- రెండో స్థానంలో ఎపి : నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : ప్రజారోగ్య పరిరక్షణలో పెద్ద రాష్ట్రాల విభాగంలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి రెండు, మూడు స్థానాలు వరుసగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు దక్కించుకున్నాయి. అయితే దేశంలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్లు పేలవ పనితీరుతో చివరి స్థానాల్లో నిలిచాయి. రెండవ రౌండ్ హెల్త్ ఇండెక్స్‌్ వివరాలను 'హెల్తీ స్టేట్స్-ప్రోగ్రెసివ్ ఇండియా' పేరుతో నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మంగళవారం విడుదల చేశారు. పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనే మూడు కేటగిరీలుగా విభజించి ఈ ర్యాంకులను ప్రకటించింది. పెద్ద రాష్ట్రాల విభాగంలో గుజరాత్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. అయితే వార్షిక వృద్ధి పనితీరులో మాత్రం హర్యానా, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆరోగ్య రంగంలోని ముఖ్యమైన 23 అంశాల్లో అన్ని రాష్ట్రాల పనితీరును 2015-16 నుంచి 2017-18 మధ్య కాలంలో పరిశీలించి నీతిఆయోగ్ ఈ హెల్త్ ఇండెక్స్్ను ప్రకటించింది. అయితే చిన్న రాష్ట్రాల విభాగంలో మిజోరాం మొదటి స్థానంలో నిలిచింది. ఆరోగ్య పరిరక్షణ అంశాల్లో సాంవత్సరిక పనితీరు వృద్ధిలో త్రిపుర, మిజోరాం రాష్ట్రాలు ముందున్నాయి. అయితే సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఈ హెల్త్ ఇండెక్స్‌లో దారుణంగా వెనుకబడ్డాయి.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో విభాగంలో చత్తీస్‌ఘర్ మొదటి ర్యాంక్ సాధించగా, దాద్రా నగర్ హవేలీ మంచి పనితీరును కనపర్చింది.
ఆరోగ్య పరిరక్షణలో కేరళ 'ఫస్ట్'.. యుపి లాస్ట్...
