నగరంలో ట్రాఫిక్ సిగల్స్ ప్రారంభం
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఎస్పి గోపినాథ్ జెట్టి
ప్రజాశక్తి - కర్నూలు క్రైం
నగరంలో ట్రాఫిక్ సిగల్స్‌ను ప్రతి వాహనదారుడు పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్పి గోపినాథ్ జెట్టి హెచ్చరించారు. నగరంలోని ప్రధాన కూడళ్లల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఏర్పాటు చేసిన సిగల్స్‌ను ఎస్పి గోపినాథ్ జెట్టి ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హరినాథ్ రెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి శనివారం ప్రారంభించారు. స్థానిక రాజ్‌విహార్ సెంటర్లో స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ఒక ట్రాఫిక్ సిగల్ 10 మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో సమానమన్నారు. నగరంలో మొత్తం 16 సిగల్స్ వినియోగంలోకి తెచ్చామని తెలిపారు. వాహనచోదకులు సిగల్స్‌ను గమనిస్తూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. దాతల సహకారంతో అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఒక టోయింగ్ వాహనాన్ని తెప్పించామన్నారు. మున్సిపల్ ఆఫీసు వారి సహకారంతో 2 టోయింగ్ వాహనాలను కూడా వినియోగంలోకి తీసుకువచ్చామని తెలిపారు. గడివేముల వద్ద ఉన్న జిందాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన 6 ట్రాఫిక్ మొబైల్ వాహనాలను కూడా వినియోగంలోకి తెచ్చామని పేర్కొన్నారు. 5 స్పీడ్ లేజర్ గన్స్, ఒక ఇంటర్ సెప్టర్ వాహనం, ఒక ట్రాఫిక్ అవగాహన వాహనం, 83 బ్రీత్ ఎనలైజర్లు, 30 మ్యాన్ ప్యాక్స్, 52 బ్లూ టూత్ అండ్రాయిత్ ప్రింటర్స్ తదితర ఉపకరణాలను వినియోగిస్తూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పీ సి.ఎం.గంగయ్య, టౌన్ డిఎస్పీ యుగంధర్ బాబు, ట్రాఫిక్ సిఐ గుణశేఖర్ బాబు, అనలాగ్ డిజిటల్ మేనేజర్ అమలరాజు (కోయంబత్తూరు), టెక్నికల్ అసిస్టెంట్స్ ప్రభు, శ్రీనివాస్, శరత్‌లు పాల్గొన్నారు.
సులభ్ కాంప్లెక్స్ ప్రారంభం
కర్నూలు కార్పొరేషన్ : నగరంలోని పాతబస్టాండ్‌లో పోలీస్ పెట్రోల్ బంకు పక్కన కర్నూలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.18 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సులభ్ కాంప్లెక్స్(టాయిలెట్స్ సముదాయం)ను శనివారం ఎంపి బుట్టా రేణుక, ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, ఎస్పీ గోపీనాథ్ జెట్టి, కమిషనర్ సిబి. హరినాథ్ రెడ్డి, కుడా సంస్థ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అనంతరం కర్నూలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీ కింద జిల్లా పోలీస్ శాఖకు అందజేసిన టోయింగ్ వెహికల్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
నగరంలో ట్రాఫిక్ సిగల్స్ ప్రారంభం
