ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం ప్రపంచం మొత్తం అబ్బురపడేలా నిర్మిస్తామని... అందుకు సింగపూర్ సాంకేతి కతను వినియోగించు కుంటా మని... గత మూడున్న రేళ్లుగా చెపుతూ వస్తున్నారు రాష్ట్ర ముఖ్య మంత్రి. అలాంటాయన ఆకస్మికంగా ఆంధ్రప్రదేశ్ రాజ్య మహారాజుగా తనను తాను భావించు కుంటున్నట్టు ఇటీవలి ఆయనగారి ప్రకటనల ద్వారా అర్థం అవుతోంది. దేశ, విదేశాలకు వెళ్లి, ఆధునిక నిర్మాణ నిపుణులను రప్పిం చి, కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి రూపొందించిన రాజధాని భవన నిర్మాణ కాగితపు చిత్రాన్ని చూసి... కించిత్ అసహనానికి గురై, వాటిని విసిరి పారేసి 'ఎవరక్కడీ వెంటనే 'బాహుబలి' రాజమౌళిని పిలిపించండి!' అంటూ తన మంత్రివర్యులకు హుకుం జారీ చేశారు. వెంటనే, మహా మంత్రివర్యులు... అమరావతి నిర్మాణ పర్యవేక్షణ చేస్తున్న ఓ ఐ.ఏ.ఎస్ అధికారిని వెంట పెట్టుకుని ... రాజమౌళి ఇంటి వైపు పరుగులు తీశారు. రాజమౌళిని కలిసి, ఆంధ్రప్రదేశ్ రాజ్య మహారాజుగారి ఆహ్వానాన్ని తెలిపారు. వారిద్దరూ రాజమౌళిని వెంట పెట్టుకుని తీసుకొచ్చారు. రాజమౌళిని సకల రాజమర్యా దలతో తన తాత్కాలిక పాలనా మందిరానికి ఆంధ్ర మహారాజు గారు తీసుకుని వెళ్లారు.
'బాహుబలి' సినిమా కోసం నిర్మించిన అంతర, బాహ్య ఆకృతులు తన రాజ్య నూతన అమరావతి రాజధాని నిర్మాణంలో వాడుకోవటానికి, కాపీరైట్ ఇవ్వాల్సిందిగా మంతనాలు ప్రారంభించారు.
రాజమౌళి తన తెలివితేటలతో రాజ కట్టడాలను నిర్మించి, జనాలను అబ్బురపరచి, సినిమాను అంతర్జాతీ యంగా విజయవంతం చేసి, జనాలను ఎలా మాయ చేసి...కోట్ల రూపాయలు ఆర్జించి, ప్రపంచం దృష్టిని ఆకర్షించాడో తెలుసుకున్నారు. తనను కూడా అలాగే యావత్ ప్రపంచం ఎప్పటికీ గొప్పగా చెప్పుకునేలా, ఆంధ్ర ప్రదేశ్ రాజ్యంలో ఉన్న వారి ఓట్లు తనకే వచ్చేలా ఎలా మాయ చేయాలో దౌత్య పరమైన ఆంతరంగిక చర్చలు జరిపారు.
ఒక రాష్ట్ర ముఖ్య పాలనా కేంద్ర నిర్మాణం అంటే...అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తం ఎన్ని శాఖలు ఉన్నాయి? ఎంతమంది సిబ్బంది ఉన్నారు? వారికి ఎలాంటి మౌలిక సౌకర్యాలు అవసరం? ఎంత స్థలం కావాలి? శాఖల మధ్య సమన్వయానికి... ఏఏ శాఖలు ఎక్కడెక్కడ ఉండాలి? లాంటి అనేక కీలక విషయాలపైనా సుదీర్ఘమైన అనుభవం ఉన్న వారి సేవలను మాత్రమే వినియోగించుకోవాలి. వారు మాత్రమే సరైన సలహాలు ఇవ్వగలరు. ఈ నైపుణ్యం ఐ.ఏ.ఎస్, నిత్యం పాలనలో భాగస్వాములైన ఇతర సీనియర్ అధికారులకు మాత్రమే ఉంటుంది. వీరి సూచనలతో విద్యార్హత, విశేష అనుభవం కలిగిన ఇంజనీర్లు డ్రాయింగ్స్ గీసి... కట్టబోయే నిర్మాణ ఆకృతి లోపలా, బయటా ఎలా ఉంటుందో చూపిస్తారు. నేడు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత సాయంతో... కంప్యూటర్ గ్రాఫిక్ పరిజ్ఞానాన్ని వినియోగించి, నిర్మించ బోయే కట్టడాల అంతర్, బాహ్య భాగాలు ఎలా ఉండబోతు న్నాయో దృశ్య రూపంలో చూడవచ్చు. ఈ విధంగానే ఎంతో మంది నిపుణులు తయారు చేసిన ఆకృతిని కాదని, ఉన్నతాధి కారులను సినిమా వాళ్ళ దగ్గరకు పంపటం ఏంటి? అసలు 'బాహుబలి' రాజమౌళికి ఉన్న అర్హత ఏంటి? ప్రభుత్వ పాలనలో అక్షరాభ్యాసం కూడా చేయని వ్యక్తి ... ఆధునిక రాజధాని నిర్మాణం ఎలా వుండాలో ఓనమాలు కూడా తెలియని వ్యక్తి... మీకు ఏవిధమైన సహాయం అందిస్తాడు? ఆయన సినిమా సెట్టింగు పరిజ్ఞానంతో ఇచ్చే సలహాను తీసుకుని, దానినే గొప్ప భాగ్యంగా భావించి, ఆంధ్ర వాళ్లకు రాజధాని నిర్మిస్తే... పూర్తి అయిన తరువాత... ఇది కత్తి యుద్ధాలకు, సుత్తి సమావేశాలకు తప్ప ఎందుకూ పనికిరాదని తేలితే... ఈ భారీ నష్టానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? రాజమౌళి ఓ సినిమాను విజయవంతం చేయటానికి కథకు తగ్గ ఆకృతిని కళాకారులతో గీయించి ఓ అందమైన రాజ్యాన్ని తాత్కాలికంగా సృష్టించి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, డబ్బులు తీసుకుని వినోదపరిచాడు. దీనినే ప్రపంచంలోని అందరి నిపుణులను తలతన్నేటంతటి అర్హతగా భావిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఓ పాతకాలం కథ చెపుతాను.
ఓ మహారాజు గారు చెవిలో గుబులు తీయించు కోవటానికి తన సైన్యంలో ఉన్న మంచి నైపుణ్యం ఉన్న ఓ వ్యక్తికి కబురు పెట్టాడు. అతను వచ్చేలోగా... నిద్ర వచ్చి, పడక కుర్చీలోనే నిద్రపోయాడు. వచ్చిన సైనికుడు, మహారాజుగారి నిద్రకు భంగం కలగకుండా రాజు చెవిలో గుబులు తీసి వెళ్ళిపోయాడు. రాజు నిద్ర లేచి గుబులు శుభ్ర పరచిన విషయాన్ని గమనించి అబ్బుర పడిపోయాడు. వెంటనే ఆ సైనికుని పిలిపించి గుబులు తీసే విద్యలో అతనికి ఉన్న అద్భుత నైపుణ్యాన్ని మెచ్చుకుని, అతన్ని వెంటనే తన సర్వసైన్యానికి అధిపతిగా పదోన్నతి కల్పించాడు. కొంతకాలం తరువాత శత్రురాజు ఆ మహారాజుపైన యుద్ధం ప్రకటించ టంతో... తాను పదోన్నతి కల్పించిన సర్వసైన్యాధిపతిని పిలిచి 'యుద్ధాన్ని ఎదుర్కోవటానికి సైన్యాన్ని సిద్ధం చేయండి' అని ఆదేశించాడు. అప్పుడు ఆ సర్వసైన్యాధిపతి మహారాజుతో ఇలా అన్నాడు 'మహారాజా... ఈ యుద్ధాలు, గొడవలు మనకెందుకు? నాకు తెలిసిన విద్య మీకు నేర్పుతాను, ఇద్దరం బయటకు వెళ్లి రోజుకు ఓ డజను మంది చెవుల్లో గుబులు తీసినా, మన కుటుంబాలను పోషించుకోగలం' అన్నాడు.
రేపటి రోజున రాజమౌళి సాంకేతికత.... బాబు మహారాజు గారి మెడకు చుట్టుకుని... జనాలు ఉన్న పదవిని ఊడిపోయేలా చేస్తే! అప్పుడు బాబు మహారాజు గారు రాజమౌళిని పిలిచి 'ఏందీ సారూ ఇలా చేశారూ.. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి?' అని అడిగితే! అప్పుడు ఆయన 'మనకు ఎందుకొచ్చిన రాజకీయాలు సార్! నా సినిమాలు నాకున్నా యి... మా ప్రొడ్యూసర్లతో చెప్పి ఏ కుటుంబ పెద్దాయన పాత్రో, కట్టప్ప వేషమో మీకు ఇప్పిస్తాను. ఏడాదికి రెండు సినిమాలు చేసుకున్నా, ఏ గొడవలూ లేకుండా హాయిగా బతికేయవచ్చు' అనే సమాధానం మా ఆంధ్ర పెద్ద సారు వినకూడదనే ఈ ఉదాహరణ చెప్పాను.
రాజమౌళి రూపొందించిన రాజరికపు కట్టడాలు.... నేడు ప్రపంచంలో ఎవ్వరూ ప్రభుత్వపరంగా గాని, వ్యక్తుల పరంగా గాని నిర్మించటం లేదు. ఆయన నిర్మించిన రాజ్యం కట్టడాలు, అంతఃపుర వినోదాలకు ... అధికారం కోసం చేసుకునే యుద్ధాలకు పనికొచ్చే డిస్పోజబుల్ సెట్టింగులు మాత్రమే. ఆయన జనాలచేత గుర్తింపు పొందిన గొప్ప సినీ కళాకారుడు. తనకున్న కళ ద్వారా అందమైన దృశ్యాలను తయారు చేసి, ప్రజలను తాత్కాలికంగా వినోద పరచగలరు. మరి... బాబు మహారాజ్ కూడా, ఆంధ్రులకు అద్భుత రాజధాని పేరిట జనాలను తాత్కాలికంగా వినోదపరిచే కార్యక్రమం పెట్టుకున్నారా? అసలే అన్యాయం అయిపోయిన ఆంధ్ర జనాలకు చెందిన వేల కోట్ల రూపాయల సొమ్ముతో నిర్మించే ముఖ్య పట్టణం ఎంతో జాగ్రత్తతో... ముందుచూపుతో కట్టాలి. ఇప్పటి వరకు అమరావతి నిర్మాణం విషయంలో ఆంధ్ర పెద్దాయన చెబుతూ వస్తున్న మాటలు ఎంతో ఆశాజనకంగా ... ఆంధ్ర జనాలు సింగపూర్ కలల్లో తేలియా డటానికి అనువుగా ఉండేవి. ఇప్పటి 'బాహుబలి' రాజమౌళి సాంకేతికత వినియోగించుకోవాలన్న ఆంధ్ర మహారాజ్ గారి ప్రకటనతో ... ఒక్కసారిగా సింగపూర్ కల నీరుగారిపోయింది. ఇది ఎలాంటిదంటే ...!!
ఒకతను నీళ్లలో కొట్టుకుపోతుంటే...మరొకతను నీళ్ళలోకి దూకి, కొట్టుకుపోతున్న అతన్ని కాపాడి ఆశ్రయం ఇచ్చాడు. ఇది చూసిన వారందరూ అతని గొప్పతనాన్ని మెచ్చుకొన్నారు. రెండవ రోజు ఉదయం చూస్తే ... మొదటి వాడు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. ఎలా జరిగిందని జనాలు అడిగారు. అప్పుడు రక్షించినతడు 'నిన్న నీళ్లలో పడి బాగా తడిచి పోయాడు, జలుబు చేస్తుందని భయపడి... మెడకు తాడు కట్టి ఆరబెట్టాను' అన్నాడు. ఇది విన్న జనాలకు అనుమానం వచ్చి ఆరా తీస్తే తెలిసింది ఏమిటంటే .... అతన్ని నీళ్ళలోకి నెట్టింది కూడా రెండవ వాడేనని. జనాల మెప్పుకోసమే ఇలా చేసాడని తేలింది. అయితే... బుర్ర లోపల ఉన్న మెదడు ఎదుగుదల లోపం కారణంగా, ఆరబెట్టే పద్ధతిలో పప్పులో కాలు వేసాడని జనాలు గ్రహించారు. అలాంటి పప్పులో కాలు ఇప్పటి బాహుబలి రాజమౌళి సాంకేతికత కాకూడదన్నదే అభిలాష. ఇప్పుడు నా భయమల్లా ఏంటంటే ...!! పాకిస్తానుతోనో, మరో దేశంతోనో యుద్ధం వస్తే.... ఢిల్లీ పెద్దాయనతో, ఈ ఆంధ్ర పెద్దాయనకు ఉన్న స్నేహ సంబంధాన్ని వినియోగించుకుని ... ఢిల్లీ పెద్దాయన దగ్గరకు వెళ్లి మా ఆంధ్రాలో గొప్ప యుద్ధ సాంకేతికత ఉంది... దాన్ని వినియోగించామంటే ఒక్కరోజులోనే విజయాన్ని సాధిస్తాం... ఏ దేశమైనా తోక ముడుచుకుని పోవాల్సిందే ! అని ఒప్పించి... కత్తులు, బల్లేలు తగిలించి 'బాహుబలి' ప్రభాస్ సైన్యాన్ని పంపుతాడేమోనని!
- మాదివాడ రామబ్రహ్మం.
madivadarb@gmail.com
సినిమా చూపిస్తున్న బాబు మహారాజు !
