- ఎంవిఎస్ శర్మ
'అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదు' ఇది సామెత. దీనిని మన ప్రభుత్వాలు అక్షారాలా పాటిస్తున్నాయన్నది ఈ నెల 8వ తేదీన ఢిల్లీ హైకోర్టు ధృవీకరించింది. ప్రజలకు తిండిగానీ, బతుకుతెరువుగాని కల్పించలేని ప్రభుత్వానికి యాచకులను నిషేధించే అధికారం ఎక్కడుంది? అని హైకోర్టు ప్రశ్నించింది. దేశ రాజధానిలో 'భిక్షాటన'ను నేరంగా ప్రకటిస్తూ చేసిన చట్టాన్ని కోర్టు కొట్టివేసింది.
దేశ రాజధానిలో గానీ, ప్రధాన నగరాల్లో గానీ, ముఖ్యమైన టూరిస్టు ప్రాంతాల్లో కానీ ముష్టి వాళ్లు కనపడితే మన పరువు ఏమౌతుంది? విదేశీయులు ముందు మన ప్రతిష్ట దెబ్బతినిపోదా? ఇదీ మన పాలకుల బాధ. ప్రపంచ దేశాలన్నీ తిరిగి 'భారత్ వెలిగిపోతోంది', 'అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది', 'మేక్ ఇన్ ఇండియా', 'వ్యాపార సౌలభ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో మనమే నెంబర్ వన్' అని - రోజూ చెప్పుకుని తిరిగే మన నేతలకు ముష్టి వాళ్లు ఓ తలనొప్పిగా, అవమానంగా కనపడుతున్నారే తప్ప తమ పాలనా వైఫల్యంగా కనపడటం లేదు. ఇంట్లో చెత్త కనపడితే తుడిచి అవతల పారేసినట్టు ముష్టి వాళ్లు కనపడితే తరిమేయాలి అని అనుకుని చట్టాలు చేస్తున్నారే తప్ప భిక్షాటన సమస్య మూలంలోకి పోవడమే లేదు.
ప్రాచీన కాలంలో బౌద్ధమతం మన దేశంలో విస్తారంగా వ్యాపించింది. బుద్ధుడు భిక్ష పాత్ర చేపట్టి యాచన చేసి జీవించాడు. బౌద్ధ మతాన్ని ప్రచారం చేసే భిక్షువులంతా యాచన ద్వారా తమకు అవసరమైనంత భిక్షను మాత్రమే స్వీకరించి జీవించాలని నిర్దేశించాడు. సమాజంలో అంతవరకూ శ్రమజీవులు ఉత్పత్తి చేసిన సంపదను పాలకులు, అగ్రవర్ణ పురోహితులు బలవంతంగా, ఆ శ్రమ జీవుల అనుమతితోగానీ, ఇష్టాయిష్టాలతో గాని నిమిత్తం లేకుండా గుంజుకునే విధానమే ప్రబలంగా ఉండేది. బుద్ధుడి ప్రవేశం, పాలక అగ్రవర్ణ పెత్తం దారీ దోపిడీని శక్తివంతంగా సవాలు చేసింది. శ్రమ జీవుల్లో మెజారిటీ బౌద్ధం స్వీకరించారు. పాలకులూ క్రమంగా ప్రజల్ని అనుసరించారు. దీంతో పురోహిత బ్రాహ్మణ వర్గానికి పెత్తనం లేకుండా పోయింది. దానితో పాటు ఆదాయం పోయింది. అప్పటి నుంచి బ్రాహ్మణులు కూడా 'యాయనారం' (భిక్షాటనకు మరో పేరు) తమ కుల వృత్తిగా చేపట్టారు. క్రమంగా తిరిగి ఇతరుల శ్రమ ఫలితాన్ని ఏ కష్టమూ లేకుండానే స్వంతం చేసుకోవడం ప్రాంరభమైంది.
ఈ విధంగా మన గతంలో బౌద్ధ భిక్షువులు గాని, బ్రాహ్మణ కులంలో కొందరు గాని యాచక వృత్తిని చేపట్టారు. శ్రమజీవులు-రైతులు గాని, చేతి వృత్తుల వారు గాని దానం చేశారే తప్ప ఎప్పుడూ యాచన చెయ్యలేదు. ఈ నాటికీ బాగా వెనకబడ్డాయి అనుకున్న గిరిజన ప్రాంతంలో యాచకులుగా ఒక్క గిరిజనుడూ నాకు కనపడలేదు.
మరి ఈ రోజు భిక్షకులు ఎందుకు పెరుగుతున్నారు?
స్వాతంత్య్రానికి మునుపు బ్రిటీష్ వారి పెత్తనం చలామణి అయిన కాలంలో గ్రామీణ ప్రాంతంలో చేతి వృత్తులు, వ్యవసాయం విధ్వంసం అయ్యాయి. కరువు, కాటకాలు కోట్లాది మందిని బలి తీసుకున్నాయి. ఇంకో వైపు ఐరోపా నుండి వచ్చి పడిన దిగుమతులు ఇక్కడ జనానికి పని లేకుండా చేశాయి. బతుకుతెరువు వెతుక్కుంటూ కొద్ది మంది ఇతర దేశాలకు వలస పోయారు. అత్యధికులు ఎక్కడికీ పోలేక పోయారు. మానవాభివృద్ధిలో ఏ సంబంధమూ లేని పెట్టుబడిదారీ మార్కెట్ విస్తరణ బ్రిటీష్ పాలకుల హయాంలో మన దేశంలో విచ్చలవిడిగా జరిగింది. అది కోట్లాది మందిని బలి తీసుకుంది. యాచకులు ఈ కాలంలోనే ఇబ్బడిముబ్బడిగా పెరిగారు.
స్వతంత్రం వచ్చాక ఈ పరిస్థితి మారుతుందని ఆనాటి స్వాతంత్య్ర సమర యోధులు ఆశించారు. కానీ ఏడు దశాబ్దాల అనంతరం కూడా పరిస్థితి మారలేదు. అందుకే పేదరికం పెరుగుతోంది. ఉపాధి అవకాశాలు మృగ్యం అవుతున్నాయి. గ్రామాలలో వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. చేతి వృత్తుల మనుగడ నానాటికీ ప్రశ్నార్థకమౌతోంది. గ్రామాల నుండి పట్టణాలకు వలస వచ్చే వారి సంఖ్య అనేక రెట్లు పెరిగింది. పట్టణాలకు వలస వచ్చిన వారిలో చాలా మందికి ఉపాధి దొరకడం లేదు. మరి స్వగ్రామంలోనూ బతుకుతెరువు లేక, పట్టణాలలోనూ బతికే దారి కనపడకపోతే వీరంతా ఏం కావాలి? అందుకే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారూ పెరుగుతున్నారు. అంతకన్నా ఎక్కువగా యాచకులూ పెరుగుతున్నారు.
భూ పంపిణీ జరిగి, నదీ జలాల సద్వినియోగం దానికి తోడైతే గ్రామ సీమలలో కోట్లాది మందికి ఉపాధి లభించేది. దాంతోపాటు చేతి వృత్తులకు మార్కెట్ కూడా ఉండేది. గ్రామ సీమలలో ఈ విధంగా ఉత్పత్తి అభివృద్ధి జరిగి ఉంటే పట్టణాలలో డిమాండ్ పెరగడానికి కూడా అది దోహదపడి ఉండేది. కాని మన పాలకులు ఏనాడూ ఈ దిశగా అడుగులు వెయ్యలేదు. బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలలో, తెలంగాణ జిల్లాలలో కమ్యూనిస్టులు భూమి కోసం చేసిన పోరాటాలు మాత్రమే ఈ సమస్యను ముందుకు తెచ్చాయి. తర్వాత కాలంలో కమ్యూనిస్టులు అధికారం నెరిపిన రాష్ట్రాలలో పరిమితంగానైనా భూ పంపిణీ చేపట్టారు. అది మినహా దేశంలో ఎక్కడా భూపంపిణీ పెద్దగా జరగలేదు. పట్టణాల్లో కొన్ని పెద్ద, చిన్న పరిశ్రమలు వచ్చినా, వాటిలో వచ్చిన ఉపాధి అవకాశాలు పట్టణ జనాభాలో వచ్చిన పెరుగుదలకు తగినట్టుగానైనా లేవు.
గత మూడు దశాబ్దాలుగా అమలు జరుగుతున్న ఉదారవాద ఆర్థిక విధానాలు రివర్సులో పేదల భూముల్ని కాజెయ్యడం మొదలెట్టాయి. పరిశ్రమల పేరుతో, అభివృద్ధి పేరుతో లక్షల ఎకరాలు రైతుల నుండి, గ్రామీణ పేదల నుండి జారిపోయి స్వదేశీ, విదేశీ కంపెనీల పరం అవుతున్నాయి. అదే సమయంలో భూములు కోల్పోయిన వారికి బతుకుతెరువు కల్పించే ప్రత్యామ్నాయ విధానాలేవీ అమలు కావడం లేదు. వామపక్షాల ఒత్తిడితో ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం వచ్చాయి. కానీ 2009 తర్వాత క్రమంగా ఈ చట్టాలు నీరు కారిపోవడం మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా మోడీ హయాంలో ఈ దిగజారుడు మరీ ఎక్కువైంది. దీనివలన గ్రామీణ ప్రాంతంలో గిరిజన ప్రాంతాలలో బతుకు మరీ దుర్భరం అవుతోంది.
చంద్రబాబు గాని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు గాని పేదల సంక్షేమం గురించే మాట్లాడుతుంటారు. గ్రామీణ పేదల సాధికారత కోసం స్కీములు ప్రకటిస్తూ ఉంటారు. వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులకు- వితంతువులకు పెన్షన్లు ప్రకటిస్తూ ఉంటారు. కానీ ఆ రూపంలో పేదలకు చేరే సొమ్ము చాలా స్వల్పం. అది కూడా క్రమం తప్పకుండా ప్రతి నెలా రాదు. ఎప్పుడైతే పనులు దొరకని వారి సంఖ్య పెరుగుతుందో అప్పుడు సంక్షేమ పథకాల కోసం తాపత్రయమూ పెరుగుతుంది. పెట్టుబడిదారులకు మాత్రం ఈ పరిస్థితి బహు గొప్ప లాభదాయకంగా ఉంటుంది. అతి చవుకగా వాళ్లు కార్మికుల శ్రమని కొనుక్కోగలుగుతారు. కార్మికులు తమ పరిస్థితులు, వేతనాలు, హక్కులు మెరుగుపడాలని పోరాడే శక్తిని కోల్పోతారు. ఇదే మోడీ 'మేకిన్ ఇండియా' ప్రచారం వెనుక వాస్తవ చిత్రం.
ఈ విధానాల పర్యవసానంగా యాచనకు దిగేవారి సంఖ్య కూడా వేగంగా పెరిగిపోతూ ఉంది. పాలకులు మాత్రం ఇది తమ విధానాల వైఫల్యం అని అంగీకరించరు. సెన్సెక్స్ సూచిక పెరుగుదలనో, జిడిపి అభివృద్ధి రేటునో తమ విధానాల విజయానికి సంకేతంగా చెప్పుకు తిరుగుతారు. 'మూడీ' వంటి విదేశీ కంపెనీలు ఇచ్చే రేటింగ్‌లు (ఆంధ్రప్రదేశ్‌కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్‌వన్ ర్యాంకు ఇచ్చినవి ఇలాంటి కంపెనీలే) చూపించి గొప్పలు పోతారు.
సరళీకరణ విధానాలు ఎంత వేగంగా అమలు జరిగితే అంత వేగంగా యాచకులూ పెరుగుతారు. ఈ విధానాలను ఓడించి, ప్రజలకు బతుకుతెరువు కల్పించే భూపంపకం, గ్రామీణ పరిశ్రమల స్థాపన, విద్య వైద్య సేవల విస్తరణ, గృహ నిర్మాణం వంటి ప్రత్యామ్నాయ విధానాలను చేపడితే అప్పుడు మనకు పరిష్కారం లభిస్తుంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైకి చూస్తే 'భిక్షాటన' నిషేధానికి సంబంధించినదిగా కనపడినా, వాస్తవానికి అది సరళీకరణ విధానాలు విఫలమయ్యాయని స్పష్టం చేసిన తీర్పు. సరళీకరణ విధానాలను టాంటాం చేసే ప్రధాన స్రవంతి మీడియా దీనిని కావాలనే పట్టించుకోలేదు. కానీ సమాజాభ్యుదయం కోరుకునే వారు ఉపేక్షించగలరా?
భిక్షాటన-సరళీకరణ
