- పోలవరం బాధితులపై ఎన్హెచ్ఆర్సిని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
పోలవరం బాధితులకు సంబంధించి మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని జాతీయ మావన హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సి)ని ఢిల్లీ హైకోర్టు ఆదేశిందించి. సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్ను గురువారం విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విభూ భక్రూతో కూడిన ధర్మాసనం ఎన్హెచ్ఆర్సి ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ, పోలవరం బాధితుల విషయంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను పున:పరిశీలించాలని ఎన్హెచ్ఆర్సీకి ఆదేశించింది. ఫిర్యాదు దారుని సంప్రదించి మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. విచారణ సందర్భంలో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అందుకు గిరిజన మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఎన్హెచ్ఆర్సి ఇచ్చే ఆదేశాలను పాటించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, బాధితులకు న్యాయం జరగాలని పేర్కొంది. పిటిషనర్ తరపున న్యాయవాది రాజేష్ గుంజన్ వాదనలు వినిపించారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో 2005, 2006లో భూసేకరణ పేరుతో నామమాత్రపు పరిహారం ఇచ్చారని, పోలవరం బాధితులను పదేళ్ల తరువాత ఉన్నపళంగా అక్కడ నుంచి వెల్లగొడుతున్నారని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని 2014లో జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)కి పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు చేశారు. దానిపై ఎన్హెచ్ఆర్సీ స్వతంత్ర బృందంతో పరిశీలన చేపట్టింది. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, బాధితులను బలవంతంగా పంపించేస్తున్నారని పరిశీలన బృందం తన రిపోర్టులో తెలిపింది. దాన్ని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ భూములు కోల్పోయే వాళ్ల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలని, వారికి తగిన పరిహారం ఇవ్వాలని సిఫార్సులు చేసింది. విచారణ జరుగుతున్న సమయంలోనే రేలా అనే స్వచ్ఛంద సంస్థ 2017లో సుప్రీం కోర్టులో పర్యావరణ ఉల్లంఘనలు, అటవీ హక్కుల చట్టం ఉల్లంఘనలు, అవినీతి అంశాలపై పిటిషన్ దాఖలు చేసింది. ఆ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న ఎన్హెచ్ఆర్సీ సుప్రీం కోర్టులో పోలవరానికి సంబంధించి చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయన్న కారణంగా పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోండి
