ఎలాంటి సంస్థాగత ఏర్పాటూ లేకుండా పోయింది. కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్న వనరులు తక్కువగా ఉండటమే కాక దేశ ఆర్థిక విధానానికి సంబంధించి తమ అభిప్రాయాలను నివేదించటానికి ఎటువంటి వేదికా లేకుండా పోయింది.
కేంద్రం నుంచి రాష్ట్రాలకు విడుదలయ్యే నిధులలో గణనీయమైన తరుగుదలను మనం మోడీ పాలనలో చూస్తున్నాము. అంతేగాక జాతీయ ఆర్థిక విధానం గురించి రాష్ట్రాలకు తమ అభిప్రాయాలను వెల్లడించే సామర్థ్యం కూడా తగ్గిపోయింది. అలాంటి కేంద్రీకరణ మోడీ పాలనకు చెందిన ప్రధాన ముద్రలలో ఒకటిగా ఉన్నది. రాష్ట్రాలకు అందవలసిన వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచాలనే 14వ ఆర్థిక సంఘం సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదించటం వల్ల ఈ వాస్తవం మరుగున పడింది. దీంతో రాష్ట్రాల వాటా తగ్గకపోగా పెరిగిందనే భావం ఏర్పడింది. రాజ్యాంగబద్ధంగా ఆమోదించ వలసిన సంఘం సిఫార్సులను ఎన్డిఎ ప్రభుత్వం ఆమోదిస్తూ ఆ అవసరాన్ని సద్గుణంగా మార్చి తాను 'సహకార సమాఖ్య విధానం' శకంలోకి ప్రవేశింపజేశానని ప్రగల్భాలు పలుకుతోంది.
తప్పుతోవ పట్టించే భావం
అయితే రాష్ట్రాలకు బదిలీ అయ్యే నిధులు పెరిగాయనే భావన పూర్తిగా తప్పుతోవ పట్టించేదిగా ఉంది. రాష్ట్రాలకు ఆర్థిక సంఘం ద్వారా బదిలీ అయ్యే నిధులు పెరిగినప్పటికీ అన్ని బదిలీలూ ఆర్థిక సంఘం ద్వారా జరగవు. నిజానికి మూడు మార్గాల ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు బదిలీ అవుతాయి. మొదటిది, ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు జరిగేవి. రెండవది, ప్రణాళికా సహాయం. ఇది గతంలో ప్రణాళికా సంఘం ద్వారా జరిగేది. మూడవది, విచక్షణాధికారాలను ఉపయోగించి శాఖల ద్వారా అయ్యే బదిలీలు. ప్రస్తుతం ఆర్థిక సంఘం తన పరిధిలోని నిధుల విషయంలో రాష్ట్రాల వాటాను పెంచినప్పటికీ ఈ పెరుగుదలనే సాకుగా చూపి రాష్ట్రాలకు అందవలసిన ప్రణాళికా సహాయంలో కోత విధిస్తున్నది. దీనితో ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులను పెంచినప్పటికీ స్థూల జాతీయోత్పత్తిలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు జరిగే నిధుల బదిలీ శాతం గణనీయంగా తగ్గిపోయింది.
సెంటర్ ఫర్ బడ్జెట్ అండ్ గవర్నెన్స్ అకౌంటబిలిటీ(సిబిజిఎ)కి చెందిన సోనా మిత్ర లెక్కలననుసరించి స్థూల జాతీయోత్పత్తిలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అవుతున్న మొత్తం నిధుల శాతం కొంత కాలంగా క్రమేణా తగ్గిపోతున్నది. 2010-11లో 6.1 శాతంగా ఉన్న ఈ బదిలీలు ఆ తరువాత మూడు సంవత్సరాలలో 6.1 శాతం, 5.8 శాతం, 5.6 శాతంగా ఉన్నాయి. అయితే 2014-15 కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల వాటా 6.1 శాతానికి పెరిగింది. 2015-16కు ఎన్డిఎ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంచనాలోనే రాష్ట్రాల వాటా 5.8 శాతానికి కుదించబడింది. గత సంవత్సరం బడ్జెట్లో పొందుపరిచిన 6.1 శాతం సవరించిన అంచనాలో 5.4 శాతానికి తగ్గించబడినట్లు, ఈ సంవత్సరం బడ్జెట్లో తక్కువగా కేటాయించిన 5.8 శాతం మరికొంత తగ్గించబడే అవకాశముంటుంది. ఎందుకంటే చాలామంది పరిశీలకులు భావిస్తున్నట్లు ఈ సంవత్సర కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ ఆదాయాన్ని అతిగా అంచనా వేశారు. మరో విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకిచ్చే 'ప్రణాళికా సహాయం' ఆర్థిక సంఘం పెంచిన కేటాయింపు కంటే ఎక్కువగా తగ్గించబడుతుంది. కాబట్టి రాష్ట్రాల వనరుల పరిస్థితి గతం కంటే దిగజారే అవకాశముంటుంది. దీనికి తోడు మరో ప్రక్రియ కొనసాగుతోంది. అదేమంటే ప్రణాళికా సంఘాన్ని పూర్తిగా రద్దుచేయటం. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ ప్రణాళికా వనరులను రాష్ట్రాలకు బదిలీ చేయదు. నిజానికి దానికి ఎలాంటి వనరులూ అందుబాటులో ఉండవు. ఆదిలో ఇది ప్రభుత్వం కోసం ఏర్పాటైన ఒక మేధో కేంద్రంగా ఉంటుందని భావించారు. కానీ దీనికి ప్రస్తుతం ఆ పాత్ర కూడా లేదు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, సభ్యుల హోదా బాగా తగ్గించ బడింది. హోదాలను పట్టించుకునే అధికారులు ఈ సంస్థను లెక్కచేయటం లేదు. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సెక్రటరీలు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పిలిచే సమావే శాలకు హాజరుకావటానికి ఆసక్తి చూపటంలేదు. వారికి బదులుగా జూనియర్ అధికారులు ఈ సంస్థ సమావేశాలకు హాజరవు తున్నారు. రాష్ట్రాలకు బదిలీఅయ్యే ప్రణాళికా నిధులను ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. ఇక్కడే కథంతా ఉన్నది.
ప్రణాళికా సంఘం ఒకవిధంగా కేంద్ర ప్రభుత్వ శాఖ అయినప్పటికీ దాని సుదీర్ఘ చరిత్ర నుంచి ఎంతో కొంత స్వతంత్రతను పొందేది (స్వాతంత్య్రానికి పూర్వం జాతీయ ఆర్థిక సంఘం పేరుతో ఒక సంస్థ ఉండేది). దాని ఏర్పాటు వెనుకగల దార్శనికత వల్ల అనేకమంది మహామహులు ప్రణాళికా సంఘానికి తమ సేవలందించారు. అలాంటివారిలో పిసి మహలనోబిస్ నుంచి డిఆర్ గాడ్గిల్, సుఖమోరు చక్రవర్తి వరకు ఉన్నారు. దీనికి ఒక ప్రభుత్వ శాఖకున్న స్వభావం ఉన్నప్పటికీ కొంత మేరకు స్వతంత్రతను అనుభవించింది. దీనికి రెండు ముఖ్యమైన అంతస్సూచనలున్నాయి. మొదటిది, అంతర్జాతీయ ద్రవ్య నిధి-ప్రపంచ బ్యాంకుకు చెందిన ఉద్యోగులతో నిండిన ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఈ సంస్థ ప్రతివాదిగా ఉండేది. ఎంతోకొంత స్వతంత్రత గల ఈ సంస్థ సామ్రాజ్యవాదం, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్లకు కంటగింపుగా ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అలాంటి సంస్థను సృష్టించింది భారత్ ఒక్కటే కాదు. వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన అనేక తృతీయ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు సోవియట్ అనుభవంతో ఉత్తేజితమై ఏదో ఒక విధమైన 'ప్రణాళిక'ను రూపొందించుకున్నాయి. ఈ ఆర్థిక వ్యవస్థలపై నయా ఉదారవాదాన్ని రుద్దాలంటే ఈ ఉత్తేజాన్ని కూకటివేళ్ళతో పెకలించాలి. అలాంటి 'ప్రణాళికా' సంఘాలను రద్దు చేయాలి. నిర్ణయాలు తీసుకోగలిగే అలాంటి సంస్థల నుంచి అధికారాన్ని అర్థిక మంత్రిత్వ శాఖకు, కేంద్ర బ్యాంకులకు మార్చాలి. ఎందుకంటే వీటిలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థకు చెందిన ఉద్యోగులు ప్రధాన బాధ్యతల్లో ఉంటారు కాబట్టి. అందుకే ప్రతి దేశంలోనూ ప్రణాళికా సంఘం, ఇతర మంత్రిత్వ శాఖల కంటే ఆర్థిక శాఖకు అధిక ప్రాధాన్యత ఇవ్వటంతో అది అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ఉద్యోగులతో నింపబడిన ఒక సూపర్ మంత్రిత్వ శాఖగా మార్చబడుతుంది.
ఆఫ్రికా, ఇతర దేశాలలో తెలిగ్గా జరిగిన ఈ మార్పు సుదీర్ఘ చరిత్ర గలిగిన ప్రణాళికా సంఘం ఉన్న భారత్లో జరగటం అంత తేలిక కాదు. ప్రపంచ బ్యాంకులో పనిచేసిన ఒక కరడుగట్టిన నయా ఉదారవాదిని ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడిగా నియమించి మన్మోహన్ సింగ్ తన చాణక్యాన్ని ప్రదర్శించారు! అయితే అది కూడా సరిపోలేదు. కాబట్టి, మోడీ అన్నిటినీ విడిచిపెట్టి ప్రణాళికా సంఘాన్నే పూర్తిగా రద్దు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి కోరుకున్నదదే. నీతి ఆయోగ్ కేవలం ఒక ముసుగు మాత్రమే అన్న విషయం రోజురోజుకూ బయటపడుతున్నది. అసలు లక్ష్యం ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి మెప్పుపొందటమే. అది నెరవేరింది. అలాంటి సంస్థ అస్తిత్వంలో ఉండటంతో జరిగిందేమంటే అది కేంద్రానికి, రాష్ట్రాలకూ మధ్య మధ్యవర్తి పాత్రను నిర్వహించింది. తమ వార్షిక ప్రణాళికలను అంతిమంగా రూపొందించుకోవటానికి రాష్ట్రాలు ప్రణాళికా సంఘంతో సమావేశమై విధాన సంబంధిత విషయాలను చర్చించేవి. ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న జాతీయ అభివృద్ధి మండలి(ఎన్డిసి)కి పంచవర్ష ప్రణాళికలను రూపొందించే అధికారం ఉండేది. ఈ మండలికి ప్రణాళికా సంఘం జవాబుదారీగా ఉండేది. ఎన్డిసి, ప్రణాళికా సంఘాల యంత్రాంగంలో రాష్ట్రాలకు సమిష్టిగానూ, విడివిడిగానూ కూడా ప్రధాన ఆర్థిక విధానాల గురించి అభిప్రాయాలు వెలిబుచ్చే అవకాశం ఉండేది. లక్ష్యపెట్టినా, పెట్టకపోయినా ఈ అభిప్రాయాలను కేంద్రం వినవలసి వచ్చేది. ఈ యంత్రాంగాన్నంతా రద్దుచేసి రాష్ట్రాలకు ప్రణాళికా సాయాన్ని అందించే కర్తవ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్థిక మంత్రిత్వ శాఖకు అప్పగించటం వల్ల దేశ ఆర్థిక విధానాన్ని రూపొందించటంలో రాష్ట్రాల అభిప్రాయాలను నివేదించటానికి ఎలాంటి సంస్థాగత ఏర్పాటూ లేకుండా పోయింది. కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్న వనరులు తక్కువగా ఉండటమే కాక దేశ ఆర్థిక విధానానికి సంబంధించి తమ అభిప్రాయాలను నివేదించటానికి ఎటువంటి వేదికా లేకుండా పోయింది. కేంద్రంతో సంప్రదించటానికి వారికున్న ఏకైక మార్గం ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఈ శాఖను నిర్వహించే అధికార గణం ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధిలో పనిచేసిన మాజీలు. వీరు రాష్ట్రాల అభిప్రాయాలకు విలువనివ్వరు. నీతి ఆయోగ్ పాలక మండలి(ఇది ఎన్డిసిని స్థానభ్రంశం చేయగలదు)లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నందున ఆ సంస్థ సమావేశాలలో వీరి అభిప్రాయాలను తెలిపే అవకాశముంటుందని అనుకోవచ్చు. అయితే నీతి ఆయోగ్కే ప్రాధాన్యతలేనప్పుడు దాని పాలక మండలికి ఏమి విలువ ఉంటుంది.
పేదలను పూర్తిగా పిండేయడం
ఆ విధంగా మనం పెరుగుతున్న ఒక కేంద్రీకరణ ప్రక్రియను చూస్తున్నాము. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు అలాంటి కేంద్రీకరణను కోరుకుంటాయి. ఎందుకంటే ప్రధాన స్థానాలలో తమకు కావలసిన వారిని నియమించుకుని అవి అన్ని ప్రధాన నిర్ణయాలను నియంత్రిస్తాయి. ఇది రాష్ట్రాల అధికారాలు, హోదా, వనరుల కుదింపుకు గురయ్యాయనే దానికి ప్రతిబింబంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి ప్రధాన వనరుగా ఉన్న పన్నుల స్థానంలో ఇంకా స్పష్టతలేని సరుకుల, సేవల పన్ను(జిఎస్టి) విధానం వస్తే దేశమంతటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పన్ను రేటు విధించవలసివస్తుంది. అదే జరిగితే రాష్ట్రాలకు పన్నుల ద్వారా అదనపు వనరుల సమీకరణ దుస్సాధ్యమౌతుంది. రాష్ట్రాలు ఈ పన్ను రేట్లను ఆమోదించటం అనివార్యమౌతుంది కాబట్టి తమతమ పన్ను రేట్లను నిర్ణయించుకోవటం కుదరదు. ఏకీకృత 'జాతీయ మార్కెట్' పేరుతో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు మరింతగా కుదించబడతాయి. అంతకు ముందు అస్తిత్వంలో లేదన్నట్లుగా 'జాతీయ మార్కెట్'ను సృష్టించటమే జిఎస్టి లక్ష్యంగా ఉంటుంది.
ఈ కేంద్రీకరణకు విస్మరించరాని ఒక అంతస్సూచన ఉన్నది. సామాజిక, సంక్షేమ వ్యయాల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉండటం భారత్ ప్రత్యేకత. అవి ఎంత వరకు ఈ బాధ్యతను నెరవేరుస్తున్నాయనే విషయాన్ని పక్కనబెడితే ప్రజా సంక్షేమం రాష్ట్రాల అధికార పరిధిలో ఉంటుందని గమనించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు, వనరులు ఏ మాత్రం కోతకు గురైనా ప్రజా సంక్షేమంపై చేస్తున్న వ్యయం కుదింపబడుతుంది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు అదనపు నిధులను బదలాయించింది కాబట్టి సంక్షేమంపై చేసే వ్యయాన్ని రాష్ట్రాలే పెంచాలనే సాకుతో కేంద్రం తాను సంక్షేమంపై చేసే వ్యయాన్ని తగ్గించటం ఆశ్చర్యకరం. అయితే ఇప్పటికే పరిమిత వనరులతో సతమతమౌతున్న రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ వ్యయం కుదింపు వల్ల పెరిగే లోటును భర్తీచేసుకోజాలవు. దీని ప్రభావంతో పేదల జీవితాలు మరింతగా కుదేలవుతాయి. ఆ విధంగా కేంద్రీకరణ పెరగటం వల్ల పేదల బతుకులు మరింత దుర్భరంగా మారుతున్నప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలకనుగుణంగా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దటంలో కేంద్రీకరణను పెంచటం ఒక ఆవశ్యక భాగం.
- ప్రభాత్ పట్నాయక్