- భావప్రకటనా స్వేచ్ఛ లేకపోవడం వల్లే : కన్నన్
తిరువనంతపురం : గత ఏడాది కేరళ వరద సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్న ఎజిఎంయుటి (అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరం కేంద్ర పాలిత ప్రాంత) కేడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి కన్నన్ గోపీనాధ్ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్, హవేలీలో విద్యుత్, పట్టణాభివృద్ధి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన తన రాజీనామాను ఈ నెల 21న హోం శాఖ కార్యదర్శికి పంపారు. 2012లో సర్వీసులో చేరిన ఆయన మాట్లాడుతూ భావప్రకటనా స్వేచ్ఛను తిరిగి పొందేందుకు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆందోళన చెందుతున్నానని, ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని, దీనిపై ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ సర్వీస్ పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించిన తొలి కాశ్మీరీ, మాజీ ఐఎఎస్ అధికారి షా ఫైజల్‌ను అదుపులోకి తీసుకోవడంపై సర్వీస్ అధికారుల నుండి ఎటువంటి స్పందన రాలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు ఈ ఉద్యోగాల్లో చేరామని, పూర్తిగా భావ ప్రకటనా స్వేచ్ఛను కోల్పోయామని అన్నారు. హాంకాంగ్, ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆ నిర్ణయానికి ప్రజలు ప్రతిస్పందించే హక్కు కలిగి ఉన్నారని, ఇక్కడ ప్రజల అభిప్రాయానికి గౌరవం లేదని, ఇది మరింత ప్రమాదకరమని స్పష్టం చేశారు.
మరో ఐఎఎస్ అధికారి రాజీనామా
