'దక్షిణాఫ్రికాలో భూ స్వాధీనాలు, పెద్ద ఎత్తున రైతాంగ హత్యలూ జరుగుతున్నాయి. వాటి గురించి సునిశితంగా అధ్యయనం చేయండి' అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల తన విదేశాంగ మంత్రిని ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా దక్షిణాఫ్రికా భూసమస్య ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఒక సర్వసత్తాక దేశ అంతర్గత వ్యవహారాలలో, భూ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇంత బహిరంగంగా జోక్యం చేసుకొనేందుకు పూనుకోవటం అమెరికా తెంపరితనానికి నిదర్శనం. శ్వేతజాతి రైతులను చంపుతున్నారు. వారి భూములను లాక్కుంటున్నారు అంటూ అమెరికా మీడియాలో రెచ్చగొడుతున్నారు. భూ సంస్కరణలను వ్యతిరేకించే శ్వేత జాతీయులతో కూడిన ఆఫ్రీ ఫోరమ్ ప్రతినిధులు ఇటీవల అమెరికా వచ్చి అనేక మందిని కలిశారు. మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ట్రంప్ చర్యను దక్షిణాఫ్రికాలో అనేక మంది తీవ్రంగా ఖండించారు. దేశ ఉపాధ్యక్షుడు మబుజా ఒక ప్రకటన చేస్తూ భూ సంస్కరణలు సామాజిక, జాతి విభజన ఫలితాలు కాదని స్పష్టం చేశారు.
వాస్తవానికి వందల సంవత్సరాల జాత్యహంకార, వలస పాలనలో భూముల నుంచి స్థానికులను వెళ్లగొట్టారు. వలస వచ్చిన శ్వేత జాతీయులు ఆ భూములను ఆక్రమించుకున్నారు. స్థానిక ఆఫ్రికన్లను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసిన శ్వేత జాతి ప్రభుత్వం 1913లో చేసిన ఒక చట్టం ప్రకారం, నల్లజాతీయులైన ఆఫ్రికన్లు 'శ్వేత దక్షిణాఫ్రికా'లో భూములు కొనుగోలు చేసేందుకు లేదా కౌలుకు తీసుకొనే అవకాశాన్ని కోల్పోయారు. భూముల నుంచి గెంటివేతకు గురయ్యారు. 1994లో శ్వేతజాతి దురహంకార పాలన అంతమై ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వంలో త్రిపక్ష కూటమి అధికారానికి వచ్చే నాటికి తొమ్మిది శాతం శ్వేత జాతీయుల చేతిలో 90 శాతం భూమి కేంద్రీకృతమై వుంది. భూ పంపిణీ అన్నది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ప్రకటించిన ప్రధానమైన కార్యక్రమాలలో ఒకటి. గ్రామీణాభివృద్ధి, భూ సంస్కరణల శాఖ జరిపిన భూ తనిఖీ లెక్కల ప్రకారం 90 శాతం భూమి వ్యక్తులు, ట్రస్టులు, కంపెనీల చేతిలో వుంది. పది శాతం ప్రభుత్వానికి చెందిందని దేశాధ్యక్షుడు సిరిల్ రాంఫొసా తాజాగా ఒక పత్రికకు భూసమస్యపై రాసిన వ్యాసంలో వివరించారు. ప్రభుత్వ రేటు ప్రకారం రెండు కోట్ల రాండ్లు తీసుకొని భూమిని స్వాధీనం చేయాలని స్థానిక అధికారులు ఒక యజమానిని కోరారు. అయితే తనకు 20 కోట్ల రాండ్లు ఇవ్వాలని పట్టుబట్టడంతో, ఆ భూమిని చట్ట నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకొనేందుకు అధికారులు పూనుకున్నారు. ఈ పూర్వ రంగంలోనే ఉత్తర రాష్ట్రంలో ప్రయివేటు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదన్న వార్తల నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ ప్రకటన వెలువడింది.
ముఫ్పై శాతం భూమిని ఐదు సంవత్సరాలలో పంపిణీ చేయాలన్నది 1994లో తొలి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో చేసిన వాగ్దానం. అయితే దానిలో ఇప్పటి వరకు పది శాతం కూడా జరగలేదని 2014 వరకు విధించిన గడువును 2024 వరకు పొడిగించనున్నట్లు వార్తలు వచ్చాయి. అంటే పాతిక సంవత్సరాలలో చేసిందేమీ లేదన్నది చేదు నిజం. ఆఫ్రికన్లలో విపరీతంగా వున్న నిరుద్యోగం, పాతికేళ్లుగా అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల వలన ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. ఇటువంటి అనేక కారణాలతో జనంలో అసంతృప్తి నానాటికీ పెరుగుతోంది. అవినీతి, అక్రమాల కారణంగా ఏకంగా ఒక దేశాధ్యక్షుడు జాకబ్ జుమా కొద్ది నెలల క్రితం పదవి నుంచి తప్పుకోవాల్సి రావటం అక్కడి పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. జుమాను తొలగించకపోతే తాము సంకీర్ణ కూటమి నుంచి వైదొలుగుతామని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించాల్సి వచ్చింది.
ఎలాంటి పరిహారం లేకుండా పరిమితులు దాటిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి పంపిణీ చేసే విధంగా చట్ట సవరణ చేయనున్నట్లు స్వయంగా ఆ దేశ అధ్యక్షుడే ప్రకటించారు. పాతిక వేల ఎకరాలకు పైబడి వున్న వారి నుంచి మాత్రమే పరిహారం చెల్లించకుండా భూములు తీసుకుంటామని ఎఎన్సి అధ్యక్షుడు చేసిన ప్రకటన అనేక మందిలో చలనం కలిగించింది. అయితే పరిమితికి మించి వున్న భూములను అమ్ముకొనేందుకు ప్రయత్నించగా కొనే వారు కరువయ్యారు. దాంతో ప్రభుత్వ రేటుకు పదిహేను నుంచి ఇరవై రెట్లు అదనంగా ఇస్తేనే తాము భూములు వదులుకుంటామని కొందరు పట్టుబడుతున్నారు. భూములన్నీ శ్వేత జాతీయుల చేతిలో వుండటంతో ప్రభుత్వ చర్యలు కూడా సహజంగానే వారికి వ్యతిరేకంగానే వుంటాయి. దీంతో ఆ సమస్యకు రంగు పూసి జాతి వివక్షగా చిత్రించేందుకు పూనుకున్నారు. ట్రంప్ ట్వీట్ కూడా దానినే ప్రతిబింబించింది. ఒక వైపు కంపెనీ వ్యవసాయం లాభసాటి అంటూ ఆ వైపు ప్రోత్సహిస్తూనే మరోవైపు భూ పంపిణీని కూడా ప్రపంచ బ్యాంకు సమర్ధించడం మిత్ర వైరుధ్యానికి నిదర్శనం. నష్ట పరిహారం లేకుండా భూ స్వాధీనం గురించి ఇంతవరకు చట్ట సవరణే చేయలేదు. చేస్తామని ప్రకటించగానే అప్పుడే భూములు లాగేసుకున్నట్లు, శ్వేత జాతి రైతులపై దాడులు, హత్యలు చేస్తున్నట్లు అంతర్జాతీయంగా నానా యాగీ చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో వ్యవసాయ సమస్య కీలకమైనదే. అక్కడి జనాన్ని భూముల నుంచి వెళ్లగొట్టి వాటిని స్వాధీనం చేసుకున్నవారు పెట్టుబడిదారీ పద్ధతుల్లో వ్యవసాయం, గనుల తవ్వకం వంటి వాటిని అభివృద్ధి చేశారు. జనాన్ని దోపిడీ, అణచివేతలకు గురిచేశారు. వ్యవసాయ పంటల ఉత్పత్తి, సంపద సృష్టి, వన్యప్రాణి రక్షణ, కనీస సదుపాయాలతో జన నివాసాల ఏర్పాటు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి వున్నాయి. జాత్యహంకార పాలన పోయింది తప్ప ఆ పాలనలో బలపడిన ఆస్తి, యాజమాన్య సంబంధాలలో పెద్ద మార్పు రాలేదు.
దక్షిణాఫ్రికాలో భూసమస్యపై గత పాతిక సంవత్సరాలలో స్థూలంగా వెల్లడైన ధోరణుల గురించి చూద్దాం. మితవాదులైన శ్వేత జాతీయులు, భూ కామందులు మొత్తంగా ఎలాంటి సంస్కరణలు జరగరాదని పట్టుబడుతున్నారు. లేదా భూములను వదులుకోవాల్సి వస్తే పెట్టుబడిదారీ మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇచ్చి తీసుకోమంటున్నారు. నయా ఉదారవాదులు అమ్మకందార్లు, కొనుగోలుదార్ల సూత్రాన్ని అమలు జరపమంటున్నారు. అంటే అది కూడా డబ్బున్న వారి యాజమాన్యంలోకే భూ బదిలీ తప్ప మరొక పురోగామి ఆలోచన కాదు. మరో వైపున భూ సంస్కరణలు ఎలా అమలు జరపాలన్న విషయంలో ఏకాభిప్రాయం లేదు. ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకోవాలి అన్నది ఒక వైఖరి. ఏ భూమిని స్వాధీనం చేసుకోవాలి, దేనిని కూడదు, అన్నది ఇంతవరకు తేల్చుకోలేదు. పట్టణ ప్రాంతాలలోని వ్యాపారులు తమ వ్యాపారాలకు గ్రామాలలో అనుబంధంగా కొన్ని వ్యవసాయ క్షేత్రాలను కలిగి వుండటానికి అనుమతించాలని కోరుతున్నారు. భూస్వాములు కోరుతున్నట్లు మార్కెట్ రేట్లకు ప్రభుత్వం కొనుగోలు చేయటం అర్థం లేని విషయం. అవన్నీ కొన్ని తరాల కింద పేదల నుంచి ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకున్నవి, కూలీలుగా వారి శ్రమను దోచుకున్న వారి ఆధీనంలో వున్నవి. అన్నింటినీ మించి నయా ఉదార వాద విధానాలలో భాగంగా ప్రభుత్వాలు ఉత్పాదక రంగాలలో పెట్టుబడులను పెట్టటం లేదు. దక్షిణాఫ్రికాలో భూ సంస్కరణలు అమలు జరిపి పేదలకు భూమిని ఇచ్చి సాగు చేయమంటే జరిగేది కాదు. ఇప్పటి వరకు వేలాది ఎకరాల క్షేత్రాలలో పెట్టుబడిదారీ పద్ధతులలో సాగును చూసిన అక్కడి పేదలు తమకు కేవలం భూమిని ఇస్తే ఏం చేసుకోవాలనే అనాసక్తత కూడా వుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అందువలన ప్రభుత్వం ఏ రూపంలో పెట్టుబడులు పెట్టాలి? ఆహార భద్రతను ఎలా చేకూర్చాలి? రైతాంగానికి గిట్టుబాటు అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటి? మొదలైన అనేక అంశాల మీద విధానపరమైన స్పష్టత వచ్చినపుడే సంస్కరణలు జయప్రదమౌతాయి.
- ఎం కోటేశ్వరరావు