యుద్ధ విమాన కొనుగోలులో భారీ కుంభకోణం
రూ.లక్షా ముప్పైవేల కోట్ల కాంట్రాక్ట్‌ను అంబానీకి అప్పగింత
సిడబ్ల్యుసి సభ్యులు చాకో కేంద్రం పై ధ్వజం
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ
రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని ఎఐసిసి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పి.సి.చాకో బిజెపి ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. స్థానిక ఇందిరా భవన్లో శుక్రవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో యుపిఎ ప్రభుత్వం 2012లో 126 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని అంతర్జాతీయ బడ్స్ ప్రకటించిందని తెలిపారు. ఒక్కో యుద్ధ విమానం రూ.526కోట్లు అని తెలిపారు. ఈ లెక్కలో మొత్తం 36యుద్ధ విమానాలు సుమారు రూ.18.940కోట్లు ఖర్చు అయి ఉండేదన్నారు. అందుకు భిన్నంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ.60.145కోట్లకు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ ఒప్పందం కారణంగా మన దేశానికి రూ.41.205కోట్లు అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ప్రకారం అధనపు భారం దేశ ప్రజల పై పడుతుందన్నారు. ప్రజలకు మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. విమానాల ఒప్పందాన్ని ప్రముఖ కాంట్రాక్టర్, పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి మోడీ అప్పజెప్పారని ఆరోపించారు. ఈ ఒప్పందం చీకటి ఒప్పందంగా మోడీ అనిల్ అంబానికి అప్పజెప్పారని విమర్శించారు. జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఫ్రాన్స్, ఇండియాకి మధ్య జరిగిన ఒప్పందం ఒక రహస్య ఒప్పందమని బిజెపి ప్రభుత్వం చెప్పడం ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కేబినెట్ ఆమోదింప జరగాల్సిన ఉండగా అలా జరగలేదని ఆరోపించారు. అందుకు భిన్నంగా మోడీ సొంతంగా ఫ్రాన్స్కెళ్లి ఒప్పందం కుదుర్చుకోవడం ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇటువంటి చీకటి ఒప్పందాలు కుదుర్చుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశానికి సంబంధించిన యుద్ధ విమాన తయారీలో అనుభం ఉన్న హెచ్.ఎ.ఎల్.(హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్)కు కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. విమానాల తయారీలో ఎటువంటి అనుభవంలేని ప్రయివేట్ పారిశ్రామిక వేత్త, డెఫెన్స్లో అనుభవంలేని అంబానీకు ఇవ్వడం అన్యాయమన్నారు. సుమారు రూ.30వేల కోట్ల కాంట్రాక్టును అంబానీకు ముట్టచెప్పారని ప్రశ్నించారు. దేశ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు అబద్ధాలు చెప్పడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు నరేంద్రమోడీ పాలనకు త్వరలో స్వస్థి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, డిసిసి అధ్యక్షులు పనబాక కృష్ణయ్య, సీనియర్ నాయకులు సి.వి.శేషారెడ్డి, చేవూరు దేవకుమార్‌రెడ్డి, ఉడతా వెంకట్రావు, పత్తి సీతారాంబాబు, నాయకులు శివప్రసాద్, నాగేంద్ర, షేక్.ఫయాజ్, ఆర్.వి.రమణయ్య పాల్గొన్నారు.
యుద్ధ విమాన కొనుగోలులో భారీ కుంభకోణం
