వేసవికాలం వచ్చిందంటే చాలు, సూర్యుని ప్రతాపానికి బెంబేెలెత్తిపోతుంటాం. చల్లదనం ఎక్కడ దొరుకుతుందా..! అని వెతుకుతుంటాం. చాలామంది ఉద్యోగస్తులు ఈ కాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆఫీసుల్లో ఎసీ, కూలర్ల మాటున సేదదీరుతారు. ఇంటికి రాగానే ఇంట్లో వేడితో మరో సమస్య మొదలు. దాంతో కాస్త అసహనం, మరికాస్త అనారోగ్యం. అలాంటి వేడి సమయంలో ఇంట్లో కూలర్ ఉన్నా, ఒక్కొక్కసారి వేడికి తట్టుకోలేకపోవచ్చు. అలాగని ఎసి పెట్టించుకుందామంటే కరెంటు బిల్లు తలచుకుంటేనే షాక్ కొడుతుంది. ఇలాంటి సమయంలోనే తక్కువ ఖర్చుతో ఇంటి వాతావరణాన్ని చల్లగా, మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే పాటించాల్సిన కొన్ని సూచనలను ఈ వారం 'నివాసం'లో తెలుసుకుందాం!!
సూర్యకిరణాలు నేరుగా తాకేచోట వేడి గురించి చెప్పనవసరంలేదు. అలాంటి ప్రదేశాల్లో ముఖ్యమైనవి ఇంటి గోడలు, పైకప్పు. నిపుణుల సూచనల ప్రకారం ముదురు రంగులు వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. దాంతో ఇల్లు మొత్తం వేడిగా ఉంటుంది. అందుకే, ఇంటిపై కప్పు, గోడలకు ఈ సీజన్లో ముదురు రంగులు కాకుండా, లైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి. ఇంటి పైకప్పుపై తెల్లరంగు పెయింట్ లేదా పిఒపి చేయించడం వల్ల ఇంట్లో ఉన్న వేడిని సుమారు 70 నుంచి 80 శాతానికి తగ్గించవచ్చు. దాంతో ఇళ్లు చల్లగా ఉంటుంది. ఇంట్లోని గదుల్ని చల్లగా ఉంచేందుకు లేత నీలిరంగులో లైట్ షేడ్‌ను ఉపయోగించాలి. నీలం రంగు వేడిని తక్కువగా తీసుకుంటుంది. ఈ కాలంలో గదులలో ఉండే కార్పెట్ల వలనా ఇంట్లో ఉష్ణోగ్రత వేడిగా అనిపించవచ్చు. ఇంటిని చల్లగా చేయాలంటే కార్పెట్లను తొలగించాలి. ఖాళీగా ఉన్న ఇల్లు కూడా చల్లగా ఉండేందుకు ఆస్కారం ఉటుంది. అనవసర సామాన్లను స్టోర్రూంకే పరిమితం చేయాలి. వేసవికాలంలో ఫ్లోర్‌పైన వీలైనంతవరకూ చెప్పులు లేకుండా నడిస్తే హాయిగా అనిపిస్తుంది.
కూలర్లు.. కర్టెన్లు..!
గదిలో కూలర్ ఉంటే, ఒక కిటికిని ఒపెన్ చేసి ఉంచడం మంచిది. దాంతో బయటిగాలి లోపలికి ప్రవేశిస్తుంది. కూలర్ పని చేస్తున్నప్పుడు క్రాస్ వెంటిలేషన్ ఉండడంతో గది చల్లగా ఉంటుంది. కూలర్లో నీళ్లు పోసే ముందే కూలర్ పేడ్ను శుభ్రం చేయాలి. ఎందుకంటే గాలి సునాయాసంగా వచ్చి, గదంతా చల్లగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో గది వేడిగా ఉంటుంది. ఈ వేడి నుంచి బయటపడాలంటే కర్టెన్లను వాడాలి. ఇవి వేడిని గదివైపుగా రాకుండా చూస్తాయి. ముదురు రంగు కర్టెన్లు వాడకూడదు. అవి వేడిని ఆకర్షిస్తాయి. పోస్టల్, తెలుపు రంగు, లేత రంగు కర్టెన్లు వేసవిలో అనువుగా ఉంటాయి. కర్టెన్ల స్థానంలో వెదురు, వట్టివేళ్లు తెరలు వంటివి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉదయం, సాయంత్రం రెండుపూటలా ఇంటి గోడలపై నీళ్లు చల్లుతూ ఉండాలి. దాంతో ఇంటి గోడలకున్న వేడి కాస్త తగ్గుతుంది. ఇంట్లోని ప్రతి గదిలో ఓ బాస్కెట్లో నీటిని ఉంచాలి.
ఆ నీటికి ఫ్యాను గాలి తగిలి, గదులు కాస్త చల్లబడతాయి. గాలి ఇంట్లోకి ప్రవేశించే చోట కుండీల్లో మొక్కలను ఉంచాలి.
ఎలక్ట్రికల్ వస్తువుల ఎంపిక
వేసవిలో వాతావరణంలోని తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. రానున్నరోజుల్లో ఉష్ణోగ్రతలు అధికమవు తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ సమయంలో ఎసి, కూలర్, ఫ్యాన్లు, ఫ్రిజ్ ఎలక్ట్రికల్ వస్తువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. బయటి ఉష్ణోగ్రత 40-41 డిగ్రీలు ఉన్నా, లేకున్నా ఇంటిలోపల మాత్రం చల్లగా ఉండేలా చూసుకోవాలి. అందుకు ఎలక్ట్రికల్ వస్తువుల ఎంపికలో కొన్ని సూచనలను పాటించాలి. ఇంట్లో కూలింగ్ సిస్టమ్ చల్లగా ఉండాలంటే, సీలింగ్ ఫ్యాన్ కొనేముందు మంచి బ్రాండెడ్, ఐఎస్ఐ ముద్ర కలిగిన వాటిని ఎంచుకోవాలి. దాంతోపాటు ఫ్యాన్ 3-వే, 4-వే కంట్రోల్ అయ్యేలా చూసుకోవాలి. ఎందుకంటే, చలికాలంలో ఫ్యాన్‌ను తక్కువలో పెట్టుకుంటాం. అలా దీనిని వాడకుండా పెట్టేయడం వల్ల ఫ్యాన్‌ను శబ్దం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ఉండే, లూబ్రికేషన్ ఆయిల్ తగ్గిపోతుంది. దాంతో బేరింగ్‌లో శబ్ధం వస్తుంది. దీంతో ఫ్యాన్ త్వరగా వేడెక్కి, త్వరంగా పాడయ్యే అవకాశం ఉంది. వచ్చేగాలి కూడా వేడిగా ఉంటుంది. అలాంటప్పుడు ఫ్యాన్‌ను వెంటనే ఆఫ్ చేయాలి. మెకానిక్ దగ్గరికి తీసికెళ్లాలి. ఒకవేళ బేరింగ్ శబ్ధాలేమీ రాకపోతే, వెంటనే మోటర్లో గ్రీస్ లాంటివి రాసి రిపేర్ చేసుకోవడం మంచిది.
సేకరణ : చందు