెయిల్ హ్యాక్ అయినా కొంత మేర నష్టం. అయితే వీటిలో దేనికదే ఒక రెండో దొంతర సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకున్న అకౌంట్లు. హ్యాకింగ్ అయినట్టు తెలియగానే సరిచేసుకుని జాగ్రత్త పడవచ్చు. కానీ ఆధార్‌తో అనుసంధానం కాగానే సమస్య వస్తుంది. ఆధార్ గనుక హ్యాక్ అయితే దాని ఆధారంతో ఈ ఖాతాలన్నీ హ్యాకింగ్ అయిపోతాయి. మన వ్యక్తిగత సమాచారం కాస్తా పబ్లిక్ అయిపోతుంది. పైగా ఆధార్‌కు రెండో దొంతర సెక్యూరిటీ ఏమీ లేదు.
'దమ్ముంటే ఎవరైనా నా ఆధార్‌ను హ్యాక్ చేయండి' అని ఇటీవల టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఛైర్మన్ ఆర్.ఎస్.శర్మ సవాలు చేశారు. వెంటనే ఒక బృందం ఆ సవాలును స్వీకరించి అతని ఆధార్‌ను హ్యాక్ చేసి, దాని నుండి అతని బ్యాంకు అకౌంట్‌నూ హ్యాక్ చేసింది. ఎటొచ్చీ ఈ బృందం వారు నీతికి కట్టుబడ్డ వాళ్లు గనుక, ఆధార్‌తో ప్రతి వ్యక్తిగత ఖాతాను అనుసంధానం చేయడం వలన ప్రైవసీ దెబ్బతింటుందని వాదిస్తున్న వాళ్లు గనక శర్మ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు తీసుకోలేదు. పైగా ఒక రూపాయి ఆయన ఖాతాకు జమ చేశారు. అంతటితో ఆగక ఈ వ్యవహారాన్ని పత్రికలలో బాహాటంగా ప్రకటించారు. అంతేకాక శర్మ తరచూ ఏ కంపెనీ విమానాల్లో ఎక్కడెక్కడికి ప్రయాణాలు చేస్తున్నారో ఆ వివరాలూ బహిర్గతం చేశారు. ఇలా శర్మ సవాలు ఆయనకే ఎదురు తిరిగింది. దాంతో సదరు హ్యాకింగ్ చట్ట విరుద్ధం అని హెచ్చరించారు. అందుకు తీవ్రమైన శిక్షలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాని హ్యాకింగ్ జరగకుండా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కానీ పౌరుల వ్యక్తిగత సమాచారం రోడ్డున పడకుండా భద్రంగా కాపాడుతాం అని గాని మనకి ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఎలా ఇస్తారు?
కంప్యూటర్లలో, ఇంటర్నెట్లో నిర్మించుకున్న ఈ రహస్య వ్యవస్థ మానవులు రూపొందించినదే. దీనిని హ్యాకింగ్ చేసే విజ్ఞానమూ మానవులదే. 'శత కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు' అని ఊరికే అన్నారా! మనకంటే ఎంతో పటిష్టమైనది అమెరికన్ రక్షణ వ్యవస్థ (నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ). దానికే కన్నం పెట్టి డేటా అంతా దొంగిలించగలిగాడు స్నోడెన్. మన కన్నా ముందు ఇతర దేశాలు ఈ ఆధార్ తరహా పద్ధతులను తమతమ దేశాలలో అమలు చేయాలని మొదలు పెట్టినా, చేతులు కాలాక ఆ ఆలోచననే విరమించుకున్నాయి. అయితే మన ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. ఎందుకు? మన సమాచారం మనకు తెలియకపోయినా పరవాలేదు గాని. మన పెద్దన్న ట్రంప్‌కు ఎప్పటికప్పుడు తెలియాలికదా? ఆ పెద్దన్న కనుసన్నల్లో మెలిగే మన ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేయకుండా ఉండగలదా?
ఎవరెన్ని అభ్యంతరాలు పెట్టినా అవి సహేతుకమైనవే అయినా వాటిని పరిగణనలోకి తీసుకోగలదా? ఇది మోడీ ప్రభుత్వమండీ బాబూ!