ప్రభుత్వ, న్యాయస్థానాల కార్యకలాపాలు, చట్ట సభల కార్యకలాపాలు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషలలోనే (ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మరియు ఉర్దూ) జరగడం ఎంతైనా అవసరం. ఇంకా ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలలో మరియు కేంద్రీయ విద్యా సంస్థల ప్రవేశ పరీక్షలలో ప్రాంతీయ భాషలను ప్రవేశ పెట్టడం అవసరం. అయితే ఇటువంటి ప్రతిపాదనలేవీ నివేదికలో లేవు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే భారతీయ ఆధునిక భాషల విషయంలో ఆశయ ప్రకటనలు ఎంత గంభీరంగా ఉన్నాయో కార్యరూపానికి చెందిన సూచనలు అంత పేలవంగా ఉన్నాయి.
నాలుగు భాగాలుగా ఉన్న కస్తూరి రంగన్ నివేదికలో మొదటి అధ్యాయం పాఠశాల విద్య. ఈ అధ్యాయంలో భాషల బోధన మరియు బోధనా భాషల గురించిన విషయాలు ఉన్నాయి. అలాగే నాలుగవ అధ్యాయంలో భారతీయ భాషల అభివృద్ధి మరియు విస్తరణల గురించి ఉంది. అయితే నివేదికలో ఉన్న సిఫారసులు పరస్పర పొందికలో ఉన్నట్లు కనిపించవు. ఇంకా ప్రధానంగా పరస్పర విరుద్ధ దృక్పథాలు కనిపిస్తాయి. అయితే ఈ వ్యాస పరిమితిలో కొన్ని ప్రాథమిక విషయాలను మాత్రం పరిశీలిద్దాం.
చర్చను బోధనా మాధ్యమంతో ప్రారం భిద్దాం. ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే, ముందు ప్రైవేటు పాఠశాలలు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాయి. ప్రైవేటును అనుసరించి క్రమంగా ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతున్నారు. అసలు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలన్నింటిలో మాతృ భాషా మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని నివేదిక ప్రతిపాదించింది. నివేదిక ప్రాంతీయ భాషలో బోధన గురించే కాదు, ఇంటి భాషలో బోధన గురించి కూడా మాట్లాడింది. ఆంగ్ల భాషా మాధ్యమాన్ని నిరసించింది. అయితే ఆ మాట మీద చివరికంటూ నిలబడలేదు. విభజిత పూర్వ ఆంధ్రప్రదేశ్‌ను ఉదాహరణగా తీసుకుంటే తెలుగు, ఉర్దూలే కాక సరిహద్దు జిల్లాలలో ఒడియా, తమిళ్, కన్నడ మరియు మరాఠీ భాషలు బోధనా మాధ్యమంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సర్వత్రా ఆంగ్ల మాధ్యమం కమ్ముకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక అనేక షెడ్యూలు ప్రాంతాలలో గిరిజన భాషలు ఉన్నాయి. వారికి తెలుగు, ఒరియా, తమిళం వంటి భాషలు కూడా పరాయి భాషలే. వారి మాతృభాషలు వారికి ఉన్నాయి. పూర్వ ప్రాథమిక విద్యలో తప్పనిసరిగా, అవసరమైతే ఒకటి మరియు రెండు తరగతులలో కూడా వారికి తమ భాషలోనే బోధన అందించాలి. సూత్రప్రాయంగా ఈ విషయాలను నివేదిక ఆమోదించింది. కాని నివేదిక చేసిన ఇతర ప్రతిపాదనలు విద్యార్థిపై మరియు అభ్యసన బోధనా ప్రక్రియపై పెద్ద ఒత్తిడిని కలిగించి కొద్దిపాటిగా ఉన్న మంచి ప్రతిపాదనల అమలుకు అవకాశం లేకుండా చేయవచ్చు. ఆ విషయం తరువాత చూద్దాం. ఇక మూడవ తరగతి నుంచి అందరూ రాజ్యాంగంలో గుర్తించిన హిందీ, ఉర్దూ మరియు తెలుగు వంటి 22 భాషలకు మారవలసిందే. అంటే మూడవ తరగతి బాలలందరికీ వారి ప్రాంతంలో ఉన్న ఒక ఆధునిక భాషలో చదవనూ రాయనూ వచ్చి ఉండాలి. నివేదికలో ఈ ప్రతిపాదన కూడా స్పష్టంగానే ఉంది. ఆయా ప్రాంతాలలో ఉన్న ఆధునిక భాషనే నివేదిక మాతృభాష లేక ప్రాంతీయ భాషగా ప్రస్తావించింది. అయితే మాతృభాషా (ప్రాంతీయ భాష) మాధ్యమాన్ని ఐదవ తరగతి వరకు వీలయితే (వీలు కానిదెక్కడో) 8వ తరగతి వరకు అమలు చేయాలని నివేదిక ప్రతిపాదించింది. ఆ పైతరగతులలో మరియు ఉన్నత విద్యలో మాధ్యమం గురించి నేరుగా రాసినట్లు లేదు. 9వ తరగతి నుంచి ప్రాంతీయ భాష మాధ్యమాన్ని కొనసాగించినా సైన్స్ సబ్జెక్టులలో ఆంగ్ల పదాలను సమాంతరంగా వాడాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలో ఉన్నత విద్యకు ప్రాంతీయ భాషలు (రాజ్యాంగంలో షెడ్యూలు ఎనిమిదిలో పేర్కొన్న భాషలు) పనికి రావనే భావన అంతర్లీనంగా ఉంది. ఉన్నత విద్యలో కూడా మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేయాలని ఎక్కడా రాయలేదు. ఒకవైపు భారతీయ భాషలను ఎంతగానో కొనియాడుతూనే, భారతీయ భాషలు శాస్త్రీయమైనవని, సంపద్వంతమైనవని, భావ వ్యక్తీకరణలో అత్యున్నతమైనవని చెప్తూనే ఆపైన మాతృభాషను అనుసరించిన దేశాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో సోదాహరణంగా వివరిస్తూనే అన్ని స్థాయిలలో మాతృభాషా మాధ్యమాన్ని ప్రతిపాదించడానికి నివేదిక వెనుకాడింది. సెకండరీ విద్యలో ప్రధానంగా విజ్ఞాన శాస్త్రాలలో ఆంగ్ల పదాలను సమాంతరంగా వాడమని నివేదిక చెప్పినందున సెకండరీ విద్యను కూడా మాతృభాషా (ప్రాంతీయ భాష) మాధ్యమంలో కొనసాగించాలని చెప్పినట్లే. అయితే కనీసం 8వ తరగతి వరకు అని చెప్పి ఉండడం వలన నివేదిక అభిప్రాయం ఏమిటో గ్రహించడంలో గందరగోళం ఏర్పడింది. ఇక ఆంగ్లాన్ని ఒక భాషగా మంచి ప్రమాణాలతో నేర్పాలని నివేదిక స్పష్టంగానే చెప్పింది. ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలన్నింటిలో 12వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్ని కొనసాగించి, విజ్ఞాన శాస్త్రాలలో ఆంగ్ల పదాలను సమాంతరంగా ఉపయోగించి, ఆంగ్లాన్ని ఒక భాషగా అందరికీ మంచి ప్రమాణాలతో నేర్పిస్తే ఉన్నత విద్యలో ఆంగ్ల మాధ్యమానికి మారవలసి వస్తే కూడా పెద్ద సమస్య ఏమీ ఉండదు. నివేదికను ఈ విధంగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ప్రభుత్వం వారు ఐదవ తరగతి వరకే నివేదిక మాతృభాషా మాధ్యమాన్ని సిఫారసు చేసిందని భావిస్తే కాదనగలిగేది లేదు. నివేదికలో ఉన్న అస్పష్టత ఇందుకు కారణం.
పాఠశాలలో బోధించవలసిన భాషల విషయంలో నివేదిక చేసిన ప్రతిపాదనలను పరిశీలిద్దాం. ప్రతి విద్యార్థి మాతృభాష (ప్రాంతీయ భాష) మరియు ఇంగ్లీషుతో పాటు హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలని, హిందీ ప్రాంతం వారు మరొక భారతీయ భాషను నేర్చుకోవాలని త్రిభాషా సూత్రాన్ని అన్ని రాష్ట్రాలు తప్పక పాటించాలని నివేదిక ప్రతిపాదించింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ భాగాన్ని ప్రభుత్వం నివేదిక నుంచి తొలగించింది. అంతేకాదు, ఈ నివేదిక ప్రతిపాదించిన త్రిభాషా విధానంలో హిందీ ప్రాంతంలో హిందీ మరియు ఇంగ్లీషు భాషలతో పాటు మరొక భారతీయ భాషను నేర్చుకోవాలని ఆ విధంగా దేశ ప్రజల మధ్య ఐక్యత మరియు దేశ సమగ్రత అభివృద్ధి చెందుతాయని ముందుగా రాసి తరువాత ఆ మూడవ భాష సంస్కృతంగా కూడా ఉండవచ్చని రాసారు. సంస్కృతాన్ని దేశంలో ఏ ప్రాంత ప్రజలు మాట్లాడుతున్నారు? హిందీ వారు ఏదేని దక్షిణాది భాషనో లేక ఈశాన్య రాష్ట్రాల భాషనో నేర్చుకుంటే దేశ ప్రజల మధ్య ఐక్యత మరియు దేశ సమగ్రత సాధ్యం అవుతాయేమోగాని సంస్కృతం నేర్చుకోవడం వలన అటువంటి ప్రయోజనం ఎంతమాత్రం నెరవేరదు. సంస్కృతాన్ని ఏదో ఒక విధంగా ముందు పెట్టడం ఈ నివేదిక పొడవునా మనకు కనిపిస్తుంది.
భాషా సమస్య సహజంగానే క్లిష్టమైన సమస్య. పాలక వర్గాలు అనుసరించే ఆధిపత్య వాదం వలన ఈ సమస్య మరింత జటిలమవుతుంది. ఒకప్పుడు అనేక రాజ్యాలలో దీర్ఘకాలం పాటు సంస్కృతం రాజ భాష. ఆ కారణంగా ఆనాటి కాలపరిమితిలో అభివృద్ధి చెందిన విజ్ఞాన శాస్త్రాలు మరియు పాలక వర్గాల సాహిత్యం సంస్కృత భాషలో ఉన్నమాట వాస్తవమే. ఈ దేశంలో ఆనాడు నాగరికత ఏ స్థాయికి అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్న సంస్కృత గ్రంథాలను మత దృక్పథం నుంచి విముక్తి చేసి అధ్యయనం చేయాలి. ఆపని ఈసరికే వివిధ దేశాల, వివిధ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చేపట్టారు. అటువంటి కృషిని ప్రోత్సహిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇక ఆచరణాత్మక సమస్యలకు వస్తే, పాఠశాల బాలలపై సంస్కృతం రుద్దడం వారిపై అనవసర భారం.
ఈ నివేదిక త్రిభాషా విధానానికి అదనంగా భాషలపై మరొక తప్పనిసరి పాఠ్య విషయాన్ని అంతేకాక ఒక ఐచ్ఛిక పాఠ్య విషయాన్ని ప్రతిపాదించింది. వివరంగా చూస్తే, ఎ) 6-8 తరగతులలో బాలలు 'భాషా వినోదం' పేరుతో వివిధ భాషల మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేయాలని, వివిధ భాషలలో ఉన్న సాహిత్యంతో పరిచయం ఏర్పాటు చేసుకోవాలని, వివిధ భాషలలో కొన్ని ప్రాథమిక సంభాషణలు నేర్చుకోవాలని అందుకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక రూపొందించాలని సిఫారసు చేసింది. పాఠశాల విద్యకు భాషారంగంలో చాలా అనవసర మైన మరియు అసాధ్యమైన లక్ష్యాలను ఈ నివేదిక నిర్దేశించిందని చెప్పవచ్చు. బి) సెకండరీ విద్యలో (ప్రకృతి మరియు సామాజిక శాస్త్రాలలో ఏదో ఒకదానిని విడిచిపెట్టి దాని స్థానంలో) ఒక భారతీయ భాషను గాని లేదా ఒక విదేశీ భాషను గాని పాఠ్య విషయంగా ఎంచుకునే వీలు ఉండాలని నివేదిక సూచించింది. ఈ ప్రతిపాదన 9వ తరగతి నుంచి కాక, 11వ తరగతి నుంచి అమలు చేస్తే ప్రయోజనకరంగా ఉండవచ్చు. 10వ తరగతి వరకు అవసరమైన భాషలు (ఇంటి భాష, ప్రాంతీయ భాష మరియు ఆంగ్లం), గణితం, ప్రకృతి మరియు సామాజిక శాస్త్రాలు ఒక స్థాయిలో అధ్యయనం చేయడం అవసరమని, అనంతరం మాత్రమే స్పెషలైజేషన్ ప్రవేశ పెట్టడం సరియైనదని ఈనాడు అత్యధికులు భావిస్తున్నారు. ఆ విషయాలను ఈ వ్యాస పరిమితిలో మనం చర్చించలేము. అనేక భాషలు బోధించాలనే ప్రయత్నం అవసరమైన భాషల బోధనకు నష్టం కలిగించవచ్చన్న విషయాన్ని మాత్రం గ్రహించ వలసిన అవసరం ఉంది.
ఫౌండేషన్ కోర్సు (3-8 వయో పరిమితి) లోనే మూడు భాషల అభ్యసనాన్ని ప్రవేశ పెట్టాలని నివేదిక చేసిన ప్రతిపాదన వీటన్నింటి కంటే ప్రధానమైన చర్చనీయాంశం. బాలలకు 3-8 వయోపరిమితో ఎక్కువ భాషలు నేర్చుకునే సామర్ధ్యం ఉంటుందనే ప్రాతిపదికన ఈ ప్రతిపాదన చేయబడింది. కాని అందుకవసరమైన వాతావరణాన్ని సరిగ్గా చెప్పాలంటే భాషావరణాన్ని పాఠశాలలో కల్పించడం సులభం కాదు, అవసర మైన భాషావరణం లేకుండా ఒక భాషను నేర్పడం సులభం కాదు. మాతృభాష అని మనం చెప్పేదే నిజానికి ఇంటి భాష కాదు. ఇక గిరిజనుల విషయంలో వారి ఇంటి భాష మరియు పాఠశా లలో ఉపయోగిస్తున్న ప్రాంతీయ భాష పూర్తిగా వేరు. వారి ఇంటి భాష నుంచి లేదా మాతృభాష నుంచి వారు ప్రాంతీయ భాషకు మారడానికి అవసరమైన ప్రయాస అటు బాలలకు, ఇటు ఉపాధ్యాయునికి తప్పదు. ఆపైన ఆంగ్లాన్ని నేర్చుకోవాలి. ఇంతకు మించి మరిన్ని భాషలు బాలలపై రుద్దడం ఎంతమాత్రం సరి కాదు.
దేశంలో భాషా బోధన చాలా దీనావస్థలో ఉందని, ఈ పరిస్థితి మారాలని, దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు భాషల అభివృద్ధికి కృషి చేయాలని, అందుకు భాషా శాఖలను మంచి ప్రమాణాలతో నిర్వహించడమేగాక, భాషా అధ్యయనాన్ని విస్తరించాలని, రాజ్యాంగం అనుబంధంలో పొందుపరచిన 22 భాషల విషయంలోనే గాక గిరిజన భాషల అభివృద్ధికి విశ్వవిద్యాలయాలు శ్రద్ధతో పని చేయాలని, సైగ భాషల అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని, వివిధ భారతీయ భాషలు బోధించ డానికి అవసరమైన ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున విశ్వవిద్యాలయాలు ఉత్పత్తి చేయాలని, మంచి ప్రమాణాలు గల ఉపాధ్యాయులను ఉత్పత్తి చేయాలని వివిధ భాషల గ్రంథాలయాలు అభివృద్ధి చేయాలని, అన్ని భాషలలో ఉన్న మంచి సాహిత్యాన్ని ఇతర భాషల లోనికి తర్జుమా చేయాలని, నివేదిక పేర్కొంది. ఇక పౌర సమాజంలో ప్రాంతీయ భాషల వాడుకను అభివృద్ధి చేయడం గురించి అవసరమైన చర్యలను నివేదిక సిఫారసు చేయలేదనే చెప్పవచ్చు. ప్రభుత్వ, న్యాయస్థానాల కార్యకలాపాలు, చట్ట సభల కార్యకలాపాలు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషలలోనే (ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మరియు ఉర్దూ) జరగడం ఎంతైనా అవసరం. ఇంకా ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలలో మరియు కేంద్రీయ విద్యా సంస్థల ప్రవేశ పరీక్షలలో ప్రాంతీయ భాషలను ప్రవేశ పెట్టడం అవసరం. అయితే ఇటువంటి ప్రతిపాదనలేవీ నివేదికలో లేవు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే భారతీయ ఆధునిక భాషల విషయంలో ఆశయ ప్రకటనలు ఎంత గంభీరంగా ఉన్నాయో కార్యరూపానికి చెందిన సూచనలు అంత పేలవంగా ఉన్నాయి.
- రమేష్ పట్నాయక్ ( వ్యాసకర్త ఆంధ్ర ప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ )
( జాతీయ విద్యా విధానం ముసాయిదాపై వ్యాసం - ఐదవ భాగం )