- కాషాయికరణకు అనుగుణంగా ఎన్ఈపి
- ఎన్ఈపి వ్యతిరేక ర్యాలీలో డి.రాజా, సుభాషిణీ అలీ
- పాల్గొన్న విద్యార్థి, ప్రొఫెసర్ల సంఘాలు
- ''చిల్డ్రన్స్ డే'' నాడు చిన్నారుల సంఘీభావం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో విద్యా రంగాన్ని సర్వనాశనం చేసేందుకు మోడీ సర్కార్ కంకణం కట్టుకుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణీ అలీ విమర్శించారు. మనుస్మృతిని విద్యా రంగంలో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించారని దుయ్యబట్టారు. నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా గురువారం నాడిక్కడ జరిగిన భారీ ర్యాలీలో ఢిల్లీ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ (డియుటిఎ), ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ యూనివర్శిటీస్ టీచర్స్ అసోసియేషన్ (ఎఫ్ఈడిసి యుటిఎ) నేతృత్వంలో స్థానిక మండిహౌస్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకు వేలాది మంది ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో నూతన విధానానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. అలాగే మోడీ సర్కార్‌కు, ఎన్‌ఈపికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలతో హోరెత్తించారు. ఎస్ఎఫ్ఐ, జెఎన్‌యు ఎస్యు, ఎఐఎస్ఎ, కెవైఎస్, డిఎస్ఎఫ్, డిఎస్‌యు, ఎఐఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు ''చిల్డ్రన్స్ డే'' సందర్భంగా చిన్నారులు ఈ పోరాటానికి సంఘీభావం తెలిపారు. ''ఎన్ఈపి-2019 తిరస్కరించండి...విద్యా రంగాన్ని కాపాడండి'' అంటూ సంఘీభావంగా ప్లకార్డులు ప్రదర్శిం చారు. ఈ సందర్భంగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యు రాలు సుభాషిణీ అలీ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ గద్దెనెక్కిన తరువాత మనుస్మృతికి అను గుణంగా దేశంలోని విద్యా విధానాన్ని మార్చాలని ప్రయత్నిస్తోం దని, అలాగే హిందూస్థాన్, హిందూరాష్ట్ర తదితర అంశాల ను ముందుకు తీసుకొచ్చి, హిందూత్వను రుద్దే కుట్ర జరుగుతోందని అన్నారు. అలాగే విద్యా రంగాన్ని కార్పొరే ట్లకు కట్టబట్టే కుట్ర జరుగుతోందని, అంబానీ, అదానీలకు యూనివర్శిటీలను దారాదత్తం చేస్త్తున్నారని, పేద ప్రజలకు విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు.
అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంపై తీవ్రమైన దాడి జరుగుతోందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ధ్వజమెత్తారు. ఆధునిక భారతదేశం ఆలోచనలన్నీ దాడికి లోనవుతున్నాయని, విద్యా వ్యవస్థను హిందూత్వ ప్రాజెక్టుగా మార్చే ప్రయత్నం జరుగుతుందని దుయ్యబట్టారు. డియుటిఎ అధ్యక్షుడు రాజీవ్ రారు మాట్లాడుతూ ఎన్ఈపి డ్రాఫ్ట్ ప్రతికూల సిఫారసులకు వ్యతిరేకంగా ఉమ్మడి ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎన్‌ఈపిని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోందని, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యా ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ, కాషాయికరణ అనేవి ఎన్‌ఈపిలో ఉన్నాయని తెలిపారు. జెఎన్‌యుటిఎ అధ్యక్షుడు డికె లోభియల్ మాట్లాడుతూ ఉన్నత విద్యపైన, మరీ ముఖ్యంగా యూనివర్శిటీలపై దాడి జరుగుతోందని, యూనివర్శిటీ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షురాలు ఐషీ ఘోష్ మాట్లాడుతూ జెఎన్‌యులోని పరిణామాలే అన్ని యూనివర్శిటీల్లో తలెత్తుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక యూనివర్శిటీల్లో ఫీజులు భారీగా పెంచారని, ఐఐటి, ఎన్ఐటీలను కూడా వదలటం లేదని అన్నారు. సెంట్రల్ యూనివర్శిటీల్లో ప్రజా స్వామ్య వాతావరణాన్ని ధ్వంసం చేశారని విమర్శించారు. విద్యార్థి వ్యతిరేక నూతన విద్యా విధానాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు నితీష్ నారాయణ్, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి ప్రతీష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యా రంగాన్ని సర్వనాశనం చేసేందుకు కుట్ర
