స్వాతంత్య్రం ఓ అందని ద్రాక్ష
పుల్లగా ఉండటం సహజం
నేడది చేదుగానూ మారింది
ఓ తెగిన గాలిపటంలా
మువ్వన్నెలతో రెపరెపలాడి
అందనంతగా పైకి పైపైకి
ఎగురుతూ ఊరిస్తోంది
వివక్షతో విపరీత విన్యాసాలతో
స్వైరవిహారం చేస్తూనే ఉంది
ఊరించే నాయకుల మాటలు
ఎర్రకోటను కాలుష్యంతో నింపి
మనసులను మనుషులను
ఇష్టారాజ్యంగా వేరు చేస్తూ
స్వేచ్ఛగా ఏలుబడి కానిస్తోంది
భావాలను భావనలను భంగపరచి
ఇంపైన మాటలతో మభ్యపెట్టి
యథేచ్ఛగా తన పని కానిస్తోంది
ఏడు పదులను తిరగదోడి
విచ్చలవిడిగా మారి
శతాబ్దాలు వెనక్కి పోయి
మనువునే మనువాడి
విమానాల్లో ఎంగేజిమెంట్ కానిచ్చి
కట్టుబాటు లేని మన నల్ల దొరల
స్వయం సమృద్ధ విధానం
డెబ్భై మూడేళ్ళ ముదుసలికి
యోగా నేర్పించి ప్రాణయామంతో
సుతిమెత్తగా నిద్రబుచ్చుతోంది
- జంధ్యాల రఘుబాబు
9849753298
స్వాతంత్య్రం నిదరోతోంది
