సామాన్య జనంలో సినిమా వారి పట్ల వున్న ఉత్సుకత, అభిమానం ఆధారం చేసుకొని అటు కార్పొరేట్ మీడియా ఇటు ప్రభుత్వం కల గలిపి గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పక్కదారి పడుతున్నాయి.
హైదరాబాద్‌లో సినిమా వాళ్లు మత్తు మందు తీసుకొని ఎంత మైకంలో తుళ్లి పడ్డారనేది తెలీకపోవచ్చు! అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు మీడియా 10 రోజుల పాటు పూర్తి మైకంలో ముంచెత్తింది. ఎపిలో ఈ వార్తల జోరు కొంత తగ్గినా తెలంగాణలో మాత్రం తగ్గిన జాడ లేదు. మత్తు మందులకు సంబంధించిన వార్తల సాగతీతను పరిశీలిస్తే ఒక విషయం బోధపడుతుంది. కార్పొరేట్ సంస్థల ఆధీనంలో ప్రచార సాధానాలుంటే వాటి వ్యవహార శైలి ఎలా వుంటుందో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అనంతం. మియాపూర్ భూముల కుంభకోణాన్ని మరుగు పరచేందుకే తెలంగాణ ప్రభుత్వం పథకం ప్రకారం 'డ్రగ్స్ కేసు'ను తెర మీదకు తెచ్చిందనే అనుమాలూ లేకపోలేదు. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ ఉపకరణం మాత్రమే. కానీ ఇవేవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మీడియాకు పట్టలేదు. డ్రగ్స్ సేవించారన్న ఆరోపణతో సినిమావారిపై జరుగుతున్న విచారణకు మరికొంత మసాలా జోడించి వెల్లడించడంలో తలమునకలుగా వున్నాయి. ఇటీ వల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు రెండు సభల్లో కూడా రైతుల సమస్యలు, గోగూండాల అరాచకాలపై పెద్ద దుమారం చెలరేగింది. అయితే తెలుగు పత్రికలలో, తుదకు టీవీ ఛానళ్లలో కూడా ఈ వార్తలకు చోటు దక్క లేదు. టీవీ ఛానళ్లు 9 గంటల వార్తలను కూడా పక్కన బెట్టి సినిమావారి విచారణ అంశాలపైనే ప్రసారాలు చేశాయి. ఇదం తా కూడా ఒక పథకం ప్రకారం సాగుతున్నట్లు కనిపిస్తోంది.
ఎపి విషయానికొస్తే అనంతపురం జిల్లాలో 6 లక్షల హెక్టార్లకు గానూ 60 వేల హెక్టార్లు కూడా సాగు కాలేదు. పెట్టిన పంటలు ఎండి పోతున్నాయి. చిత్తూరు జిల్లాలో 1,29,743 హెక్టార్లు సాగు కావాల్సి వుండగా 91,504 హెక్టార్లు మాత్రమే సాగు అయ్యింది. 5 వేల హెక్టార్ల వేరుశనగ పంట ఎండిపోతోంది. రాయలసీమ మొత్తంగా ఇదే పరిస్థితి. ఉత్తరాంధ్ర అంశానికొస్తే మూడు సంవత్సరాల తరువాత గానీ నాగావళి, వంశధార నదుల అనుసంధానం ప్రభుత్వానికి గుర్తు రాలేదు. రైతు, డ్వాక్రా రుణమాఫీల విషయం ఒక కొలిక్కి రాకముందే ... ప్రభుత్వానికి ఇప్పుడు నిరుద్యోగ భృతి గుర్తు కొచ్చింది. తెలంగాణ అంశానికొస్తే రైతుల పోరాటాలు ఉధృత మౌతున్నాయి. ప్రాజెక్టు రీ డీజైనింగ్లో కుంభకోణాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. ఇక మియాపూర్ భూముల స్కాం సరే సరి. ఇసుక మాఫియా చెలరేగి పోయింది. ఇదీ రెండు తెలుగు రాష్ట్రాల దుర్భర స్థితి. ఈ అంశాలపై రాష్ట్రం లోని ఏ ఒక్క తెలుగు టీవీ ఛానల్ కూడా చర్చా వేదిక నిర్వహించలేదు. కానీ సినిమా వారి డ్రగ్స్ అంశానికొచ్చే సరికి గంటలకొద్దీ ప్రసారాలు సాగించాయి. ఒక పక్క కెసిఆర్‌ను అశోకునితో పోలుస్తున్న మీడియా మరో పక్క చంద్రబాబు కీర్తి పది తరాలు మరిచిపోరనే విధంగా పొగడ్తలతో తరిస్తోంది. ప్రచార సాధనాలు పెట్టుబడిదారీ వర్గాల చేతుల్లో ఉంటే ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం. ప్రజల బలహీనతలపై వ్యాపారాలు చేసేందుకు కథలు అల్లుతుంటారు. ఒక్కో సందర్భంలో పెట్టుబడిదారీ వర్గంలో తలెత్తే అంతర్గత పోరా టాలు కూడా ప్రజలను మెప్పించే విధంగా చూపెడుతుంటారు. ఇందుకు జగన్ మోహన్‌రెడ్డి కేసుల విచారణే తార్కాణం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్రెడ్డిపై సిబిఐ కేసు నమోదు చేసి విచారణ సాగించిన తంతు ప్రతి రోజూ మీడియాలో వచ్చేది. ప్రస్తుతం తెలంగాణలో కూడా సినిమా వారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాగిస్తున్న విచారణ కూడా రోజు వారీ మీడియాలో పూస గుచ్చినట్లు వస్తోంది. ఆ రోజుల్లో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వ్యవహార శైలి, నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ వైఖరి ఒకే విధంగా వుంది. వీరిద్దరినీ మీడియా ఆకాశానికెత్తింది. అయితే వారి నిజాయితీ పక్కనబెడితే వృత్తిపరంగాను, చట్టబద్ధంగాను చార్జిషీట్ దాఖలు చేసే వరకు నిందితులు, సాక్షుల వాంగ్మూలాలు వెల్లడి కాకుడదనే చట్ట నిబంధనకు నీళ్లొదిలినట్లు కనిపిస్తోంది. సినిమా వారిపై సాగుతున్న విచారణ శైలి ఏ రోజుకారోజు మీడియాలో వస్తోంది. ఒకరికి మించి మరొకరు పోటీలు పడి పక్షం రోజల పాటు వార్తలు ఇచ్చారు. తెలంగాణలోను ఇటు ఎపిలోను మరే సమస్య లు లేనట్లు వీటికే ప్రాధాన్యత ఇచ్చారు. దురదృష్టమేమంటే సినిమా వారిని విచారించే సందర్భంగా పక్కన విలేకరి కూర్చొని నోట్ చేసుకుని రిపోర్టు ఇచ్చినట్లే వార్తలు వెలువడ్డాయి. మీడియా ఇచ్చిన - ఇస్తున్న రిపోర్టింగ్ సరికాదని డైరెక్టర్ అకున్ సభర్వాల్ ఒక్క సందర్భంలో కూడా ఖండించలేదు. సామాన్య జనంలో సినిమా వారి పట్ల వున్న ఉత్సుకత, అభిమానం ఆధారం చేసుకొని అటు కార్పొరేట్ మీడియా ఇటు ప్రభుత్వం కల గలిపి గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పక్కదారి పడుతున్నాయి. తెలంగాణలో రాజకీయ పార్టీలు సాగిస్తున్న ఆందోళనా కార్యక్రమాలకు ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహం, ఆవేదనకు మీడియాలో సముచిత స్థానం లభించడం లేదు. సినిమా వారిపై జరుగుతున్న విచారణ ఒక్కో రోజు ఒక్కొక్క గమ్మత్తు కథగా మీడియా చిత్రిస్తోంది. ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ కథంతా నడుపుతున్నదనే అనుమానం పలువురిలో లేకపోలేదు. ఇదిలా వుండగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ తాము సుప్రీంకోర్టు ఆదేశించిన సూత్రాల ప్రకారమే విచారణ సాగిస్తున్నట్లు చెప్పారు. తమ విచారణపై అనుభవ రాహిత్యంతో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, తమ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతవరకు బాగానే ఉంది. ఈ రోజు వరకు సాగిన విచారణపై మీడియా వెలువరించిన కథనాలు వాస్తవమేనని డైరెక్టర్ అకున్ సభర్వాల్ అంగీకరిస్తున్నారా? నిజమే అయితే మీడియా వారికి ఈ సమాచారం ఎలా చేరింది? ఊహించి రాయడం సాధ్యమయ్యే పనేనా? లేదా మీడియా వెల్లడించిన సమాచారం తప్పయినప్పుడు ఎందుకు ఖండించలేక పోయారు? ఇదంతా పరిశీలిస్తే ఒక విధమైన ఉన్మాదం సృష్టించడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.
మాదక ద్రవ్యాల విషయంలో తాజాగా హైదరాబాద్ లోని ఐటి రంగానికి చెందిన వారు కూడా తెరమీదకు వచ్చారు. అయితే ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకునే అవకాశమే లేదు. అదే జరిగితే ఐటి కంపెనీలు బిచాణా ఎత్తివేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కుప్పకూలుతుంది. ఈ పాటికే తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు సినిమా వారి విచారణ కూడా ప్రాంతీయ భావాలకు బీజం పడుతుందనే వాదన మీడియాలో వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా ఏక పక్ష వైఖరి కొనసాగిస్తే తన గొయ్యి తనే తవ్వుకున్నట్లువుతుంది. ఇటీవల నగరంలో పబ్ కల్చర్ విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఈజీ మనీ కూడేసుకుంటున్న సంపన్న కటుంబాల లోని యువతీ యువకులు పబ్ కల్చర్‌కు బాగా అలవాటు పడ్డారు. ఫలితంగా డ్రగ్స్ వాడకం అన్ని రకాలైన వారిని చుట్టుముట్టింది. తెలంగాణ ప్రభుత్వం కాని ఎపి ప్రభుత్వం కానీ మత్తుమందులను నిరోధించడంలో ఇంతకన్నా ఎక్కువ జాగ్రత్త వహించాలి. మత్తు మందు సరఫరా చేసే వారికి, మత్తు మందు వాడే వారికి మధ్య వున్న స్పష్టమైన సరళ రేఖ చెరిపి వేయకుండా ఇలాంటి కేసుల సందర్భంలో విచారణ సాగించాలి. అందరినీ ఒకే గాటన కడితే పైగా ప్రస్తుతం తెలంగాణలో సాగుతున్న విచారణ తంతు ఇదే విధంగా సాగితే సత్ఫలితాలకన్నా దుష్ఫలితాలే ఎదురౌతాయి. అంతేకాకుండా పాపులారిటీని పావుగా ఉపయోగించుకొని పాలక వర్గాలు తమ చేతుల్లో వున్న మీడియాను ఉపయోగించి ప్రజల సమస్యలు పక్క దారి పట్టించే విధంగా వ్యవహరించడం ఎంతో
కాలం సాగదు కూడా.
- వి. శంకరయ్య
(రచయిత విశ్రాంత పాత్రికేయుడు), 9848394013 .
'మత్తు'లో పడి పక్కదారి పట్టిన ప్రజల గోడు!
