- ఢిల్లీ విమానాశ్రయాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాం
- జిఎంఆర్ అధినేత మల్లికార్జునరావు
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో :
దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ సేవలందించేదిగా తీర్చిదిద్దామని జిఎంఆర్ అధినేత జి.మల్లికార్జునరావు అన్నారు. సోమవారం విశాఖపట్నంలోని ఒక హోటల్లో ది వైజాగపటం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్లెన్ అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 45 సంవత్సరాల క్రితం మూడు లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన తన వ్యాపారాలు ప్రస్తుతం కోట్ల రూపాయలకు చేరాయన్నారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. సంస్థల నిర్వహణలో మానవ వనరుల పాత్ర అత్యంత కీలకమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ విలువలు పాటించే సంస్థగా ఎదగాలని చెప్పారు. సంస్థలను నెలకొల్పడం గొప్పకాదని, వాటిని అత్యంత విజయవంతంగా నడిపించడం ముఖ్యమన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, వినియోగదారుల అవసరాల నేపథ్యంలో పారిశ్రామిక సంస్థల జీవితకాలం గణనీయంగా తగ్గిపోతోందని చెప్పారు. మౌలికరంగ సంస్థలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న విశ్వాసంతో ఆ రంగంలోకి అడుగుపెట్టి విమానాశ్రయాల నిర్మాణ సంస్థలో ప్రపంచంలోనే మూడో అత్యుత్తమ సంస్థగా గుర్తింపు పొందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ది వైజాగపటం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు డివి.రాజు, ఉపాధ్యక్షుడు మల్లిక్ పాల్గొన్నారు. అనంతరం పలు విభాగాల్లో వ్యాపార, వాణిజ్యపరంగా ప్రతిభ చూపిన పలువురికి విసిసిఐ ఎక్స్లెన్స్ అవార్డులను గ్రంధి మల్లికార్జునరావు అందజేశారు. దసపల్లా హోటల్, విశాఖడెయిరీ, కె.రామబ్రహ్మం అండ్ సన్స్, దేవీ సీ ఫుడ్స్, శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ, నెక్కంటి సీ ఫుడ్స్, స్పింట్స్ ఎక్స్పోర్ట్స్ తదితర సంస్థలు ఈ అవార్డులను అందుకున్నాయి.
మౌలిక రంగ సంస్థలకు ఉజ్వల భవిష్యత్తు
