* దాఖలు చేసిన చట్టబద్ధ వారసుడు మౌలానా
న్యూఢిల్లీ : అయోధ్య స్థలంలో రామాలయం నిర్మించుకోవచ్చునని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వివాద స్థలి వాస్తవ కక్షిదారు ఎం సిద్ధిఖీ చట్టబద్ధ వారసుడైన మౌలానా సయ్యద్ ఆషాద్ రషీది రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ముస్లింల తరుపున దాఖలైన తొలి రివ్యూ పిటిషన్ ఇదే. సుప్రీంకోర్టు తన తీర్పును పునర్ పరిశీలిం చాలని కోరారు. ఈ తీర్పులో తీవ్రమైన తప్పులు ఉన్నాయని, వాటిని సమీక్షించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. 1934, 1949, 1992లలో జరిగిన నేరాలకు ప్రతిఫలం ఇచ్చి సుప్రీంకోర్టు తప్పు చేసిందని పిటిషన్లో రషీది పేర్కొన్నారు. ఈ చర్యలు చట్టవిరుద్ధమని
చెప్తూనే హిందూ పార్టీలకు హక్కు కల్పించడం తప్పు అని పేర్కొన్నారు. 1934లో మసీదు బురుజులను ధ్వంసం చేయడం దగ్గర నుంచి 1992లో బాబ్రీ మసీదును ధ్వంసం చేయడం వరకు జరిగినదంతా చట్టవిరుద్ధమని పేర్కొన్న తర్వాత కూడా హిందువులకు అనుకూలంగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏ విధంగా తీర్పు చెప్తుందని ప్రశ్నించారు. హిందూ పార్టీలకు హక్కును మంజూరు చేయడం ద్వారా చట్టవిరుద్ధత నుంచి ఎవరూ లబ్ధి పొందరాదనే మౌలిక సూత్రాన్ని సుప్రీంకోర్టు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ సమస్య సున్నితమైనదని తెలుసునని, దీనికో పరిష్కారం ఉండాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యాయం జరగకుండా శాంతిసామరస్యం సాధ్యం కాదని అన్నారు. సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తూ, అయోధ్యలో రామాలయాన్ని నిర్మించుకునేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గత నెలలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
అయోధ్య తీర్పుపై తొలి రివ్యూ పిటిషన్
