నాలుగేళ్లుగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు, పేర్లలో తప్పొప్పులు సరిదిద్దుకునేందుకు ఎంతోమంది పేదలు, వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఇప్పటి వరకు ఎటువంటి మార్పులు, చేర్పులూ జరగలేదు. పైగా ఆ దరఖాస్తులను బుట్ట దాఖలు చేస్తూ, డిసెంబర్ 31 లోగా 'గ్రామ దర్శిని' కి హాజరై, అక్కడ రేషన్ కార్డుల్లోని మార్పుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అప్పుడు కాని పని ఇప్పుడు, అదీ ఒక్కరోజులో ఎలా అవుతుంది? ఆ మార్పులు చేర్పులూ జరిగే సరికి ఎన్నికలు రానే వస్తాయి. అయినా ఆ సభలు, ఏ రోజు, ఎక్కడ జరుగుతాయో తెలుసుకోవాలి. అధికారుల ఊకదంపుడు ప్రసంగాలు పూర్తయిన చివరి సమయంలో దరఖాస్తులు అందించాలి. అవి వారికి చేరతాయో, చెత్తకుండీల్లో పడతాయో ఎవరికి తెలుసు? ఎన్ని గ్రామసభల్లో అభ్యర్థుల దరఖాస్తులు చెత్తడబ్బాల్లో దర్శనమివ్వలేదు! అయినా ఇప్పటివరకూ లేని చురుకు, ఇప్పుడెందుకు? పేదల ఓట్ల బ్యాంకులు లెక్కించేందుకు, 'గ్రామ దర్శని'కి సభికుల తరలింపు కోసమేనా! లేకుంటే, ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, తప్పులు దిద్ది, అర్హులకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చెయ్యాలి.
- చాకలకొండ శారద, కావలి.