- వలలు, నైలాన్ దారం, ఎండు చేపలపై 12 శాతం పన్ను
- శ్రీకాకుళం జిల్లాలో 15 వేల కుటుంబాలపై ప్రభావం
'వదల బొమ్మాళీ.. నిన్నొదలా..! వస్తా.. వస్తా.. తప్పక వస్తా..!' అంటూ ప్రజల తలపై భారంగా ఉన్న వస్తు సేవల పన్ను (జిఎస్టి) భూతం మత్స్యకారలనూ వదల్లేదు. వేట సరిగా సాగక ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ పన్ను మరింత భారమైంది. జిఎస్టి అమలుతో మత్స్యకారులు రెండు రకాలుగా నష్టపోతున్నారు. ఒకపక్క పెరిగిన వలలు, వలల మెటీరియల్ ధరలు, మరోపక్క ఎండు చేపలను తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో వృత్తిని వదులు కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి :
ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన జిఎస్టితో వలలు, వలల మెటీరియల్ ధరలు బాగా పెరి గాయి. జిఎస్టి అమలు కాకముందు వలలపై పన్ను లేదు. జిఎస్టి అమలు ద్వారా వాటిపై ప్రభుత్వం 12 శాతం పన్ను విధించింది. ఒక డిస్కో వల గతంలో రూ.680 ఉండగా.. ప్రస్తుతం రూ.780కు చేరింది. వలల తయారీకి వినియోగించే నైలాన్ ధారం జిఎస్టికి ముందు కిలో రూ.160 ఉండేది. ప్రస్తుతం రూ.192కు చేరింది. వలల మరమ్మతులకు వినియోగించే ధారంపైనా ప్రభుత్వం 12 శాతం పన్ను విధించింది. గతంలో కిలో ధారం రూ.500 ధర ఉంటే.. ప్రస్తుతం రూ.560కు చేరింది. మత్స్యకారులు వినియోగించే తెరచాప, టార్ఫాలిన్ ధరలూ వాటి రకాలను బట్టి 18 శాతం పెరిగాయి.
15 వేల కుటుంబాలపై ప్రభావం
శ్రీకాకుళం జిల్లాలో చేపల వేటపై ఆధారపడి జీవించే కుటుంబాలు సుమారు 15 వేల వరకూ ఉన్నాయి. దీంతో ఇక్కడ వలల వినియోగం ఎక్కువగా ఉంది. మత్స్యకారులు కచ్చితంగా రెండేళ్లకొకసారి వలలను మారుస్తుంటారు. వేట సమయంలో రాళ్లకు, కర్ర దుంగలకు తగిలినా వలలు పాడవుతాయి. తుపాన్లు, సముద్రపు అలల ధాటికీ దెబ్బతింటాయి. కొత్తగా వలలు కొనుగోలు చేస్తున్న మత్స్యకారులు జిఎస్టి భారాన్ని చవిచూడాల్సి వస్తోంది.
గిట్టుబాటు కాని ఎండు చేపలు
మత్స్యకారుల నుంచి ఎండు చేపలను కొనుగోలు చేస్తున్న వ్యాపారుల నుంచి ప్రభుత్వం 12 శాతం పన్ను వసూలు చేస్తోంది. గతంలో కంటే ధర తగ్గించి కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారులు ఈ భారాన్ని తమపై వేసుకోకుండా మత్స్యకారులపైనే మోపుతున్నారు. కవ్వాల రకం ఎండు చేపలు కిలో గతంలో రూ.700 నుంచి రూ.800 ఉండేవి. మత్స్యకారుల నుంచి ప్రస్తుతం రూ.600కు మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కోనెం రకం చేప ధర గతంలో రూ.400 ఉండగా.. ప్రస్తుతం రూ.350కు పడిపోయింది. వంజరం చేపను గతంలో రూ.250కు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం రూ.150కు మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
కాలుష్య జలాలతో కుదేలు
జిల్లాలోని మందుల పరిశ్రమలు, పురుగు మందుల తయారీ పరిశ్రమలు తమ కాలుష్య వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా సముద్రంలోకి విడిచిపెడుతున్నాయి. దీంతో సముద్రంలోని మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేపలు, రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. తీరం నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్తేగానీ చేపలు, రొయ్యలు దొరకని పరిస్థితి నెలకొంది. చేపల వేట సక్రమంగా సాగక జిల్లా నుంచి వేలాది మత్స్యకార కుటుంబాలు ఏటా వలసబాట పడుతున్నాయి. జిల్లా నుంచి గుజరాత్లోని వీరావలి ప్రాంతానికి ఎక్కువగా వలస వెళ్తున్నారు. చెన్నరు, ముంబయి వంటి ప్రాంతాలకూ వలసపోయి అక్కడ కూలి పనుల్లో చేరుతున్నారు.
మదుపులు పెరిగాయి
సముద్రంలో వేట సాగక మా గ్రామంలోని చాలా కుటుంబాలు ఉయ్యాళ్లను తయారీ చేసి అమ్ముతున్నాయి. జిఎస్టి వచ్చిన నాటి నుంచి నైలాన్ ధారం ధర పెరగడంతో మదుపులు పెరిగాయి. ఉయ్యాళ్ల ధర మాత్రం పెరగలేదు. గతంలో రూ.వందకు అమ్మిన ఉయ్యాలను ప్రస్తుతమూ అదే ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.
- ఎం.ఆదినారాయణ, మత్స్యకారుడు, కొవ్వాడ
జిఎస్టి నుంచి మినహాయించాలి
మత్స్యకారులు వినియోగిస్తున్న వలలు, వలల మెటీరియల్, ఎండు చేపలపై జిఎస్టి పన్నును మినహా యించాలి. పన్ను భారం, పెరిగిన ధరలు వారికి మరింత భారమయ్యా యి. వీటిపై ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి విన్నవించాం. ప్రభుత్వం దీనిపై తక్షణమే ఆలోచించాలి.
- మూగి రామారావు, సముద్రతీర మత్స్యకార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు
ఉయ్యాళ్ల తయారీపైనా పన్ను ప్రభావం
జిల్లాలోని పారిశ్రామికవాడ ప్రాంతంలోని పైడిభీమవరం, రణస్థలం ప్రాంతాల్లోని పరిశ్రమలు కాలుష్యకారక వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెడుతుండటంతో చేపల వేట మృగ్యమైపోయింది. రణస్థలం మండలం సముద్రతీర ప్రాంత గ్రామాలైన కొవ్వాడ, మత్స్యలేశం, పెద్ద కొవ్వాడ ప్రాంతాల్లోని 80 శాతానికిపైగా మత్స్యకార కుటుంబాలు చేపల వేట మానుకున్నాయి. ఈ కుటుంబాలు నైలాన్ ధారంతో ఉయ్యాళ్లను అల్లి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాయి. నైలాన్ ధారంపై 12 శాతం జిఎస్టి విధించడంతో ముడిసరుకుకు అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. నైలాన్ ధారం ధర పెరిగినా ఉయ్యాళ్ల ధర మాత్రం పెరగలేదు.
'చేపల వేట'పై వేటు
