* నేటి నుండి శ్రీనగర్-బారాముల్లా రైలు సర్వీసు ప్రారంభం
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లో ఆంక్షలను సడలించడంతో కొన్ని మార్గాల్లో సోమవారం మినీ బస్సులు నడపగా, శ్రీనగర్-బారాముల్లా మార్గంలో రెండు సార్లు ట్రయల్ రన్‌ను రైల్వేలు చేపట్టాయి. ఈ మార్గంలో మంగళవారం నుండి తిరిగి రైలు సర్వీసులను నడపనున్నారు. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 నేపథ్యంలో ఆగస్టు 5 నుండి ఈ మార్గంలో రైలు సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ వ్యాలీలో 'షట్‌డౌన్' నెలకొన్న మూడు నెలల అనంతరం పూర్తి భద్రతా చర్యల మధ్య తొలిసారిగా రైలు ట్రయల్ రన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ట్రాక్ భద్రతను తనిఖీ చేసి, శ్రీనగర్-బనిహాల్ రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు చెప్పారు. దిగ్భంధనం అనంతరం సోమవారం తొలిసారిగా సిటి సెంటర్ గుండా బట్వారా-బాటామలూ మార్గంలో కొన్ని మినీ బస్సులు నడిచాయని అధికారులు తెలిపారు. ఇవే కాకుండా నగరంలో, ఇతర ప్రాంతాల్లో క్యాబ్‌లు, రిక్షాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ స్థంభిపోయిందని చెప్పారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ట్రాఫిక్ విభాగం అదనపు సిబ్బందిని విధుల్లో నియమించిందని చెప్పారు. మార్కెట్లు కొంత సేపు మాత్రమే తెరచి, ఒంటిగంటకు మూసివేసినట్లు అధికారులు చెప్పారు.
కాశ్మీర్లో రోడ్లపైకి మినీ బస్సులు
