ఈ రోజుల్లో ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ లేని ఇల్లంటూ ఉండదు. ఆర్థిక పరిస్థితి బాగున్న, మధ్యతరగతి కుటుంబాల్లో అయితే, మైక్రోవేవ్ ఓవెన్లు కూడా దర్శనమిస్తున్నాయి. అయితే, వీటిని శుభ్రపరచడమెలా అనే దానిపై చాలామందికి ఎన్నో సందేహాలు, ప్రశ్నలు లేకపోలేదు. ఎలా శుభ్రంచేయాలో తెలీక అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కోసారి తెలిసీ తెలియక శుభ్రంచేసే సమయంలో ఆ వస్తువులు పాడవ్వడమే కాకుండా, ప్రాణాలమీదకూ తెచ్చుకుంటారు. అలా ఇబ్బందులు పడేవారి కోసం కొన్ని సూచనలు.
మైక్రోవేవ్ ఓవెన్‌ను శుభ్రపరిచే సమయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. లోపల ఉండే రొటేటింగ్ ట్రేను బయటకు తీసి, శుభ్రం చేయాలి. కోలిన్, ప్రిల్ స్ప్రే వంటి వాటిని ఉపయోగించిన తర్వాత శుభ్రంగా తడివస్త్రంతో తుడవాలి. క్లీనింగ్ ప్యాడ్‌తో లోపలపడిన మరకల్ని అద్దేయాలి. మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్లో నీరుపోసి ఉంచి ఐదు నిమిషాల పాటు వేడిచేస్తే లోపల పడిన మరకల్ని సులువుగా తుడిచివేయవచ్చు.
ఫ్రిజ్‌ను లోపల, బయట ఉపరితలాన్ని మాత్రం వెనిగర్ కలిపిన నీటితో శుభ్రం చేయాలి. ప్రతి అరనూ విడివిడిగా కడగాలి. కూరగాయలు ఉంచే ట్రేను తరచూ కడుగుతుండాలి. ఎందుకంటే వెజిటబుల్స్ పాడవ్వడం ద్వారా దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. దీంతో లోపలి భాగంలో ఎక్కువ బ్యాక్టీరియా తయారవుతుంది.
వాషింగ్ మెషిన్‌ను వాడిన తర్వాత తడివస్త్రంతో శుభ్రంగా సబ్బు మరకలను తుడిచేయాలి. తర్వాత పొడివస్త్రాన్ని వాడి తేమను తుడిచేయాలి. ఎప్పటికప్పుడు బట్టల్ని ఉతికిన తర్వాత లోపల ఉన్న డ్రయ్యర్లను పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలాచేస్తే వస్తువు ఎక్కువకాలం మన్నే అవకాశం ఉంటుంది.
ఫ్రిజ్, ఓవెన్, వాషింగ్‌మెషిన్ ఇలా ఎలక్ట్రానిక్ వస్తువుల లోపలి భాగాలను క్లీన్ చేసే సమయంలో ఆ వస్తువులను స్విచ్ఛాఫ్ చేయాలి. స్విచ్ బోర్డుకు ఉన్న ప్లగ్‌ను తీసేయడం అన్నింటికన్నా ఉత్తమం. ్య
ఎలక్ట్రానిక్ వస్తువులను శుభ్రం చేసుకోండిలా..!
