పూల మొక్కల పెంపకానికి ఇళ్లలో కుండీలను ఉపయోగించడం సహజం. అవి పగిలిపోవడం కూడా అంతే సహజం. పగిలిన కుండీలను పారేస్తున్నారా... ఆగండాగండి! తొందరపడకండి. పగివలిపోయిన కుండీలను ఏం చేస్తామంటారా? ఏం చేయడమేంటండి!ఏకంగా మినీయేచర్ తోటల ప్రపంచాన్నే సృష్టించవచ్చు. మన చిన్న ఇళ్లలో చిన్నపాటి అరణ్యాన్నే పుట్టించవచ్చు. నమ్మశక్యం కావడం లేదా? నిజమండీ .... కావాలంటే ఈ ఫోటోలను చూడండి. కొంచెం ఓపిక, ఇంకొంచెం సృజనాత్మకత ఉంటే చాలు .. ఒకటేమిటి ఇటువంటివి ఎన్నో చేసేయవచ్చు. రంగురంగుల ప్రపంచాన్ని మన ఇంట్లో కొలువుతీయించవచ్చు. పగిలిన కుండీలలో పెంచడానికి చిన్న మొక్కలను ఎంచుకోండి. రంగుల పూలు పూసే మొక్కలైతే బావుం టాయి. ఎడారి జాతి మొక్కలు, గడ్డిజాతి మెక్కలను కూడా వీటికి చేర్చండి. మీ అభిరుచికి తగ్గట్టుగా వీటిని కుండీలలో అమర్చండి. ఒక కుండీలో ఒక మొక్కనే పెంచే సాంప్రదాయ విధానానికి స్వస్థి పలకండి! రకరకాల మొక్కలు... రంగురంగుల మొక్కలను ఒకే కుండీలో చేర్చండి. గుండ్రంగా నున్నగా ఉండే చిన్న రాళ్లు, చిన్నచిన్న బొమ్మలు (ఇళ్లు, పక్షులు, జంతువులు వంటివి) కూడా ఈ మొక్కల మధ్య అమరిస్తే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. చిన్న పిల్లలకు ఇవి స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటాయి. ఇక మీ ఇంటికొచ్చే అతిధులు మీ ప్రత్యేక టాలెంట్‌ను చూసి పొగడ్తల జల్లుల్లో ముంచెత్తకపోతే చూడండి! కుండీలలో మొక్కలను పెంచడం పాత ఫ్యాషన్ అయిపోయింది. పగిలిన కుండీల్లో సృష్టిస్తున్న మినీయేచర్లదే ఇప్పటి ట్రెండ్! కొందరైతే దీనికోసం కొత్తకుండీలను కొని మరీ పగలకొడుతున్నారు. పగిలిన కుండీలలో మొక్కలను పెంచడం అలవాటైతే మీరు కూడా అలా చేయవచ్చు. కొత్త కుండీల విషయం లో ఒక సౌలభ్యం కూడా ఉంది. మనకు కావల్సిన డిజైన్లలో వీటిని పగలకొట్టవచ్చు. అలా చేయడానికి ముందు కొత్త కుండీలను నీటిలో నానపెట్టాలి. మనకు కావాల్సిన డిజైన్ ఆ కుండీమీద గీసుకోవాలి. దానికనుగుణంగా పగలకొట్టాలి. ఈ పనినే జాగ్రత్తగా చేయాలి. డ్రిల్లింగ్ మిషన్ ఎయిర్ఫ్రెషర్ పరికరాలను వాడటం ద్వారా మనం కోరుకున్న విధంగా కుండీలను పగలకొట్టవచ్చు. కొందరు నర్సరీ యజమానులు ఈ పనిని కూడా చేసి ఇస్తున్నారు. ఈ పగిలిన కుండీలతో సృష్టించిన మినీయేచర్ ప్రపంచాన్ని ఇంట్లో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. తోటలో, వరండా లో, డ్రాయింగ ్రూమ్లో, బెడ్ రూమ్‌లో ఇలా ఎక్కడైనా... ఒక చోట నుండి మరో చోటకు మార్చ డం కష్టం. కాబట్టి ముందుగానే స్థలాన్ని ఎంపిక చేసు కోవాలి. అలా కాకుండా మార్చుకోవాలంటే ముందు గానే దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న స్థలాని కనుగు ణంగా మొక్కలను ఎంచుకోవాలి. ఎండ గాలి బాగా వచ్చే స్థలమైతే ఒక రకం. ఎండ తగలని స్థలమైతే మరో రకం అలాగన్న మాట! మొక్కల ఎంపికలో అవసరమైతే నర్సరీ సిబ్బంది సాయం తీసుకోండి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి ...
- ఎంపిక చేసుకున్న కుండీ మట్టిని నింపడానికి వీలుగా ఉండాలి
- కుండీకి నీటిని పీల్చుకునే గుణం ఉండాలి. దీనికోసం మొక్కలు వేయడానికి ముందే నీటితో తడిపి చూడండి.
- కుండీలో మట్టిని నింపండి.
- విరిగిన కుండీ ముక్కలను మంచి డిజైన్ వచ్చేలా వాడండి.
- మీకు నచ్చిన మొక్కలను నాటండి.
- ఈ కుండీలలో నీటిని పోయవద్దు. తడిపితే చాలు!
మన ఇంట్లో మినీయేచర్ ప్రపంచం
