కాశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనే విషయంలో కేంద్రంలోని బిజెపి సర్కారు కావాలనే తాత్సారం చేస్తోందనడానికి అది ఎంచుకున్న వైఖరే అద్దంపడుతోంది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ ముజఫర్ ఎన్కౌంటర్, అనంతర పరిణామాలతో గడచిన మూడు వారాలుగా కాశ్మీర్లో పరిస్థితులు విషమించాక కూడా రాజకీయ చర్చలపై కేంద్రం నాలుక చప్పరించడం ఆందోళనకరం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున కాశ్మీర్ కల్లోలంపై రాజ్యసభలో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టినప్పుడు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు బాధ్యత నుంచి తప్పుకున్నట్లు స్ఫురిస్తున్నాయి. కాశ్మీర్లో నెలకొన్న అశాంతికి పొరుగు దేశం పాకిస్తానే కారణమంటూ ప్రభుత్వపరంగా తాము చేపట్టాల్సిన చర్యలను తక్కువ చేసి చూపడం అభ్యంతరకరం. కాశ్మీర్లో అల్లర్లు సృష్టించేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ కాచుక్కూర్చుంటుందన్న సంగతి తెలిసిందే. పాక్ కుట్రలను అందరూ ఖండించాల్సిందే. ఇదే సమయంలో పాక్‌పై నిందలు వేసి కేంద్రం కాలక్షేపం చేయడం దారుణం. చాలా రోజులుగా కాశ్మీర్లో అసాధారణ పరిస్థితులు నెలకొనగా కేవలం అదనపు రక్షణ బలగాలను పంపి ప్రజల నిరసనలను తుపాకులు, లాఠీలు, బాష్పవాయువు గోళాలతో అణచడంపైనే శ్రద్ధ పెట్టింది మినహా సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, ఏ చర్యలు చేపట్టి సాధారణ స్థితిని నెలకొల్పాలనే కీలక అంశాలను దాటవేసింది. పైగా పార్లమెంట్లో రాజ్‌నాథ్ చేసిన ప్రకటన ప్రజలను కవ్వించే విధంగా ఉంది. అల్లర్లలో జవాన్లు చనిపోతే ఎక్కడైనా సంబరాలు చేసుకుంటారా అని ఎద్దేవా చేయడం కచ్చితంగా సమస్యను పక్కదారి పట్టించడానికే. అక్కడికి తమకే దేశభక్తి ఉంది కాశ్మీరీలకు లేదు అనే విధంగా సున్నిత వ్యవహారంపై దేశ అత్యున్నత చట్టసభ వేదికపై బాధ్యతగల హోం మంత్రి వ్యాఖ్యానించడం ఘోరం. అల్లర్లలో పౌరులెంత మంది గాయపడ్డారో సుమారు అంతే మొత్తంలో సైనికులూ గాయపడ్డారని బ్యాలెన్స్ షీట్ మాదిరి అంకెలు వల్లించడం సైన్యం చర్యలను సమర్ధించుకోవడానికే తప్ప సమస్య తీవ్రతను తగ్గించడానికి ఎంత మాత్రం కాదు.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే ప్రయోజనం జరుగుతుందంటూ కాశ్మీర్ ఎన్నికల్లో ప్రధాని మోడీ తెగ ఊదరగొట్టారు. కాశ్మీరీ ప్రజలు బిజెపికి వ్యతిరేకంగా లౌకిక పార్టీలకు మెజార్టీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పిడిపి-బిజెపి సర్కారు జమ్మూ కాశ్మీర్లో ఏర్పడింది. ముఫ్తి మహ్మద్ సయీద్ సిఎంగా ఉన్న సమయంలో రాష్ట్ర అభివృద్ధికి బిజెపి సహకరించకపోగా ప్రజల మధ్య మత చిచ్చు పెట్టేందుకు అనేక చర్యలకు ఒడిగట్టింది. సయీద్ మరణం తర్వాత కొన్ని మాసాలపాటు మెహబూబా ముఫ్తి బిజెపితో సర్కారు ఏర్పాటు చేయడానికి తటపటాయించారు. ఎట్టకేలకు పిడిపి-బిజెపి కలిసి సర్కారును పునరుద్ధరించాయి. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపియే అధికారం చెలయిస్తూ కూడా కాశ్మీర్లో శాంతి స్థాపనకు రాజకీయ పరిష్కారం దిశగా అడుగులు ముందుకు వేయకపోడానికి కారణమేంటి? ఢిల్లీలో, కాశ్మీర్లో ఒకే పార్టీ సర్కారు కావాలన్న ఎన్నికల నాటి మోడీ బాసలేమయ్యాయి? ఎన్డిఎలో, కాశ్మీర్లో అధికారం పంచుకున్న భాగస్వామ్య పార్టీలు బిజెపి- పిడిపి పార్లమెంట్ సాక్షిగా కీచులాడుకుంటూ అమాయక ప్రజలను బలిదీసుకుంటున్నాయి. బుర్హాన్ అంతానికై చేపట్టిన ఆపరేషన్ సమాచారం సిఎం ముఫ్తికి తెలీదంటున్నారు పిడిపి ఎంపీలు. నిరసనకారులను నిలువరించడంలో ముఫ్తి మెతకగ్గా ఉన్నారని బిజెపి ఎంపీలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధే తమ పొత్తుకు ప్రాతిపదిక అని చెప్పుకుంటున్న రెండు పార్టీలూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుంటే అభివృద్ధికి, శాంతికి ఆస్కారం ఉంటుందా?
కాశ్మీర్ సమస్యను కేవలం శాంతి, భద్రతల కోణంలోనే ప్రభుత్వాలు చూసినంతకాలం పరిష్కారం లభించదు. పలు సున్నిత సమస్యల పరిష్కారంలో ప్రపంచ అనుభవం ఇదే. అయినా ఈ పాఠాన్ని బిజెపి తలకెక్కించుకోవట్లేదు. కనీసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆలోచన నిన్నటివరకు చేయకపోవడం అవకాశవాదానికి పరాకాష్ట. పార్లమెంట్, రాజకీయపార్టీలు, యావత్ భారత జాతి కాశ్మీర్ ప్రజలకు అండగా ఉందన్న భరోసా ఇచ్చినప్పుడే ఆందోళన చెందుతున్న అక్కడి ప్రజల్లో విశ్వాసం నెలకొంటుంది. అందుకు విశాల చర్చలే ఏకైక మార్గం. కాశ్మీర్లో అన్ని పార్టీలు, గ్రూపులతోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం కల్పించాలి. గతంలో 2010లో భయంకర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అన్ని పార్టీల నేతలతో పార్లమెంటరీ బృందం బాధిత ప్రాంతాల్లో పర్యటించింది. హురియత్ వంటి గ్రూపులతో భేటీల తర్వాత మామూలు స్థితికి వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు జరగాలి. పార్లమెంట్లో ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఇప్పటికైనా ముఫ్తి సర్కారు గురువారం రాష్ట్ర స్థాయిలో ఆల్‌పార్టీ మీటింగ్ నిర్వహించడం మంచి పరిణామం. అఖిల పక్ష సమావేశానికి ఒకటి రెండు పార్టీలు హాజరుకావడం, కాకపోవడం ప్రధానం కాదు. అన్ని పక్షాలను శాంతి క్రమంలో ఇమడ్చడం ముఖ్యం. కాశ్మీర్ యువత ఉగ్రవాదం బాట పట్టడానికి మూల కారణాలను కనుగొనాలి. ఉపాధి, మౌలిక సదుపాయాలు కల్పించి కాశ్మీర్ సమగ్రాభివృద్ధికి పార్టీలు, ప్రభుత్వాలు కృషి చేయాలి.