న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో విచారణ ఇక్కడి ఎయిమ్స్ ట్రామా సెంటర్లో బుధవారం ప్రారంభమైంది. బిజెపి బహిష్కృత ఎంఎల్ఎ కులదీప్‌సింగ్ సెన్గార్ 2017లో తనను అత్యాచారం చేశాడని బాధిత యువతి ఫిర్యాదు చేసింది. అనంతరం రక్షణ కల్పించాలని 36 లేఖలు ఉన్నతాధికారులు, రాజకీయ నాయులు, పోలీసు అధికారులకు రాసినా స్పందించలేదు. రారుబరేలి వద్ద రోడ్డు ప్రమాదంలో బాధిత యువతి, ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడగా, ఆమె బంధువులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఎంఎల్ఎ సెన్గార్ చేయించాడని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో, నేర కుట్ర, కిడ్నాప్, అత్యాచారం తదితర కేసులు సెన్గార్పై నమోదు చేశారు. ఈ కేసు కోర్టు దృష్టికి రావడంతో బాధితురాలిని లక్నో ఆసుపత్రి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు విమానంలో తరలించి, వైద్యసేవలందించాలని ఆదేశించింది. బాధితురాలు కోర్టుకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎయిమ్స్‌లోనే బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఈ నెల 7న విచారణ కోర్టుకు సూచనలు జారీ చేసింది. ఎయిమ్స్ ట్రామా సెంటర్లో జిల్లా జడ్జి ధర్మేష్ శర్మ ఎదుట బుధవారం బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. బాధితురాలి నుంచి పూర్తి వివరాలు లభించేవరకూ వాంగ్మూలం నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ధర్మేష్ శర్మ తెలిపారు. ఈ కేసులో నిందితుడు, ఎమ్మెల్యే కులదీప్‌సింగ్ సెన్గార్ను విచారణ ప్రారంభమవ్వడానికి ముందు రోజే ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. అంతకుముందు ఈ యాక్సిడెంట్ కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని సిబిఐ నమోదు చేసింది.
ఎయిమ్స్‌లో ఉన్నావ్ బాధితురాలి వాంగ్మూలం నమోదు
