ప్రజాశక్తి - ఘంటసాల:
నిషేధిత భూముల నుంచి పేద రైతుల భూములను తొలగించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై. కేశవరావు డిమాండ్ చేశారు. ఘంటసాల తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 సంవత్సరాల నుంచి సాగుచేసుకుంటున్న శ్రీకాకుళం, అచ్చంపాలెం, పాపవినాశనం, కొడాలి గ్రామాల్లోని సాగు భూములను నిషేధిత భూముల నుంచి తొలగించకపోతే ఆందోళన తప్పదన్నారు. 1956 ఈనాం యాక్టు ద్వారా రైతులకు సంపూర్ణ హక్కు వచ్చిందని, వాటిని ఇప్పుడు ఎండోమెంట్, రెవెన్యూ వారు తిరిగి ఇవ్వమంటున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. జమిందారుల కాలం నుంచి రైతులకు వాటిపై పూర్తి హక్కు ఉందని, వాటికి సంబంధించిన దస్తావేజులు, లింకు దస్తావేజులు, అడంగల్, ఆర్వోఆర్ శిస్తులు అన్ని రైతుల పేరున ఉన్నాయని గుర్తు చేశారు. సుమారు 50 సంవత్సరాల క్రితం హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చిందని, అప్పటి నుంచి సదరు భూములు అమ్మకం, కొనుగోలు జరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళుచేసి భూములను పసుపు, కుంకుమ కింద ఇచ్చారన్నారు. ఇప్పుడు దేవస్థానం వారు ఆ భూములపై ఆంక్షలు విధించటంతో దాదాపు 400 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. సాగుచేసే రైతులకే ఈ భూములపై హక్కు ఉందని, దేవస్థానం వారికి ఏవిధమైన హక్కు లేదని, ఆ భూములపై రైతులకు సర్వహక్కులు ఉంటాయని, అలాంటి హక్కులున్న భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నాయకులు డిటి గోపాలరావుకు వినతిపత్రం అందజేశారు. అచ్చంపాలెం మాజీ సర్పంచ్ ఆర్.రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం తూర్పు కృష్ణా కార్యదర్శి మాగంటి హరిబాబు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు వాకా రామచంద్రరావు, రైతులు అగ్నిహోత్రం సత్య నారాయణచార్యులు, డొక్కు వెంకటేశ్వరరావు, డొక్కు శ్రీనివాసరావు, డొక్కు రమేష్, టి.ముసలయ్య, పెద్ద సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు.