- చల్లపల్లి స్వరూపరాణి, 9440362433
నూనూగు యవ్వనంలో
నిప్పులగుండం తొక్కినవాడా !
యెగుడుదిగుడు లోకంతీరుకు
విముఖుడైన సిద్ధార్ధుడివి నువ్వు
బందిఖానా గుహలో
నువ్వే ఆకుపచ్చని సూరీడు వేకువకోసం
ముళ్ళబాటలో చెప్పుల్లేకుండా పరుగెత్తడమే
నువ్వు యెంచుకున్న నడక
మందిని పోగుజేసి మాటలు కలపడమంటే
నీకు కొండెక్కినంత సంబరం కదూ!
విలువల పాత అంగీ తొడుక్కుని
ఆకలిని చప్పరించినోడా!
నగరం నగిషీల పక్కన
అనామకంగా సంచరించే
అభిమాన ధనుడవు నువ్వు
అంపశయ్య మీదనుంచి
నెలవంకల్ని కలగన్న స్వాప్నికుడా!
మా నల్ల చీమల బారులో
నువ్వు జెండా చెట్టై
నవ్వుతూ నిలబడతావు!
జెండా చెట్టు
