అయ్యా ప్రధానమంత్రి మోడీ గారూ!
రేపు మన భారత స్వాతంత్య్ర దినోత్సవం, తమరు త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి 'మనమంతా భారతీ యులం! మనందరిదీ ఒకటే జాతి! మన మధ్య ఎటువంటి భేద భావాలూ లేవు! అందరం కలిసి సగర్వంగా మన దేశాన్ని అగ్ర రాజ్యంగా నిలబెడదాం!' వంటి గంభీర ప్రకటనలతో ఉపన్యసిస్తారు. మాకు తెలుసు.
అయితే, నిజంగా 'మనమంతా ఒకటే! ఒకే కుటుంబంలో అన్నదమ్ములం మనం' వంటి ప్రకటనల వెనక మీ చిత్తశుద్ధి ఏంటి?
మీరు 2014లో 'స్వచ్ఛ భారత్' నినాదాన్ని ప్రకటించారు. ఇప్పటికి అయిదేళ్లైంది. 2013లో మాన్యువల్ స్కావెంజర్లను ఉపయోగించే పద్ధతిని నిషేధిస్తూ వారికి పునరావాసం కల్పిస్తూ మీ ముందు నడిచిన ప్రభుత్వం చట్టం చేసింది. (స్కావెంజింగ్ అంటే మానవ విసర్జిత మలాన్ని చేతుల్తో ఎత్తి తట్టల్లోకి తీసి వాటిని తలపై మోసి దూరంగా పారవేసే విధానం. ఈ పని చేయడానికి కొన్ని కులాల ప్రజలను కేటాయించారు. తరతరాలుగా వారికి సంక్రమించిన ఈ వృత్తిని శాపగ్రస్తుల మాదిరిగా వారే కొనసాగిస్తు న్నారు. దేశం సాంకేతికంగా ఎంత పురోగమించినా వీరికి ఈ పని తప్పడం లేదు. పైగా ఈ పనులు చేసే కులస్తులంతా కాలుష్యానికి ప్రతినిధులైనట్లు పరిగణించి వారిని అసహ్యించుకుంటారు. వెలివేసి నట్టు దూరం పెడతారు. వారితో సంబంధాలు పెట్టుకోరు. ఈ పారిశుధ్య కార్మికులు ఎదుర్కొనే అవమానాలు, దోపిడీ, వేధింపులు ప్రపంచంలో ఇంకెక్కడా మనం చూడం).
ఈ చట్టం అనంతరం 13 రాష్ట్రాలలో 12,742 మంది మాన్యువల్ స్కావెంజర్లు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. వారిలో 82 శాతం అంటే 10,448 మంది ఒక్క ఉత్తర ప్రదేశ్‌లోనే ఉన్నట్టు తేల్చింది. (తమరు లోక్‌సభకు ఆ రాష్ట్రం నుండే ఎన్నికయ్యారు. గుర్తుందనుకుంటాను) అయితే సుప్రీంకోర్టు ఈ లెక్కలు శుద్ధ తప్పుడు లెక్కలని తేల్చింది. ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారమే 7,40,078 ఇళ్లలో లెట్రిన్లు శుభ్రం చేయడానికి మాన్యువల్ స్కావెంజర్లు అవసరమైనవి ఉన్నాయని తేలింది. ఇదిగాక సెప్టిక్ ట్యాంకులు, మురుగు కాలువలు, రైల్వే ప్లాట్‌ఫాంలు ఉండనే ఉన్నాయి. 2011 సామాజిక-ఆర్థిక, కుల గణన ప్రకారం గ్రామీణ భారతంలో 1,82,505 మంది ఇంకా మాన్యువల్ స్కావెంజింగ్ పనుల్లో ఉన్నారని తేలింది.
ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే తమరు 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకూ ఈ మాన్యువల్ స్కావెంజింగ్ని రద్దు చేసి వారికి పునరావాసం కల్పించడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. స్వచ్ఛ భారత్ సెస్సు పేర మా అందరి దగ్గర నుంచీ కోట్లాది రూపాయలు మాత్రం వసూలు చేస్తూనే వున్నారు. ఇది 'దేశ భక్తి' లో భాగం కాబోలునని మేమూ మారు మాట్లాడకుండా చెల్లిస్తూనే వున్నాం.
గ్రామాల్లోనే కాదు. నగరాల్లోనూ ఈ సమస్య ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ అన్ని చోట్లా డ్రైనేజి మ్యాన్‌హోల్ లోకి దిగి ఊపిరాడక, విష వాయువులు పీల్చినందున చచ్చిపోతున్న వారెందరో ఉన్నారు. సగటున 5 రోజులకి ఒక పారిశుధ్య కార్మికుడు ఈవిధంగా చనిపోతున్నాడు.
ఈ విషయమై ఒక్క రూపాయి కూడా విడుదల చేయని తమ ప్రభుత్వం (ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులే సమాచార హక్కు చట్టం ప్రకారం 'ది వైర్' అనే మీడియా సంస్థకు వెల్లడించారు) రూ.1,10,000 కోట్లు వెచ్చించి ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ఒక బుల్లెట్ ట్రెయిన్‌ను నడపడానికి నిర్ణయించింది! 2022 ఆగస్టు 15 కల్లా ( మన 75వ స్వాతంత్య్ర దినోత్సవం) ఈ బుల్లెట్ రైలు ప్రారంభం కావాలనేది తమరి ఆకాంక్ష! రోజూ మన భారతీయ రైల్వేలు 2 కోట్ల 30 లక్షల మంది ప్రయాణీకులను చేరవేస్తున్నాయి. ఈ బుల్లెట్ రైలులో 750 సీట్లు మాత్రమే ఉంటాయి. అంటే మొత్తం రైలు ప్రయాణీకుల్లో 0.0033 శాతం మాత్రమే ఈ రైలులో ప్రయాణించబోతున్నారు. 'అగ్రరాజ్యం' అని చెప్పుకోగలగాలంటే ఇలాంటి రైళ్లు ఉండి తీరాల్సిందేనని తమరి మనోభావమని తెలుస్తోంది.
అత్యంత హీనమైన స్థితిలో బతుకుతున్న మాన్యువల్ స్కావెంజర్లను ఆ పని నుంచి మాన్పించి పునరావాసం కల్పించడానికి తమ వద్ద ఒక్క రూపాయీ లేదు కాని బుల్లెట్ రైలు కోసం మాత్రం లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయి!
ఇంతమంది మాన్యువల్ స్కావెంజర్లు ఇంకా కొనసాగుతూ వున్నా మనం మాత్రం మనకి స్వతంత్రం వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్నాం. పైగా 'స్వచ్ఛ భారత్' అంటున్నాం!
జెండా ఎగరేసే ముందైనా అందరం కాస్త సిగ్గుపడదామా!
- ఇట్లు,
ఓ భారతీయుడు.
- సుబ్రమణ్యం
మేరా స్వచ్ఛ భారత్ మహాన్!
