* రూ.40 వేల కోట్లను కేంద్రానికి కట్టబెట్టేందుకు పక్కా 'స్కెచ్'
* బిజెపి నేత అనంత్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు, తోసిపుచ్చిన ఫడ్నవీస్
* ఇదే బిజెపి నిజస్వరూపమన్న కాంగ్రెస్
* అది నిజమైతే ప్రధాని రాజీనామా చేయాలి : ఎన్‌సిపి
న్యూఢిల్లీ : దేవేంద్ర ఫడ్నవీస్ హడావుడిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వెనుక ఆంతర్యం వేరని బిజెపి నేత అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉన్న కేంద్ర నిధులైన 40 వేల కోట్లను తిరిగి కేంద్రానికి అప్పగించేందుకు ఈ హైడ్రామాకు పాల్పడ్డారని అన్నారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలో నిలిచే కర్ణాటక ఎంపి అయిన హెగ్డే..కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ నగదును కేంద్రానికి సురక్షితంగా అప్పగించేందుకు ఫడ్నవీస్ 15 గంటల సమయం పట్టిందని చెప్పారు. ' ఇటీవల మహారాష్ట్రలో కేవలం 80 గంటలు మా నేత ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనంతరం రాజీనామా చేశారు. ఈ డ్రామా ఎందుకు చేయాల్సి వచ్చిందీ? మెజార్టీ లేదని? మీకు తెలియదా. ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారు? ఈ ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు' అంటూ... కేంద్ర నిధులు 40 వేల కోట్లను తరలించేందుకేనని, ముందస్తు పథకం ప్రకారం ఫడ్నవీస్ హడావుడిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారని, 15 గంటల్లో కేంద్రానికి నిధులను అప్పగించారని చెప్పారు. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌లు అధికారంలోకి వస్తే ఆ నిధులు దుర్వినియోగమయ్యేవని చెప్పుకొచ్చారు.
అవి నిరాధారమైన వ్యాఖ్యలు : ఫడ్నవీస్
కాగా, తన సహ నేత అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యలను ఫడ్నవీస్ తోసిపుచ్చారు. ఆయన చెప్పినవన్నీ అవాస్తవాలని, అటువంటిదేమీ చోటుచేసుకోలేదని, తాను పదవిలో ఉండగా విధాన పరమైన నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ రైలు ప్రాజెక్టును చేపట్టనుందని చెప్పారు.. 'దీనిని నూతన ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఇందు నిమిత్తం కేవలం భూ సేకరణ బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. దీని నిమిత్తం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. అది కోరలేదు. కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధులు ఎలా పంపిణీ జరుగుతాయో, ఆ రెండింటి మధ్య అకౌంటింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలిసిన వారు ఈ నిరాధారమైన ఆరోపణలు చేయరు. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ దర్యాప్తు చేయవచ్చు' అని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.
బిజెపి వాస్తవ రూపం బహిర్గతమైంది : రణదీప్ సూర్జేవాలా
అనంత్ హెగ్డే వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్పందించారు. ' మోడీ ప్రభుత్వ 'పండోరా బాక్స్' (కష్టాలను కొనితెచ్చేది) బిజెపి ఎంపి తెరవడం ద్వారా...మహారాష్ట్రలోని ఆ పార్టీ అసలు స్వరూపం బయట పడింది. సమాఖ్య నిర్మాణం కోసం పాటుపడుతున్నారా? ప్రజలు, రైతుల సంక్షేమం కోసం కేటాయిం చిన రూ.40 వేల కోట్లను కుట్ర పన్ని ఉపసంహరించుకున్నారా? దీనికి ప్రధాని మోడీయే సమాధానం చెప్పాలి' అంటూ ట్వీట్ చేశారు.
అదే నిజమైతే ప్రధాని రాజీనామా చేయాలి : నవాబ్ మాలిక్ డిమాండ్
అంత పెద్ద మొత్తంలో నిధులు కేంద్రాన్ని బదిలీ చేయడం అసాధ్యమని ఎన్‌సిపి నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. బిజెపి ఓటమిని జీర్ణించుకోలేకే ఇటువంటి వదంతులను వ్యాప్తి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే నిజమైతే బిజెపి అసలు స్వరూపం బయట పడ్డట్లేనని, వెంటనే ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నమ్మక ద్రోహం : సంజయ్ రౌత్
80 గంటల్లో 40 వేల కోట్ల నిధులను కేంద్రానికి తిరిగి పంపడం రాష్ట్రానికి చేసిన నమ్మక దోహ్రమని శివసేన నేత సంజయ్ రౌత్ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు బిజెపి, ఫడ్నవీస్‌లను నేరస్తులుగా భావిస్తున్నారని అంటూ దీనిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాఖరే స్పష్టతనిస్తారని అన్నారు.